పుస్తకాలు, స్నేహితులతోనే కాలక్షేపం
వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు : రావెల సోమయ్య, సోషలిస్టు పార్టీ సీనియర్ నాయకుడు

హైదరాబాద్ సిటీ, ఆగస్టు 27: కరోనా కాలంలో పుస్తకాలు, స్నేహితులతో ఫోన్ సంభాషణే నా ప్రధాన కాలక్షేపం. పదిహేనేళ్ల కిందట బైపాస్ సర్జరీ అయింది. అప్పటి నుంచి డాక్టర్ల సూచన మేరకు రోజూ ఉదయం, సాయంత్రం ఒకగంట నడుస్తాను. ఇదివరకు పార్కుకు వెళ్లేవాడిని. ఇప్పుడు ఇంటి ఆవరణలోనే తిరుగుతున్నా. ఉదయం ఐదింటికి నా రోజు మొదలవుతుంది. కాసేపు కాళ్లు, చేతులు ఆడించడం వంటి కొన్ని వామప్ వ్యాయామాలు చేస్తుంటా. ‘ఏబీఎన్ ఆంధ్రజ్యోతి’లో ప్రసారమయ్యే ‘నవజీవన వేదం’ కార్యక్రమానికి అభిమానిని. అందులో గరికపాటి నరసింహారావు ప్రవచనాలంటే చాలా ఇష్టం. ఆ ప్రోగ్రాం తప్పక చూస్తాను. ఆహారశైలి విషయానికొస్తే.. బ్రేక్‌ఫా్‌స్టలో ఇడ్లీ, దోశ, ఉప్మా వంటివి ఉంటాయి.
ఆకుకూరలు, కాయగూరలను ఇష్టపడతాను. ఏడాదిలో రెండు లేదా మూడుసార్లకు మించి నాన్‌వెజ్ తినను. రోజూ ఒక కోడిగుడ్డు తింటాను. మధ్యాహ్నం భోజనంలోకి ఒక కప్పు అన్నం, కూర, పచ్చడి, పెరుగు ఉంటాయి. సాయంత్రం ఐదింటప్పుడు గ్లాసు పండ్ల రసం తాగుతాను. రోజులో ఎప్పుడో అప్పుడు గుప్పెడు డ్రైఫ్రూట్స్, ఒక జామకాయ తింటాను. రాత్రి భోజనంలోకి ఒక చపాతీ మాత్రమే తీసుకుంటా. ఆరోగ్య సమస్యలంటే బీపీ ఉంది. ఎమర్జెన్సీ కాలంలో సోషలిస్టు పార్టీ కార్యకర్తగా రహస్యజీవితం గడిపాను. ఆ సమయంలో ఎదుర్కొన్న ఒత్తిడి, ఆందోళన వల్ల అధిక రక్తపోటు బయటపడింది. యాభై ఏళ్లుగా హోమియోపతి మందులు వాడుతున్నాను. కరోనాకి ముందు రెగ్యులర్‌గా స్నేహితులను కలవడం, కొన్ని సభలు, సమావేశాలకు వెళ్లడం వంటి యాక్టివిటీ్‌సతో పొద్దుపోయేది. ఇప్పుడు మాత్రం ఇల్లు దాటడం లేదు.
పుస్తక పఠనంలో..
కాల్పనిక సాహిత్యంతోపాటు రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక రచనలనూ చదువుతాను. ఇప్పుడు రోజులో ఆరు నుంచి ఏడు గంటలు పుస్తక పఠనంతోనే పొద్దుపుచ్చుతున్నాను. ఆచార్య సూరపురాజు రాధాకృష్ణమూర్తి రచనలు ‘షేక్స్పియర్ సాహిత్య లోకం’, ఇలియట్ కవిత్వం ‘ది వేస్ట్ ల్యాండ్’ తెలుగు అనువాదం చదివాను. ఈ రెండు పుస్తకాలు చాలా విశేషమైనవి. రచయిత షేక్స్‌స్పియర్ నాటకాల గురించి వివరిస్తూ.. అదే అంశంపై వాల్మీకి, కాళిదాసు, నన్నయ వంటి భారతీయ ప్రాచీన కవుల సాహిత్యాన్ని ఉదహరిస్తూ, విశ్లేషించడం సూరపరాజుగారి రచనల్లో దార్శనికత ప్రస్ఫుటమవుతుంది. మరొక పుస్తకం కాళ్లకూరి శేషమ్మ ఆత్మకథ ‘చదువు తీర్చిన జీవితం’. ఒక సాధారణ గృహిణి ఉపాధ్యాయునిగా మారిన ఉదంతమే ఈ శేషమ్మ జీవిత కథ.
ఉపాధ్యాయలోకానికి ఆమె జీవితానుభవాలు స్ఫూర్తి పాఠాలు. హైకోర్టు న్యాయవాది అవధానం రఘుకుమార్ మహాత్మాగాంధీపై జాతీయ, అంతర్జాతీయ మ్యాగజైన్స్‌కి రాసిన వ్యాసాలను రెగ్యులర్‌గా చదువుతుంటా. ఆకాశవాణి ఉద్యోగి నాగసూరి వేణుగోపాల్ సంపాదకత్వంలో బాపూజీపై వెలువడిన వ్యాస సంకలనాలనూ చదివాను. ఇవిగాక ‘హేతువాది’, ‘భూమిక’ స్త్రీవాద పత్రిక, ‘స్వేచ్ఛాలోచన’, ‘అమ్మనుడి’, ‘మిసిమి’, ‘జనతావీక్లీ’, ‘రాడికల్ హ్యూమనిస్ట్’ మ్యాగజైన్స్ వస్తుంటాయి. వీటిని అస్సలు మిస్కాను.
ఆత్మీయులతో..
నాకు కొంతమంది ఆప్తమిత్రులున్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి సుదర్శన్‌రెడ్డి, హుజూరాబాద్ మాజీ శాసనసభ్యుడు జనార్దన్‌రెడ్డి, సీనియర్ అడ్వొకేట్ ప్రతాపరెడ్డి. వీరుకాక గుంటూరు నుంచి కొందరు స్నేహితులు ఫోన్ చేస్తుంటారు. వీళ్లతో రెగ్యులర్‌గా ఫోన్లో మాట్లాడుతుంటా. మా సంభాషణంతా సామాజిక అంశాలమీదే సాగుతుంటుంది. కనుక ఒంటరితనం, బోర్ వంటి పదాలకు నేను చాలాదూరం. అందులోనూ సామాజిక చైతన్యం కలిగిన మిత్రుల సాంగత్యంలో కరోనా భయాందోళనలూ దరిచేరవు. నా సొంతూరు గుంటూరు జిల్లా తుళ్లూరు.
నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సోషలిస్టు పార్టీ పరిచయం అయింది. అప్పుడు పాఠ్యపుస్తకాలకన్నా, పార్టీ లిటరేచరే ఎక్కువ చదివేవాడిని. దాంతో చదువు ఆపేశాను. 1955లో రామ్మనోహర్ లోహియా, ఎం.ఎన్. రాయ్ గుంటూరు వచ్చారు. అప్పుడు వాళ్లను కలిశాను. అక్కడితో చదువు ఆపేసి, ఆనాటి నుంచి సోషలిస్టు పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా అంకితమయ్యాను. ఇప్పుడూ లోహియా విజ్ఞాన సమితి, లోహియా సమతా ట్రస్ట్ సంస్థలకు ప్రతినిధి హోదాలో కొనసాగుతున్నాను.
మేధావులారా నోరు తెరవండి
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. వికేంద్రీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్ చేస్తున్న మూడు రాజధానుల జగడం మరింత బాధను కలిగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను జిల్లా, మండల పరిషత్, పంచాయతీలకు బదలాయించడమే వికేంద్రీకరణ. ఇదే విషయాన్ని రాంమనోహర్ లోహియా ఏనాడో చెప్పారు. అసెంబ్లీ ఒకచోట, సచివాలయం మరోచోట, హైకోర్టు ఇంకోచోట కట్టడమే అభివృద్ధి వికేంద్రీకరణ అనడం హాస్యాస్పదం. జగన్ కేబినెట్లో ఒక్క మంత్రికైనా నిర్ణయాధికారం ఉందా? అలాంటి నాయకులు అభివృద్ధి వికేంద్రీకరణ పాట పాడటం ఏ విలువకు నిదర్శనం.
ప్రస్తుత రాజకీయాలలో కక్ష్యపూరిత చర్యలు పతాకస్థాయికి చేరాయనడానికి ఆంధ్ర రాజకీయాలే నిదర్శనం. అభివృద్ధి వికేంద్రీకరణను సమర్థించే లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ వంటి మేధావులు సైతం జగన్ కక్ష్యపూరిత చర్యలకు వంతపాడేలా మాట్లాడటం బాధాకరం. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ముఖ్యమంత్రి కనీస హామీ ఇవ్వడం లేదు. రైతుల పోరాటంపై మేధావులు, రచయితలు ఒక్కరూ నోరు తెరవరు. ఇదెక్కడి అన్యాయం, అన్యాయంపై గళమెత్తిన అన్నదాతకు అండగా నిలవని మేధావుల గళం, రచయితల కలం సామాజిక ద్రోహానికి పాల్పడటంతో సమానం.
అమెరికా అల్లుడు..
మనకు తెలిసిన మంచిని నలుగురికీ పంచమన్నారు పెద్దలు. నాదీ అదే సూత్రం. సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటా. ఫేస్బుక్, వాట్సా్‌పలలో వచ్చే సందేశాత్మక సమాచారాన్ని రోజూ మిత్రులందరికీ షేర్ చేస్తుంటాను. నా భార్య పేరు అరుణ. మాకు కొడుకు, కూతురు. ఇద్దరూ అమెరికాలో స్థిరపడ్డారు. ఈ ఏడాది ఇరువురూ ఇండియాకు రావాల్సింది. కరోనా వల్ల రాలేకపోయారు. నా అల్లుడు మైఖిల్ మియోవిక్ అమెరికన్. ఆయన అరవిందుడి భక్తుడు. మా అమ్మాయి మాధవి కూడా. ఇరువురూ అరవిందుని ఆశ్రమంలో కలుసుకొని, ఒకరినొకరు ఇష్టపడ్డారు. మా అంగీకారంతో ఒక్కటయ్యారు.
మా అమెరికా అల్లుడికి భారతీయ సంప్రదాయాలంటే అమితమైన భక్తి, గౌరవం. నా కొడుకు మనోహర్ ఒక ప్రముఖ కంపెనీలో సీనియర్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. తనకీ రాంమనోహర్ లోహియా ఐడియాలజీ అంటే చాలా ఇష్టం. లోహియా ఆలోచనలు యువతరానికీ అందుబాటులో ఉంచాలనే సంకల్పంతో ‘‘లోహియా టుడే డాట్ కామ్’’ పేరుతో ఒక వెబ్‌సైట్‌ను మా మనోహర్ రూపొందించాడు. అందులో లోహియా, ఎంఎన్రాయ్కి సంబంధించిన సమగ్ర సమాచారం పొందుపరిచాం. నా జీవిత పర్యంతం లోహియా ఆలోచనలను ప్రచారం చేయడమే ఇష్టం. అందులోనే నాకు ఆనందం.
Courtesy Andhrajyothi