-
2016లో కేసీఆర్ అమెరికా వెళ్లారట!
- పర్యటనపై జీవో కూడా ఇచ్చారట!
- ఖర్చెంతో వ్యవసాయ శాఖకు తెలుసట!
- ఆర్టీఐ దరఖాస్తుకు జీఏడీ వింత జవాబు
- సీఎంకి తెలీకుండా ఏమైనా జరిగిందా?
- ముసురుకుంటున్న సందేహాలు
హైదరాబాద్ : అది 2016వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజున హైదరాబాద్ రాజ్‌భవన్‌లో నాటి రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. రెండ్రోజుల తర్వాత… సెప్టెంబరు 1వ తేదీన నాటి శాసనసభ కార్యదర్శి రాజా సదారాం హైదరాబాద్‌లోని క్యాంప్ ఆఫీసుకు వచ్చి కేసీఆర్‌ను కలుసుకున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు అన్ని పత్రికల్లో వచ్చాయి. అంటే ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ కేసీఆర్ హైదరాబాద్‌లోనే ఉన్నారు. అయితే ఆ మూడు రోజులూ కేసీఆర్ దేశంలోనే లేరని, అమెరికా పర్యటనలో ఉన్నారని రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) చెబుతోంది. సమాచార హక్కు చట్టం కింద ఓ వ్యక్తి చేసుకున్న దరఖాస్తుకు వారు ఇచ్చిన సమాధానం అచ్చంగా ఇదే మరి!
‘‘సీఎం కేసీఆర్ 2014 జూన్ 2 నుంచి 2020 ఫిబ్రవరి 15 వరకు ఏయే విదేశీ పర్యటనలు చేశారు, ఒక్కో పర్యటనకు ఎంత ఖర్చయింది? ఆయా పర్యటనల్లో సీఎం వెంట వెళ్లిన అధికారులెవరు? వారి పర్యటనకు ఎంత ఖర్చయింది?’’ వీటితోపాటు వివిధ అంశాలపై వివరాలు తెలపాల్సిందిగా జలగం సుధీర్ అనే ఆయన సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. దీనికి జీఏడీ గత ఫిబ్రవరి 27న సమాధానం ఇచ్చింది. ఆరేళ్లలో కేసీఆర్ మూడు విదేశీ పర్యటనలు చేసినట్లు తెలిపింది. 2014 ఆగస్టులో సింగపూర్-మలేషియాలను, 2015 సెప్టెంబర్‌లో చైనాను కేసీఆర్ సందర్శించినట్లు వెల్లడించింది. అయితే 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకు కేసీఆర్ అమెరికా పర్యటనలో ఉన్నట్లు తెలపడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మొదటి రెండు పర్యటనలకు అయిన ఖర్చు వివరాలు పరిశ్రమల శాఖ వద్ద, అమెరికా పర్యటన ఖర్చు వివరాలు వ్యవసాయ శాఖ వద్ద ఉన్నాయని జీఏడీ పేర్కొంది. అయితే ఆ ఖర్చుల వివరాలేవీ వెల్లడించలేదు. ఈ పర్యటనలకు సంబంధించి జారీ చేసిన జీవోల వివరాలను కూడా జీఏడీ తెలిపింది. కేసీఆర్ అమెరికా పర్యటనకు సంబంధించి 2016 ఆగస్టు 26న జీవో ఆర్టీ నంబర్ 1895 జారీ అయినట్లు ప్రకటించింది.
అమెరికాలో 2016 ఆగస్టు 30 నుంచి సెప్టెంబరు 1 వరకూ జరిగే ఓ వ్యవసాయ సదస్సుకు రావాల్సిందిగా ఆ ఏడాది జులైలో సీఎంకు ఆహ్వానం అందింది. కానీ కేసీఆర్ ఆ పర్యటనకు వెళ్లలేదు. ఆ మూడు రోజులూ హైదరాబాద్‌లోనే బిజీగా ఉన్నారు. అలాంటప్పుడు ఈ జీవో ఎలా జారీ అయింది? ఈ జీవో విషయం సీఎంకు తెలుసా? సీఎంకు తెలియకుండా ఆయన పర్యటనకు ఖర్చుల కింద ఏమైనా మొత్తాన్ని విడుదల చేశారా? అనేది మిస్టరీగా మారింది. ఒకవేళ జీవో జారీ అయిన తర్వాత ఆఖరి నిముషంలో పర్యటన రద్దయి ఉంటే సమాచార హక్కు దరఖాస్తుదారుడికి ఇప్పుడు ఇంత తప్పుడు సమాచారం ఎలా ఇచ్చారనేది కూడా మరో మిస్టరీ!!
2016, ఆగస్టు 30వ తేదీన రాజ్‌భవన్‌లో నాటి గవర్నర్ నరసింహన్‌ను కలిసిన సీఎం కేసీఆర్.
2016, సెప్టెంబరు 1వ తేదీన అసెంబ్లీ కార్యదర్శిగా మూడోసారి పొడిగింపు పొందిన రాజా సదారాం.. సీఎం కేసీఆర్‌ను కలిసిన దృశ్యం
Courtesy Andhrajyothi