-
24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు కొవిడ్-19 పాజిటివ్
- దుబాయ్ నుంచి వచ్చిన హైదరాబాద్‌వాసి
- బెంగళూరులో స్నేహితులతో కలిసి మెలసి
- అక్కణ్నుంచి బస్సులో హైదరాబాద్‌కు రాక
- అతడితోపాటు బస్సులో మరో 27 మంది
- ఓ ప్రైవేటు ఆస్పత్రిలో, ఆ తర్వాత గాంధీలో చికిత్స
- అతడికి చికిత్స చేసిన 23 మంది
- కుటుంబసభ్యులతో కలిపి మొత్తం 80 మంది
- వారందరినీ గుర్తించిన వైద్య, ఆరోగ్య శాఖ
- ఇటలీకి వెళ్లొచ్చిన ఢిల్లీ వ్యక్తికి కూడా సోకిన వైరస్
- రాజస్థాన్‌లో ఇటాలియన్ పర్యాటకుడికి పాజిటివ్
- ఒకేరోజు భారత్‌లో వెలుగు చూసిన 3 కేసులు
- గాంధీ ఆస్పత్రికి అదనంగా 100 కొవిడ్ కిట్లు
- కరోనాపై నేడు పలు శాఖలతో ఈటల సమీక్ష
వచ్చినా భయపడొద్దు
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90 వేల మందికి సోకి మూడు వేల మందిని బలిగొన్న మహమ్మారి కొవిడ్-19. అయినప్పటికీ.. ఆ వైరస్‌కు అంతగా భయపడక్కర్లేదని, దాని బారిన పడకుండా కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దురదృష్టవశాత్తూ సోకినా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదని చెబుతున్నారు. వైరస్‌కు కేంద్రస్థానమైన చైనాలో చదువుకుంటూ దాని బారిన పడి.. ఇక్కడికి వచ్చిన ముగ్గురు కేరళ విద్యార్థులకు పూర్తిగా నయమైన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి మాత్రమే ఆ వైరస్ ప్రాణాంతకంగా మారుతుందని.. కాబట్టి ధైర్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
హైదరాబాద్ సిటీ/హైదరాబాద్, న్యూఢిల్లీ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్‌లోకీ ప్రవేశించింది! సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్‌కు చెందిన 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కొవిడ్-19 బారిన పడ్డారు. బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్న ఆయన.. ఇటీవలే దుబాయ్ వెళ్లొచ్చారు. అక్కడ హాంకాంగ్‌కు చెందినవారితో కలిసి పనిచేశారు. ఫిబ్రవరి 20న బెంగళూరుకు తిరిగొచ్చారు. అక్కడి నుంచి బస్సులో ఫిబ్రవరి 22న హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడికి వచ్చాక.. వైరస్ సోకిన లక్షణాలు కనపడడంతో తొలుత సికింద్రాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఔట్ పేషెంట్‌గా చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో ఆయన సికింద్రాబాద్‌లో పలు ప్రాంతాల్లో తిరిగినట్టు సమాచారం. జ్వరం తగ్గకపోవడంతో ఫిబ్రవరి 27న ఆ ఆస్పత్రిలో ఇన్‌పేషెంట్‌గా చేరారు. ఎంతకీ జ్వరం తగ్గకపోవడంతో.. ఆ ఆస్పత్రిలోని వైద్యులకు అనుమానం వచ్చి ఆయన్ను గాంధీ ఆస్పత్రికి పంపారు. మార్చి 1న గాంధీలో చేరిన ఆయన రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా.. కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని కేంద్రం సోమవారం అధికారికంగా ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అప్రమత్తం చేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగమేఘాలపై స్పందించింది.
ఆ యువకుడు దుబాయ్ నుంచి నేరుగా బెంగళూరు వెళ్లినందున అక్కడ అతడి స్నేహితులను, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అతడితోపాటు బస్సులో వచ్చిన 27 మందిని, తొలుత అతడికి చికిత్స చేసిన ఆస్పత్రి సిబ్బంది 23 మందిని, అతడి కుటుంబసభ్యులను.. ఇలా దాదాపు 80 మందిని గుర్తించింది. ఆ యువకుడు పనిచేసిన బెంగళూరు కంపెనీకి సమాచారం అందించింది. యువకుడిది ఉమ్మడి కుటుంబం కావడంతో.. కుటుంబసభ్యులందరినీ హోమ్ ఐసోలేషన్‌లో ఉంచినట్టు ప్రకటించింది. అతడికి చికిత్సనందించిన ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది 23 మందికి ముందస్తు చికిత్స చేస్తోంది.
పటిష్ఠ ఏర్పాట్లు..
రాజధానిలో ఒక కొవిడ్-19 పాజిటివ్ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో కరోనా వైరస్ ప్రత్యేక వార్డులతో పాటు అత్యవసర చికిత్స వార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గాంధీలో 40, ఫీవర్‌లో 40, చెస్ట్ ఆస్పత్రిలో 10 పడకలను ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో 7వ అంతస్తులో ‘కరోనా వైరస్ ఐసోలేటెడ్ వార్డు’, అత్యవసర విభాగంలో ‘అక్యూట్ ఎమర్జెన్సీ కరోనా వైరస్ వార్డు’ పేరిట వార్డులు సిద్ధం చేశారు. ప్రస్తుతం వైరస్ సోకిన వ్యక్తిని ఏడో అంతస్తులోని వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పది వెంటిలేటర్లు, ఆక్సిజన్ యంత్రాలను అందుబాటులో ఉంచారు. అలాగే.. సరోజనీదేవి కంటి ఆస్పత్రిలో 200 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఉస్మానియా ఆస్పత్రిలో మరో పది పడకలతో వార్డును ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఆస్పత్రిలో ఐదు విభాగాల వైద్యుల బృందంతో కమిటీని ఏర్పాటు చేశారు. గాంఽధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. ఫీవర్‌లో కరోనా వైరస్ ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ వెంటిలేటర్లు, ఆక్సిజన్ సదుపాయం లేదు. దీంతో ఈ ఆస్పత్రిలో చేరిన అనుమానితులకు ఇతర జబ్బులు సోకినా, ఆయాసం వంటి సమస్యలు ఎదురైనా వారిని గాంధీ ఆస్పత్రికి తరలించడానికి 3 అంబులెన్స్‌లను సిద్ధం చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ శంకర్ తెలిపారు. కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను గాంధీ మెడికల్ కాలేజీలోని ల్యాబ్‌లో నిర్వహిస్తున్నారు. వైరస్ సోకినట్లు తేలితే మరోసారి నిర్ధారణ కోసం పుణె పంపిస్తున్నారు. సోమవారం ఏడుగురు విమాన ప్రయాణికులు కరోనా లక్షణాల అనుమానంతో వచ్చి గాంధీలో చేరారు.
ప్రత్యేకంగా భేటీ..
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రావణ్ కుమార్ చాంబర్‌లో టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ చీఫ్ ఇంజనీర్‌తో పాటు అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. వెంటనే 7వ అంతస్తులో ఐసోలేషన్ ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగుల నుంచి వచ్చే బయో మెడికల్ వ్యర్థాలను జాగ్రత్తగా దహనం చేయాలని.. ప్రస్తుతం 2వ అంతస్తులో ఉన్న ఐసీయూ వార్డును 7వ అంతస్తుకు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అదనంగా మరో 100 కోవిడ్ కిట్లను తెప్పిస్తున్నట్లు సూపరింటెండెంట్ చెప్పారు. కాగా.. ప్రస్తుత సందర్భాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి (మెడికల్ ఎమర్జెన్సీ)గా పరిగణిస్తోంది. అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అవసరమైన మందులు, మాస్కులను అందుబాటులో ఉంచాలని టీఎ్‌సఎంఎ్‌సఐడీసీని ఆదేశించింది. అలాగే.. కరోనా ముప్పును సమర్థంగా ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో పలు శాఖల అధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్ష నిర్వహించనున్నారు.
ఢిల్లీవాసికి కూడా..
దేశరాజధాని ఢిల్లీలో కూడా ఒక వ్యక్తికి, రాజస్థాన్‌లో పర్యటిస్తున్న ఇటాలియన్‌వాసికి కొవిడ్-19 పాజిటివ్ వచ్చింది. చైనాకు ఆవల ఇరాన్ (66) తర్వాత అత్యధిక కరోనా మరణాలు (34) ఇటలీలో నమోదయ్యాయి. కరోనా బారిన పడిన ఢిల్లీవాసి ఇటీవల ఆ దేశానికి వెళ్లి రావడం గమనార్హం. అతడికి ఢిల్లీలోని ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. అలాగే.. ఇటలీ నుంచి వచ్చి రాజస్థాన్‌లో పర్యటిస్తున్న 69 ఏళ్ల వృద్ధుడికి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. అతణ్ని జైపూర్‌లోని సవాయ్‌మాన్‌సింగ్ ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. అతడితోపాటు మనదేశానికి వచ్చిన పర్యాటకులు 20 మంది ప్రస్తుతం ఆగ్రాలో ఉన్నందున అక్కడి అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం సమాచారం అందించింది. వారికి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా.. దేశంలో కొత్తగా కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో విదేశాలకు ప్రయాణ ఆంక్షలను మరికొంతకాలం పొడిగిస్తామని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. కరోనాను ఎదుర్కొనే సాధన సంపత్తి మనవద్ద ఉన్నదని ఆయన భరోసా ఇచ్చారు.
Courtesy Andhrajyothi