- 13,500 కిలోల బంగారం..
- 2.68 లక్షల కోట్ల నగదు
- చైనాలో లంచగొండి అధికారి సంపద వీడియో వైరల్
బీజింగ్, అక్టోబరు 3: అక్షరాలా రూ.4500 కోట్లకు పైగా విలువ చేసే 13,500 కిలోల బంగారం! మన కరెన్సీ ప్రకారం.. రెండు లక్షల అరవైనాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే నగదు!! ఏక్కడ ఆఫ్రికా ఖండంలో ఒక చిన్న దేశం తాలూకూ ఆస్తి కాదు ఇది! చైనాలో ఒక అవినీతి అనకొండ కలుగులో దొరికిన సంపద!! అతని ఇంటిలో సోదాలు చేసిన అధికారులు.. పెద్ద పెద్ద ర్యాకుల్లో ప్లాస్టిక్ సంచుల్లో మూటలు కట్టిన వేలాది బంగారు కడ్డీలు, బంగారు ఇటుకలను చూసి నివ్వెరపోయారు. ఆ మూటలు విప్పి వాటిలోని బంగారాన్ని లెక్కించడానికే వారికి అలుపొచ్చింది. 13,500 కిలోల బంగారాన్ని పోగేసిన ఆ అవినీతి అనకొండ పేరు.. జాంగ్ క్వి. వయసు 58. చైనాలో అత్యంత శక్తిమంతమైన కమ్యూనిస్టు పార్టీ అధికారి. హైనాన్ ప్రావిన్సు రాజధాని హైకౌలో మేయర్ స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్న జాంగ్ క్వి ఈ బంగారాన్ని, డబ్బును లంచాల ద్వారానే సంపాదించాడు. వీటికితోడు పలు విలాసవంతమైన విల్లాలను కూడా లంచంగా పుచ్చుకున్నట్టు సమాచారం. అతడిపై ఉన్న ఆరోపణలన్నీ రుజువైతే.. చైనాకు చెందిన ప్రముఖ వ్యాపార దిగ్గజం, అలీబాబా వెబ్సైట్ అధినేత జాక్మా ఆస్తుల కంటే జాంగ్ క్వి సంపదే ఎక్కువ అవుతుంది!! జాంగ్ క్వి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేసి.. బంగారు కడ్డీలు, ఇటుకలను లెక్కిస్తున్నప్పుడు తీసిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. చైనా ప్రభుత్వం అతణ్ని అన్ని విధుల నుంచి తొలగించింది. 2012లో షీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచీ అవినీతి వ్యతిరేక ఉద్యమానికి తెరతీశారు. ఈ ఏడేళ్లలో 53 మంది అధికారులను పట్టుకొన్నారు.
Courtesy Andhra Jyothy..