
కరోనా మహమ్మారి వ్యాప్తితో దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. కరోనా వ్యాప్తి కాలంలో…అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ లలో…అత్యంత అధ్వాన్నంగా నిర్వహించబడిన ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ప్రపంచ స్థాయి గుర్తింపు సంపాదించుకుంది. ఇదంతా ఎలా సాధ్యమైంది? ‘దైవ లీల’ మాత్రం కాదు. ప్రస్తుత నాయకత్వ ఉదాసీనత, దుర్బలత్వం, అశక్తత వల్లనే ఈ స్థితికి చేరుకున్నాం.
క్షీణత గణాంకాలు
ఏప్రిల్-జూన్ 2020లో అంచనా వేయబడిన 24 శాతం స్థూల దేశీయ ఉత్పత్తి (జిడిపి)ని ఇంతకు ముందు సంవత్సరంతో పోల్చినప్పుడు….జి-20 ఆర్థిక వ్యవస్థలలో (ఇతర దక్షిణ ఆసియా దేశాలతో పోల్చినప్పటికీ) మన దేశ ఆర్థిక వ్యవస్థ అద్వాన్నమైన స్థితిలో ఉంది. కానీ ఇవి తక్కువగా అంచనా వేయబడిన సంఖ్యలు. ఎందుకంటే ఆ సంఖ్యలు సంఘటిత రంగానికి సంబంధించిన సమాచారంపై ఆధారపడినవి. అయినప్పటికీ వాటిని అసంఘటిత రంగానికి సంబంధించి నవిగా చూపించారు. వాస్తవ క్షీణత బహుశా అత్యంత అధ్వాన్నంగా ఉండి ఉంటుంది. భౌతిక సూచికలైన పారిశ్రామిక ఉత్పత్తి 20 శాతానికి పైగా క్షీణించింది. కానీ అసంఘటి త వస్తూత్పత్తులు అంతకంటే ఎక్కువగానే క్షీణించాయని క్షేత్ర స్థాయి నివేదికలు తెలియజేస్తున్నాయి. వస్తూత్పత్తి, సేవలకు చెందిన అనేక సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఇ) ఇప్పటికీ మూతపడి ఉన్నాయి, కొన్ని సంస్థలు మాత్రమే నిర్వహణలో ఉన్నాయి. ఉపాధి క్షీణత, వేతనాల రేటు తగ్గుదల వలనే వేతన ఆదాయాలు జీడీపీ కంటే వేగంగా పడిపోయాయి.
జీడీపీ గణాంకాలలో అప్రమాణికమైన అంశం ఒకటుంది. వ్యవసాయ రంగం మినహా ప్రతీ రంగం, ముఖ్యంగా ఎక్కువ ఉపాధిని కల్పించే రంగాలు చాలా వేగంగా క్షీణించాయి. రబీ సీజన్లో అనుకూలమైన రుతుపవనాలు, మంచి పంట దిగుబడులు వ్యవసాయ రంగంలో కొంత ఉపశమనాన్ని కలుగజేశాయి. కానీ ఆదాయాలు తగ్గాయి, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కూడా పొందలేక పోవడం వల్ల సంవత్సర కాలంలో రైతులు ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందలేదు. గత సంవత్సరం ఇదే కాలంలో ప్రభుత్వ వినియోగపు వ్యయం 16 శాతం పెరిగింది. కానీ మొత్తం పెట్టుబడి (సగానికి సగం) అత్యంత వేగంగా పడిపోయింది కాబట్టి, ప్రభుత్వ పెట్టుబడి కూడా తగ్గుతుంది. ప్రభుత్వ పరిపాలన, రక్షణ, ఇతర సేవల రంగాల్లో కూడా చేరిన స్థూల విలువ 10 శాతానికి పైగా తగ్గింది. తగ్గిన ఆ 10 శాతంలో సుమారు 90 శాతం జీతాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ జీతాలు తగ్గలేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలపై కచ్చితంగా ఒత్తిడి పడుతుంది. అనేక రాష్ట్రాల్లో జీతాల చెల్లింపుల్లో ఆలస్యం చేయడం లేదా జీతాలు స్తంభింపచేయడం జరుగుతుంది.
తీవ్రమైన అవస్థలు
ఈ క్రమంలో కరోనా మహమ్మారి అడ్డూ అదుపు లేకుండా కొనసాగుతునే ఉంది. దీనిని సరిచేయాలంటూ చెప్పిన అందరి మాటలు మాయమైనాయి. వాటి స్థానంలో పూర్తిగా అర్థంలేని విధంగా రికవరీ రేటు సూచిక వచ్చి చేరింది. అనాగరిక జాతీయ లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థ పతనాన్ని సృష్టించింది. ఈ పతనం కరోనా వ్యాప్తికి ముందు కూడా బాగానే ఉంది. పరీక్షించడం, గుర్తించడం, ఐసొలేషన్‌లో ఉంచడం, చికిత్సను అందించడానికి బదులుగా (ఖరీదైన చర్యలైనప్పటికీ, వ్యాధిని నిరోధించే ఏకైక మార్గం ఇదే) కేంద్ర ప్రభుత్వం ఎటువంటి హెచ్చరికలు జారీ చేయకుండా లాక్‌డౌన్ ప్రకటన ద్వారా దేశ వ్యాప్తంగా అన్నింటినీ మూయించివేసింది. తర్వాత, జీవనాధారాలను కోల్పోయిన 80 శాతం మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన నష్టపరిహారాన్ని గానీ, సామాజిక రక్షణను గానీ సమకూర్చలేదు. వలస కార్మికులను తమ తమ స్వస్థలాలకు తిరిగి వెళ్ళమని ఒత్తిడి చేసి అత్యంత భయానకమైన పరిస్థితుల్లో వారిని వెళ్ళగొట్టారు. స్వస్థలాలకు తిరిగి వెళ్ళిన వలస కార్మికులు అక్కడ ఉన్న దయనీయమైన ఆరోగ్య పరిస్థితుల కారణంగా…గ్రామీణ ప్రాంతాల్లో తమకు తెలియకుండానే ఈ వ్యాధిని వ్యాపింపచేశారు. అక్కడ తగినంత ఆహారాన్ని పొందలేక పోవడం, పౌష్టికాహార లోపాల కారణంగా…శ్రామిక ప్రజలు కడు పేదవారుగా, దుర్భలులుగా మారిపోయారు. కరోనా వ్యాధి ప్రమాదకరమైన పరిస్థితులను పెంచుతున్న ఈ తరుణంలో కూడా తక్కువ వేతనాలకు పని చేయడానికి తిరిగి రమ్మని వలస కార్మికులను ఇప్పుడు మళ్ళీ ఒత్తిడి చేస్తున్నారు.
ఇది ఇప్పటికీ ప్రారంభం మాత్రమే. ఆర్థిక వ్యవస్థ, వైద్య విధానాలకు సంబంధించి ప్రభుత్వ వ్యూహంలో ఒక పెద్ద మార్పు రాకపోతే…ఈ భయంకరమైన పరిస్థితి ఇలాగే నిలిచి ఉంటుందనేందుకు ఒక చిన్న కారణం ఉంది. ఆర్థిక వ్యవస్థ బలహీనపడడం అనేది ప్రస్తుత త్రైమాసికంలోకి కూడా కచ్చితంగా విస్తరిస్తుంది. బహుశా సంవత్స రంలో మిగిలిన కాలంలో కూడా విస్తరించవచ్చు. అందువలన మనం స్వతంత్ర భారతదేశంలో పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని చూస్తున్నాం.
రాష్ట్రాలకు దెబ్బ
డిమాండ్ లేకపోవడమే ప్రస్తుత పరిస్థితులకు ఒక ముఖ్యమైన కారణం. కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కంటే ముందే వినియోగం, పెట్టుబడులు క్షీణిస్తూ వచ్చాయి. ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థ పెద్ద ఎత్తున పతనం అయినప్పటికీ, ప్రభుత్వం నుంచి అందిన సహాయక చర్యలు చాలా తక్కువగా ఉండడం దయనీయమైన విషయం. మిలియన్ల సంఖ్యలో ప్రజలు బాధలకు గురైతే…అతి కష్టం మీద వందల సంఖ్య లోని ప్రజలకు మాత్రమే సహాయం చేరింది. మొత్తం మీద డిమాండ్ మీద చాలా కొద్ది ప్రభావాన్ని చూపింది. ఆస్తులను డబ్బుగా మార్చేందుకు అన్యమనస్కంగా తీసుకున్న కొద్దిపాటి చర్యలు నిరుపయోగం అయ్యాయి. బ్యాంక్ రుణాలు ఇవ్వడం మొత్తంగానే తగ్గింది. అన్ని రకాల రుణగ్రస్థులకు బ్యాంక్‌ల నుండి చాలా తక్కువ రుణాలు మాత్రమే అందాయి.
ఇకపోతే, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యంత అవమానకరమైన నిరాదరణకు గురవుతున్నాయి. జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం అమలు కేంద్రీకరించబడింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేదు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఆర్థిక వ్యవస్థలో సంభవించిన పరిణామాలను, ఆరోగ్య సంక్షోభాలను నిరోధించే భారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే మోయాలని కేంద్రం ఒత్తిడి చేస్తోంది. ఈ నిర్వహణకు అవసరమైన వనరులను సమకూర్చేందుకు కేంద్రం నిరాకరించింది. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆఖరికి రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయబద్ధంగా చెల్లించవలసిన వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) నష్ట పరిహారాన్ని కూడా నిరాకరిస్తోంది. అధ్వాన్నంగా ఏర్పాటు చేసి ఘోరంగా అమలు చేసిన జిఎస్‌టి కి, పైపరిణామాలు అంతం పలుకుతాయి.
నేడు దేశ ప్రజలు వీటి దుష్ఫలితాలను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు తమ దగ్గర ఉన్న డబ్బును ముందుగానే ఖర్చు చేశాయి. ఇప్పుడు ఆ రాష్ట్రాల దగ్గర డబ్బు లేకుండా పోయింది. కేంద్రంలా కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన బడ్జెట్ ఒప్పందాలను ఎదుర్కొనవలసి ఉంటుంది. అదే విధంగా రాష్ట్రాలు తమ ఆదాయాలు పెంచుకునే అధికారాలను జిఎస్‌టి కి వదిలి వేశాయి. తాము చెల్లించాల్సిన జిఎస్‌టి బకాయిలను ఎప్పుడు ఎలా చెల్లించేది సందిగ్ధంలో ఉంది కాబట్టి…అప్పు చేసి డబ్బు తెచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం చెబుతోంది. ఇది సంవత్సరంలో మిగిలిన కాలంలో చేయాల్సిన ఖర్చు పైన కూడా ప్రభావం చూపుతుంది. దీనివల్ల ప్రాథమిక సేవలలోని తగ్గుదల ప్రభావం కూడా ప్రజలపై పడుతుంది.
ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి
సరైన విధానాలతో ఈ సంక్షోభాన్ని నివారించవచ్చు. ఇప్పటికైనా ఈ భయంకరమైన ధోరణిని తిప్పికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఒక పెద్ద ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతోపాటు (వాస్తవంగా డబ్బు అందుబాటులో ఉండే విధంగా, ఉట్టి వాగ్దానాలు కాకుండా) అనేక చర్యలు చేపట్టాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు జిఎస్‌టి నష్టపరిహార బకాయిలను వెంటనే చెల్లించాలి. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రభావాలను కట్టడి చేసేందుకు రాష్ట్రాలకు మరిన్ని వనరులను సమకూర్చాలి. ప్రజా పంపిణీ వ్యవస్థను (పిడిఎస్) ప్రజలందరికీ వర్తింపచేయాలి. ప్రతీ కుటుంబానికి నెలకు 10 కేజీల ఆహార ధాన్యాలను ఉచితంగా కనీసం ఆరు నెలల పాటు అవసరం ఉన్న వారందరికీ అందించాలి. క్రూరమైన లాక్‌డౌన్ కాలంలో ఆదాయాలు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా ప్రతీ కుటుంబానికి నెలకు రూ.7,500 చొప్పున మూడు నెలల పాటు చెల్లించాలి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద ప్రతీ కుటుంబానికి రెట్టింపు పని దినాలు (అంటే 200 రోజులు కనీసం ఈ సంవత్సరం లోనైనా) కల్పించాలి.
రుణాల మారటోరియంను పొడిగించి, తీసుకున్న రుణాలకు ఆ మారటోరియం కాలానికి వడ్డీ చెల్లింపులు లేకుండా పూర్తిగా నిలుపుదల చేయాలి. అదే విధంగా రుణాల నిరాకరణకు గురైన ఎంఎస్‌ఎంఇ లకు, రైతులకు మళ్ళీ రుణ సదుపాయాలు కల్పించాలి. వైద్య రంగానికి సంబంధించిన అన్ని వనరులను, కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు అవసరమైన వనరులను, గత ఐదారు నెలలుగా వాయిదా వేసిన ఇతర ఆరోగ్య సంబంధిత సమస్యల పరిష్కారం కోసం అన్ని రకాల వనరులను సమకూర్చాలి.
వీటిని సమకూర్చడానికి గాను డబ్బును భారీ మొత్తంలో ఖర్చు చేయాలి. కానీ వీటిని సమకూర్చనట్లయితే ఆర్థిక వ్యవస్థకు, ప్రజలకు ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఖర్చు చేయనిపక్షంలో ఆర్థిక వ్యవస్థ అగాధం లోకి నెట్టి వేయబడుతుంది. ఆదాయాలు తగ్గి…పన్నులు కూడా తగ్గి పోతాయి.
అందువలన భారీ ద్రవ్య లోటు ఏర్పడుతుంది. ఇప్పడు పెరిగిన ఖర్చులకు కేంద్రం ఆర్‌బిఐ నుండి అప్పు చేసి చెల్లించవచ్చు (ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల ప్రభుత్వాలు ద్రవ్య లోటును పూడ్చేందుకు చేస్తున్న విధంగా). నిత్యావసర సరఫరాలు నిర్వహించబడుతున్నంత వరకు ఇది ద్రవ్యోల్బణం కాదు. ఎందుకంటే ప్రస్తుతం డిమాండ్ బాగా తక్కువగా ఉంది. చివరిగా, బహుళ జాతి కంపెనీల పైన సంపద పన్నులు, ఇతర పన్నులు (ముఖ్యంగా పన్నులు చెల్లించకుండా తప్పించుకొనే పెద్దలకు) విధించే ఆలోచన కచ్చితంగా చెయ్యాలి. దీనినుండి బయట పడాలంటే సాహసోపేతమైన ఆలోచనలతో పాటు వేగవంతమైన చర్యలే మార్గం.