చిదంబరం పరుగో పరుగు!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

  • అజ్ఞాతంలోకి వెళ్లిన కాంగ్రెస్‌ అగ్రనేత
  • ఏ క్షణంలోనైనా అరెస్టయ్యే అవకాశం
  • ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో ఆరోపణలు
  • ముందస్తు బెయిల్‌ రద్దు చేసిన హైకోర్టు
  • ఇదో పెద్ద నేరం.. చిదంబరమే సూత్రధారి
  • మనీ లాండరింగ్‌కు అతి పెద్ద ఉదాహరణ
  • దీన్ని ఉక్కు సంకల్పంతో ఛేదించాల్సిందే
  • కస్టడీలో ఉంచి ఇంటరాగేట్‌ చేయాల్సిందే
  • ఇలాంటి వారందరికీ బెయిల్‌ ఇస్తూపోతే
  • సమాజానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి
  • కుంభకోణంపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు
  • చిదంబరం అరెస్టుకు సిద్ధమైన ఈడీ, సీబీఐ
  • వెంటనే సుప్రీం తలుపుతట్టిన మాజీ మంత్రి
  • తక్షణం వినేందుకు చీఫ్‌ జస్టిస్‌ నిరాకరణ
  • అప్పీలు స్వీకరణపై నేడు కోర్టు నిర్ణయం
  • ఢిల్లీలోని ఇంటికి వెళ్లిన దర్యాప్తు బృందాలు
  • ఆయన కోసం గాలిస్తున్నట్టు అధికార్ల వెల్లడి

మంగళవారం మధ్యాహ్నం! ఢిల్లీలోని సుప్రీం కోర్టు ప్రాంగణం! కారిడార్‌లో ఒకవైపు నుంచి కేంద్ర మాజీ మంత్రి చిదంబరం పరుగులు పెడుతూ వెళుతున్నారు! మరో వైపు నుంచి సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ ఉరుకులు పరుగులతో వస్తున్నారు! పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వడి వడిగా మరో ఇద్దరు సీనియర్‌ న్యాయవాదులు సల్మాన్‌ ఖుర్షీద్‌, అభిషేక్‌ మను సింఘ్వి చేరుకున్నారు! ఆ నలుగురూ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌ నేతలు! దేశంలోనే ప్రఖ్యాత న్యాయవాదులు కూడా! అంత హడావుడిగా వారు ఒకేచోటకు చేరింది.. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ దిగ్గజం చిదంబరాన్ని అరెస్టు నుంచి తప్పించడానికే!

చిదంబరంపై కేసులు అవినీతి విలువ
ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు -305 కోట్లు
ఎయిర్‌సెల్‌ మాక్సిస్‌ కేసు- 3,500 కోట్లు
విమానాల కొనుగోలు కేసు- 1,272 కోట్లు
మూన్‌ టెక్నాలజీస్‌ కేసు- 5,660 కోట్లు

కాంగ్రెస్‌ అగ్ర నేత… మాజీ ఆర్థిక మంత్రి… మాజీ హోం మంత్రి… మాజీ వాణిజ్య మంత్రి… ఒకప్పుడు ప్రధాని రేసులో నిలిచిన దిగ్గజం… సుప్రీం కోర్టు న్యాయవాది ఆయిన తమిళ నాడు నేత చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో నిందితుడిగా ఉన్న ఆయన కోసం సీబీఐ, ఈడీ బృందాలు గాలిస్తున్నాయి. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న ఆయన విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు అనుమతి ఇచ్చారు. ఆ కంపెనీ పెట్టుబడులు సేకరించింది చిదంబరం తనయుడు కార్తి కంపెనీల నుంచే! ఈ కంపెనీల మధ్య 305 కోట్లు చేతులు మారాయని కేసు నమోదైంది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు చిదంబరానికి గతంలో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై స్టే ఇచ్చింది. దానిని తాజాగా రద్దు చేసింది. సత్వరమే ఈ కేసు వినేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. దాంతో, చిదంబరం అరెస్టు ముంగిట నిలిచారు! ఏ క్షణంలో అయినా ఆయనను అరెస్టు చేయడానికి సీబీఐ సిద్ధంగా ఉంది. ఢిల్లీలోని ఇంట్లో చిదంబరం కనిపించడం లేదని ఆయన కోసం గాలిస్తున్నామని అధికారులు ప్రకటించారు. మంగళవారం రాత్రి 1:30లోగా లొంగిపోవాలని అల్టిమేటం ఇచ్చారు. దేశంలో ఈ స్థాయి అగ్రనాయకుడు ఒకరు ఇంతటి స్కాంలో నిందితుడిగా మారి అజ్ఞాతంలోకి వెళ్లడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు.

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. తాను సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుంటానని, అంతవరకూ తనను అరెస్టు చేయకుండా తాత్కాలిక రక్షణ కల్పించాలంటూ చిదంబరం చేసిన వినతిని కూడా తోసిపుచ్చింది. ‘‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ విచారణకు ఆయన సహకరించడం లేదు. ఆయనను కస్టడీలోకి తీసుకొని ఇంటరాగేట్‌ చేయాల్సిన అవసరం ఉందని గట్టిగా భావిస్తున్నాం’’ అని జడ్జి జస్టిస్‌ సునీల్‌ గౌర్‌ స్పష్టం చేశారు. ఈ భారీ ఆర్థిక కుంభకోణానికి ఆయనే ప్రధాన సూత్రధారి, కుట్రదారు అని కోర్టు విస్పష్టంగా పేర్కొంది. ‘‘ఇంత పెద్ద ఆర్థిక నేరాన్ని పరిశోధించేందుకు ప్రయత్నిస్తున్న దర్యాప్తు సంస్థల చేతులు కట్టేయరాదు. భారీ సాక్ష్యాధారాలను చూసి.. ముందస్తు అరెస్టు నుంచి పిటిషనర్‌కు ఇచ్చిన మినహాయింపును ఎత్తేయాలని భావిస్తున్నాం’’ అని జస్టిస్‌ గౌర్‌ స్పష్టంచేశారు. చిదంబరం ఎంపీ అయినంత మాత్రాన అరెస్టు చేయరాదన్న నిబంధన ఏదీ లేదని వ్యాఖ్యానించారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే తనను ఈ కేసులో ఇరికించారన్న చిదంబరం వాదనను జడ్జి కొట్టిపడేశారు. అంతకుముందు, ఈడీ తన వాదనను జడ్జి ఎదుట వినిపించింది. ఈ కేసులో ఎన్నో మార్లు తాము ప్రశ్నించామని, ప్రతిసారీ చిదంబరం దాటవేత వైఖరి అవలంబిస్తూ వచ్చారని, ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తే తప్ప నిజాలు బయటకు రావని ఈడీ ఢిల్లీ హైకోర్టుకు విన్నవించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియాకు ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్‌ రావడం వెనక ఆయన కుమారుడు కార్తి జోక్యం సుస్పష్టమని తెలిపింది.

అజ్ఞాతంలోకి చిదంబరం 
ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. తక్షణమే మంగళవారమే పిటిషన్‌ను వినేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. బుధవారం మధ్యాహ్నం వరకూ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో, అరెస్టుకు ఈడీ, సీబీఐ రంగం సిద్ధం చేశాయి. ఈ నేపథ్యంలో చిదంబరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నిజానికి, ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత ఈడీ సాయంత్రం 6.30 గంటల సమయంలో, రాత్రి 7.30 సమయంలో సీబీఐ జోర్‌బాగ్‌లోని చిదంబరం నివాసానికి వెళ్లింది. కానీ, ఆయన ఇంట్లో లేరు. ఆయన రెండు ఫోన్లు స్విచాఫ్‌ చేసి ఉన్నాయి. ఆయన ఎక్కడకు వెళ్లిందీ తెలియదని కుటుంబ సభ్యులు చెప్పారు.
ఆఖరి కేసు ఇదే!

జస్టిస్‌ గౌర్‌ తీర్పు ఇచ్చిన పెద్దది.. ఆఖరి కేసు చిదంబరానిదే. గురువారం ఆయన పదవీ విరమణ చేయనున్నారు. నిజానికి, జనవరి 25న చిదంబరం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును జస్టిస్‌ గౌర్‌ వాయిదా వేశారు. అరెస్టు చేయొద్దని జూలై25న రూలింగ్‌ ఇచ్చారు.

సుప్రీం కారిడార్‌లో సిబల్‌, చిదంబరం పరుగులు

ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు రద్దు చేయడంతో చిదంబరం అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయన అరెస్టుకు సీబీఐ, ఈడీ సిద్ధమవుతున్నాయి. ఈ విషయం తెలిసిన చిదంబరం ఆగమేఘాల మీద సుప్రీం కోర్టుకు చేరుకున్నారు. ఏం చేద్దామంటూ పార్టీ సహచరుడు, సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌కు ఫోన్‌ చేశారు. కోర్టులో వేరేచోట ఉన్న సిబల్‌ పరుగుపరుగున చిదంబరం దగ్గరకు వెళ్లారు. ఈ సమయంలో, అటు సిబల్‌, ఇటు చిదంబరం సుప్రీం కోర్టు కారిడార్లలో పరుగులు పెట్టడం కనిపించింది. వడివడిగా నడుస్తూ మరో ఇద్దరు కాంగ్రెస్‌ సీనియర్లు, లాయర్లు అభిషేక్‌ మను సింఘ్వీ, సల్మాన్‌ ఖుర్షీద్‌ కూడా వారి వద్దకు చేరుకున్నారు. ఉన్నఫళంగా తమ వాదనను ఆలకించాలంటూ చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ చాంబర్‌ వద్దకు వెళ్లారు. కానీ, జస్టిస్‌ గొగోయ్‌ వారిని లోనికి అనుమతించలేదు. వెంటనే తాను వినేది లేదని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. దాంతో, ఏం చేయాలన్న దానిపై చిదంబరం శరవేగంగా ఆలోచించారు. వ్యవహారాలు బాగా తెలిసిన ఓ కోర్టు అధికారిని సిబల్‌ సలహా కోరారు. ‘‘ఈరోజు (మంగళవారం) ఎలాగూ కుదరదు. సీజే తేల్చి చెప్పేశారు. ఇక రేపు (బుధవారం) ఫస్ట్‌ అవర్లో ఇది వచ్చేట్లు చేయాలి. అప్పీలు పిటిషన్‌ను కోర్టు బుధవారం అత్యవసరంగా పరిశీలించేలా చేసేందుకు వెంటనే దానిని రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌) సూర్య ప్రతాప్‌ సింగ్‌కు అందజేయండి’’ అని ఆ అధికారి సూచించారు. దాంతో, సిబలే స్వయంగా రిజిస్ట్రార్‌ దగ్గరకు వెళ్లి ఆ పిటిషన్‌ను సమర్పించారు.సాధారణంగా ఎమర్జెన్సీ పిటిషన్లను విచారణకు స్వీకరించాలా వద్దా అనే విషయాన్ని ప్రధాన న్యాయమూర్తే ఏరోజుకారోజు నిర్ణయిస్తారు. కానీ, బుధవారం జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ అయోధ్య కేసుకు సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనంలో ఉంటారు. ఈ పిటిషన్‌ను పరిశీలించే బాధ్యతను జస్టిస్‌ ఎన్వీ రమణకు అప్పగించవచ్చని సిబల్‌ తెలిపారు. ఆగా.. ఈ కేసులో ప్రధాన నిందితుడైన కార్తి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది.

ఏమిటీ ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసు!?

చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నారు. ఆ హోదాలో విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక విభాగం (ఎఫ్‌ఐపీబీ) సమావేశాలనూ ఆయనే నిర్వహించేవారు. ఆ సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఐఎన్‌ఎక్స్‌ మీడియా అనే సంస్థకు విదేశీ పెట్టుబడులు సేకరించేందుకు అనుమతి ఇవ్వడం ఈ కేసుకు మూలాధారం. ఐఎన్‌ఎక్స్‌ మీడియా అనే సంస్థ పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీలది. అడ్వాంటేజ్‌ ఇండియా, సింగపూర్‌లోని దాని అనుబంధ సంస్థ అడ్వాంటేజ్‌ సింగపూర్‌ నుంచి ఐఎన్‌ఎక్స్‌ మీడియా పెట్టుబడులు సేకరించినట్లు రికార్డుల్లో చూపారు. ఈ రెండు కంపెనీలూ చిదంబరం కుమారుడు, ప్రస్తుత ఎంపీ కార్తి చిదంబరానివే! తండ్రి పదవి అండతో.. విదేశీ పెట్టుబడులకు అనుమతులను సులభంగానే సాధించారు. ఎఫ్‌ఐపీబీ అనుమతులు తీసుకోకుండా ఐఎన్‌ఎక్స్‌ న్యూస్‌ లిమిటెడ్‌ అనే సంస్థను ఏర్పాటు చేసి, అందులో 26ు పెట్టుబడులు పెట్టారు. తండ్రి ఆర్థిక మంత్రి కావడంతో దీన్ని అడిగేవారే లేకపోయారు. ఇప్పుడు ఈ కేసులో కీలక నిందితులైన పీటర్‌ ముఖర్జీ, ఇంద్రాణీ ముఖర్జీ దంపతులు అప్రూవర్లుగా మారారు. తమ మీదకు కేసు రాకుండా చూసుకునేందుకు కార్తికి వారు రూ.10 లక్షలు లంచమిచ్చారని సీబీఐ ఆరోపిస్తోంది.

 

(Courtacy Andhrajyothi)

RELATED ARTICLES

Latest Updates