ఒరిస్సాను తుఫాను కుదిపేసింది. ఇది జరిగి నెల రోజులు గడిచింది. అయితే ఇప్పటికీ పూరి పట్టణంలోని ఆవాస కేంద్రాల్లో వందలాది మంది దళిత కుటుంబాలు బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నాయి.
తుఫాన్లకు ధనిక, పేద తేడాలుంటాయి. వీటివల్ల ఎక్కువగా నష్టపోయేది పేదలు అందులోనూ దళితులు, బీసీలు, మైనారిటీలు. తుఫాను పునరావాస కేంద్రాల నుంచి అన్ని కుటుంబాలు తమ ఇళ్లకు వెళ్లిపోయినప్పటికీ దళితులు మాత్రం అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. జరిగిన నష్టాన్ని అంచనా వేసే అధికారులు ఇప్పటికీ ప్రభుత్వానికి తమ నివేదికను అందజేయలేదు. సంపన్నులు ముఖ్యంగా అగ్రకులాల వారు బంధుమిత్రుల సహాయంతో దెబ్బతిన్న తమ ఇళ్లను బాగుచేయించుకోవటం లాంటి పనుల్లోపడ్డారు. దళితులకు మాత్రం సాయం చేసేవారు లేకపోవటంతో వందలాది కుటుంబాలు ఇంకా పునరావాస కేంద్రాల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వమేమో బాధితుల కోసం ఏర్పాటుచేసిన వంటశాలలు మూసివేసాయి. ఇక తప్పేదేముంది దళితులు ఎలాగో అలా తామే కడుపు నింపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వారు బియ్యం, రెండు వేల రూపాయలు డబ్బులు చొప్పున ఇచ్చారు. అవి ఎప్పుడో అయిపోయాయి. నెలరోజులుగా పనులు ఉద్యోగాలు బంద్. దీంతో రోజు గడవడం కష్టంగా ఉంది. ఇక వృద్ధులు, పిల్లలు, మహిళలకు కష్టాలే కష్టాలు. స్వచ్ఛంద సంస్థల వాళ్ళు సహాయం చేయటానికి గ్రామాలకు వచ్చినప్పుడు పెద్ద కులాల వారే దాదాపు అన్ని పొందుతున్నారు. దళితులదాకా వచ్చేది అరకొర! కొద్దిరోజుల్లో పాఠశాలలు తెరవబోతున్నారు. పాఠశాలల్లో తలదాచుకున్న దళితుల కుటుంబాలు అప్పుడు వీధిన పడవలసిందే.