సఫాయీ వృత్తిని నిర్మూలించలేరా?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

తాగడానికే నీళ్ళు దొరక్క ఇబ్బందులు పడే పేదలు, ఆ కట్టించుకున్న మరుగుదొడ్లని వాడడం లేదనీ, ఆ దొడ్లని సామాను పెట్టుకోవడానికే ఉపయోగిస్తున్నారనీ అనేక వార్తలు తేల్చి చెప్పాయి. మరుగు దొడ్లన్నిటినీ కలుపుతూ, భూగర్భ డ్రైనేజి ఏర్పాటు లేదు. ఉన్నా, మళ్ళీ అక్కడ మాన్ హోల్సునీ, వాటినీ శుభ్రం చెయ్యాల్సిన పని కూడా చేతులతో చెయ్యల్సిందే. అతి తక్కువ స్థాయి టెక్నాలజీతో, ఎక్కడికక్కడ శుభ్రం చేసే యంత్రాలను తయారు చేయించ వచ్చును. ఏం, చంద్రుడి మీదకి వెళ్ళడానికి వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారే, ఇది చెయ్యలేరా?

దేశంలో 53 కోట్ల మంది జనాలు బహిరంగ ప్రదేశాల్లోనే మల – మూత్ర విసర్జనలు చేస్తున్నారని ప్రభుత్వపు లెక్కలు! ఆ అనారోగ్య పద్ధతి నివారణ కోసం, దేశ వ్యాప్తంగా 9 కోట్ల మరుగు దొడ్లని (లెట్రిన్లని) జనాలే కట్టుకోవడానికి, 1 లక్షా 96 వేల కోట్ల డబ్బుని కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందట! గాంధీకి 150వ జయంతి అయిన 2019 అక్టోబర్ 2 నాటికి, బహిరంగ మల విసర్జన పద్ధతిని పూర్తిగా మాయం చేస్తానని, 5 ఏళ్ల కిందటే (2014 అక్టోబర్ 2 న) ఈ ప్రచారాన్ని ప్రారంభించింది మోదీయే. దారిద్ర్య రేఖ కంటే దిగువున ఉన్న కుటుంబాలకి, ఆ దొడ్లు కట్టుకోవడానికి ఒక్కో ఇంటికి 12 వేల చొప్పున ఇస్తామన్నారు. ఈ పధకానికి పెట్టిన పేరు స్వచ్ఛ భారత్.

ఈ పధకానికి ప్రచారంగా, ఏడాదికి ఒక సారి వీధుల్ని ఊడ్చే కార్యక్రమం జరుపుతున్నారు. అంటే, భారత దేశాన్నంతా చీపుళ్ళతో ఊడ్చేసి, స్వచ్ఛంగా చెయ్యడం! ఈ పేరుతో, పొడుగైన కర్ర బ్రష్ వంటి కొత్త చీపురు పట్టుకున్న మోదీని మొదట చూశాం. ఉతికి, గంజి పెట్టి, ఇస్త్రీలు చేసిన దుస్తులు ధరించి; మెరిసే జాకెట్ కోటు వేసుకుని; పాదాలకు వేల రూపాయల ఖరీదు పాద రక్షలు ధరించి, నడుం వంచనక్కర లేని పొడుగైన కర్ర చీపుళ్ళతో, చేతులకు దుమ్మూ, ధూళీ అంటని గ్లవుజులు ధరించి, చుట్టూ పరివారాన్ని వెంట బెట్టుకుని, ఎదురుగా టీవీ కెమేరాలు ఫోటోలు తీస్తోండగా, సుతారంగా, వయ్యారంగా, చిరునవ్వులతో, కర్ర చీపుళ్లని కదిపే ప్రచారమే ఇది. ఈ పధకాన్ని ప్రచారం చేయడానికి, సినిమా నటుల్నీ, ఆటగాళ్లనీ, పారిశ్రామిక వేత్తల్నీ, రాజకీయ నాయకుల్నీ ఎంపిక చేశారు. ఇంతకీ ఊడ్చేది దేనిని? అంతకు ముందే అక్కడికి పని వాళ్ళు తెచ్చి పోసిన ఆకుల్నీ, కాయితాల్నీ మాత్రమే! ఎంత సేపూ? ఫోటోలు తీసినంత సేపూ! ఈ స్వచ్ఛ కార్యం చేసే వాళ్ళు ఎవరెవరు? తమ భవనాల్లో జరగాల్సిన సేవలన్నిటినీ అక్కడి కూలీలు చేస్తుండగా, తామైతే ఇక్కడి పుల్ల తీసి, అక్కడ పెట్టకుండా, పౌడర్లతో, క్రీములతో, సెంట్లతో, బైటికి వచ్చే ఆడా-మొగా యజమానులు. వాళ్ళు బైటికి ఎందుకు పోతున్నారో ఇళ్ళల్లో సేవకులకు అంతు పట్టదు. భవనాల పెద్ద మనుషులు కార్లు ఎక్కాలంటే, డ్రైవర్లే వాటి తలుపులు తియ్యడం, తర్వాత ముయ్యడం చెయ్యాలి! కారు తలుపు తియ్యని పెద్దలు, రోడ్లు ఊడుస్తారట!

ఈ ప్రముఖులంతా, గడిచిన 5 ఏళ్లలో, యాడాదికి ఒకటి రెండు సార్లు చేసిందేమిటి? పొడవాటి కర్ర చీపుళ్ళని ఆడించి, ఫోటోలు దిగి, తిరిగి కార్లెక్కడం, డ్రైవర్లు తలుపులు తీశాక! ఈ పెద్దల భవనాల్లో, స్నానాల గదుల్నీ, పాయి ఖానాల్నీ, శుభ్రం చేసేది, వీరా, వీరి కూలీ మానవులా? తమ కొంపల్లోనే చెయ్యని పనులు వీరు బైట ఎలా చేస్తారు?

ఇలాంటి వాళ్ళ ఇళ్లలో జరిగే పనుల గురించి ఎంగెల్స్ ఇలా చెబుతాడు: “మిత్రులారా, ఒక ధనికుని ఇంటిలోకి, ఇంటి లోపలి భాగంలోకి, పోయి చూడండి. అక్కడ ఒకే ఒక వ్యక్తికి పెక్కుమంది సేవలు చేస్తూ, తమ కాలాన్ని నిష్క్రియగా గానీ, మహా అయితే, ప్రతీ మనిషీ తన నాలుగు గోడల మధ్యా ఏకాకి అయిన ఫలితంగా యేర్పడే పనిలో గానీ, ఖర్చు చేస్తూ ఉండడం అత్యంత మతి హీనమైన శ్రమశక్తి దుర్వ్యయం కాదేమో చెప్పండి. ఈ గుంపెడు పనిమనుషులూ, వంట మనుషులూ, నౌకర్లూ, బండి మనుషులూ, గృహ పరిచారకలూ, తోట మాలీలూ, వీళ్ళ పేర్లు ఏమైనా కానీ, వీళ్ళు నిజంగా చేసేది ఏమిటి?… బండి వెనక నిలుచుకోవడమూ, తమ యజమానుల ప్రతీ చిత్త చాంచల్యనికీ సేవ చేయడమూ, పెంపుడు కుక్కలను ఎత్తుకోవడమూ, మొదలైన అసంబద్ధపు పనులు!” (1845 నాటి ‘ఎల్బర్ ఫెల్డ్ ఉపన్యాసాలు’).

డ్రై మరుగు దొడ్లలో, చేతులతోనే మలాన్ని ఎత్తే క్రూరమైన మురికి పనులు పాకీ వృత్తి కూలీలు చేస్తూ ఉంటే, ‘స్వచ్ఛ భారత్’ ప్రచార కర్తలు, ఏ పాకీ దొడ్డినైనా తమ చేతులతో శుభ్రం చేశారా, చేస్తారా? డ్రైనేజి గొట్టాల నించి మల మూత్రాలతో, పూడి పోతూ పోయే కందకాల్లోకి దిగి, గొట్టాల్లో పూడికల్ని తీసే పనుల్లో, గాలి అందక ప్రాణాలే పోగొట్టుకునే దుర్భర ఘట్టాల్లో ఈ ప్రముఖులెప్పుడైనా పాల్గొన్నారా, పాల్గొంటారా?

ఒక చారిత్రాత్మక వింత ఘటనని గుర్తు చేసుకుందామా? ఒక అరడజను మంది, పాకీ వృత్తుల, ఊడ్పుల కార్మికుల్ని ఇస్త్రీ బట్టలతో, కుర్చీల్లో కూర్చోబెట్టి, వారి పాదాల్ని మోదీ కడిగితే, వారందరూ కుర్చీలు దిగిన తర్వాత చేసే పనులు ఏమిటి? అప్పుడు మోదీ కారు ఎక్కి, తన భవనం చేరిన తర్వాత చేసే పని ఏమిటి? మురికి పనుల వృత్తులతో జీవిత కాలాలన్నీ గడిపే అమాయకులకు ఒక ప్రముఖుడు కాళ్ళు కడిగితే, వాళ్ళ జీవితాల్లో జరిగే మార్పులేమిటి? వాళ్ళు కుర్చీలు దిగి, పాయిఖానా దొడ్ల శుభ్రతకు పోవాలిసిందే కదా? “ఒక పదవి ఉన్న మనిషి కాళ్ళు కడిగితే, మనం ఎలా మారగలం?” అనే ప్రశ్న లేని అమాయకుల్ని ఎంతో నమ్మించి, దగా చేయడమే అది! ఇది అక్షరాల ‘స్వచ్చ కపటత్వం’.

ఆ రోజునే, ఆ పుణ్య క్షేత్రంలోనే, సరైన రక్షణలు లేక ఒక పారిశుధ్య కార్మికుడు మరణించాడు. ఆ పుణ్య క్షేత్రంలో పని చేసే కార్మికులే జీతాల పెంపుకోసం కోరగా, కోరగా, రోజు కూలిలో 15 రూపాయలు పెంచింది ప్రభుత్వం. అలా పెంచగా పెరిగిన రోజు కూలి (310 రూపాయలు) కూడా ప్రభుత్వ చట్టాల ప్రకారం ఉండాల్సిన కనీస వేతనం కన్నా తక్కువే.

పారి శుధ్య కార్మికుల కాళ్ళు ప్రధాన మంత్రి మోదీ కడిగిన దాని మీద, సఫాయీ కార్మికుల సంఘ నాయకుడు బెజవాడ విల్సన్ కొన్ని అద్భుతమైన వ్యాఖ్యలు చేశాడు. “ప్రధాన మంత్రి గారూ, శుభ్రం చేయాల్సింది మా పాదాల్ని కాదు; మీ బుర్రని శుభ్రం చేసుకోండి. మీరు చేసిన ఈ పని అవమానానికి అత్యున్నత రూపం. ఇప్పటికీ, లక్షా 60 వేల మంది స్త్రీలు మలాన్ని చేతుల్తో ఎత్తి పోస్తున్నారు. ఈ విషయం గురించి ఈ 5 ఏళ్ళల్లో ఒక్క మాట కూడా మాట్లాడ లేదు మీరు. ఇది ఎంత సిగ్గు పడాల్సిన విషయం! (“వాట్ ఎ షేమ్!”). మమ్మల్ని చంపడం ఆపేయండి” (“స్టాప్ కిల్లింగ్ అజ్”). ఇంకా ఇలా అన్నారు విల్సన్: “2018 వ సంవత్సరంలో సెప్టిక్ టాంకుల్లో పడి 105 మంది చచ్చి పోతే మీరు కిక్కురు మనలేదు.” (“కెప్ట్ మమ్”).

స్వచ్ఛ మరుగు దొడ్ల పధకం వల్ల, వారికి జరిగిందేమీ లేదు. ‘మరుగు దొడ్డి’ ని ఎలాగో కట్టుకుంటే, దాని పక్కన మురుగు నీరు పోయే సెప్టిక్ టాంక్ కావాలి. దాన్ని ఖాళీ చేసే పనులన్నీ బైటి నించి రావలసిన పాకీ కార్మికులవే. తాగడానికే నీళ్ళు దొరక్క ఇబ్బందులు పడే పేదలు, ఆ కట్టించుకున్న మరుగు దొడ్లని వాడడం లేదనీ, ఆ దొడ్లని సామాను పెట్టు కోవడానికే ఉపయోగిస్తున్నారనీ అనేక వార్తలు తేల్చి చెప్పాయి. మరుగు దొడ్లన్నిటినీ కలుపుతూ, భూగర్భ డ్రైనేజి ఏర్పాటు లేదు. ఉన్నా, మళ్ళీ అక్కడ మాన్ హోల్సునీ, వాటినీ శుభ్రం చెయ్యాల్సిన పని కూడా చేతులతో చెయ్యాల్సిందే. అతి తక్కువ స్థాయి టెక్నాలజీతో, ఎక్కడికక్కడ శుభ్రం చేసే యంత్రాలను తయారు చేయించవచ్చును. ఏం, చంద్రుడి మీదకి వెళ్ళడానికి వందల వేల కోట్లు ఖర్చు పెడుతున్నారే, ఇది చెయ్యలేరా? విల్సన్ తదితర మిత్రులు నిర్వహిస్తున్న సఫయీ కార్మికుల సంఘం చేస్తూ వస్తున్న పోరాటాల వల్ల, అక్కడక్కడా నామ మాత్రంగా నైనా కొన్ని యంత్రాల వాడకం వచ్చినా, అది అత్యంత స్వల్పం. ఉత్తర ప్రదేశ్‌లో, అలహాబాదులో, ‘కుంభమేళా’ కి, 4 వేల 2 వందల కోట్లు ఖర్చు పెట్టారు. అయోధ్యలో 500 అడుగుల ఎత్తుండే రాముడి విగ్రహానికి 7 కోట్ల 75 లక్షలు ఖర్చు పెడతామనీ, ఆ పనికోసం కంపెనీల వాళ్ళని టెండర్లు వెయ్యమన్నారే, ఆ డబ్బుతో పాకీ పని వారి వృత్తిని తీసి వెయ్యలేరా?

ఇంకో విషయం.. యంత్రాల సహాయంతో, సెప్టిక్ టాంకుల్ని శుభ్రం చేసే పని కూడా, ఒక ఫలానా కులం జనాభాయే చేసే పరిస్తితి ఉంటే, అది కుల వ్యవస్థని కాపాడడమే. కాబట్టి ఇది కేవలం యంత్రాల సమస్య మాత్రమే కాదు. కుల నిర్మూలన సమస్య. కానీ, తక్షణం యాంత్రీకరణ వల్ల ఎంతో కొంత ఉపశమనం దొరుకుతుంది. ఈ ఉపశమనాన్ని కలిగించేలా ప్రభుత్వాల మీద వత్తిడి తేవాలి. ఈ అసమాన దోపిడి వ్యవస్థలోనే ఈ మార్పు సాధించ వచ్చును. కానీ, కుల నిర్మూలన జరగాలంటే మాత్రం, సమాజంలో ‘సమాన శ్రమ విభజన’ జరిగి తీరాలి. అంటే, ఇప్పుడు అనేక కులాలుగా ఉన్న జనాభా అంతా కూడా, రేపు మురికిని శుభ్రం చేసే పనిలో దిగి తీరాలి. ఆ మురికి అందరి మురికీ. ఇది జరగాలంటే, శ్రమ సంబంధాలని సమూలంగా, సమాన శ్రమ సంబంధాలుగా మార్చాలనే అవగాహన రావాలి. ఆ అవగాహన దొరికేది, మార్క్సు ఎంగెల్సులు రూపొందించిన ‘సమానత్వ శ్రమ విభజన’ సిద్ధాంతంలోనే.

రంగనాయకమ్మ

RELATED ARTICLES

Latest Updates