- తాజాగా దీపికా, దియా మీర్జా పేర్లు
- దీపిక మేనేజర్ కు ఎన్సీబీ సమన్లు, అవసరమైతే దీపికకు కూడా..
- త్వరలో సారా, శ్రద్ధ, రకుల్ కు సమన్లు!
- బాలీవుడ్ టాప్ యాక్టర్లకూ డ్రగ్స్ కేసుతో సంబంధం?
- లీగల్ అడ్వైస్ కోసం లాయర్ల దగ్గరికి
- రియాకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
- బెయిల్ పిటిషన్ పై నేడు బాంబే హైకోర్టులో విచారణ
ముంబై: యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మొదలైన డ్రగ్స్ కథ.. రియా చక్రవర్తి మీదుగా మొత్తం బాలీవుడ్ మెడకు చుట్టుకుంది. ముంబై పోలీసుల విచారణతో మొదలై వయా సీబీఐ నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)కు మారింది. మొన్న సారా అలీఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్.. తాజాగా దీపికా పడుకోన్, దియామీర్జా పేర్లు వినిపిస్తున్నాయి. దీపిక, సారా, శ్రద్ధ, రకుల్ కు త్వరలోనే సమన్లు జారీ చేసే అవకాశం ఉందని ఎన్ సీబీ వర్గాలు చెప్పాయి. మరోవైపు బాలీవుడ్ టాప్ యాక్టర్లకు కూడా ఈ డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్లు చెబుతున్నాయి. దీంతో డ్రగ్స్ కేసు ఎక్కడిదాకా వెళ్తుందోనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఎన్సీబీ ఇప్పటికే రియా చక్రవర్తి, ఆమె తమ్ముడు సహా 12 మందిని అరెస్టు చేసింది.
దీపిక మేనేజర్ కు సమన్లు..
బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపిక పడుకోన్ మేనేజర్ కరీష్మ ప్రకాశ్‌కు ఎన్సీబీ సమన్లు జారీ చేసింది. సుశాంత్ ఆత్మహత్యకు డ్రగ్స్ కు సంబంధం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు వేగవంతం చేసిన ఎన్ సీబీ.. ఈ కేసులో భాగంగా విచారణకు హాజరుకావాలని కరీష్మను ఆదేశించింది. కరీష్మ ప్రకాశ్ పని చేసే క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ సంస్థ సీఈవో ధ్రువ్ చిట్గో పికర్ కు కూడా సమన్లు పంపింది. ధ్రువ్ ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. తనకు కొంత టైం ఇవ్వాలని ఎన్ సీబీని కరీష్మ కోరారు. దీపికకు వ్యతిరేకంగా మరిన్ని ఆధారాలు దొరికితే ఆమెకు కూడా సమన్లు జారీ చేస్తామని ఎన్సీబీ ఆఫీసర్ ఒకరు తెలిపారు. యాక్టర్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్, శ్రద్ధ కపూర్, డిజైనర్ సిమోన్ ఖంబట్టాకు కూడా ఈ వారంలో సమన్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పారు. మరోవైపు ఇప్పటికే సుశాంత్ మేనేజర్ శ్రుతి మోడీ, గతంలో టాలెంట్ మేనేజర్ గా పని చేసిన జయ సాహాకు ఎన్ సీబీ సమన్లు పంపింది. సోమవారం జయ సాహాను సుమారు 4 గంటలు విచారించింది.
అక్టోబర్ 6 వరకు రియా కస్టడీ
ఈ నెల 9న రియాను ఎన్ సీబీ అరెస్టు చేసింది. మంగళవారంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీ ముగిసింది. రియా వేసిన బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసిన స్పెషల్ ఎన్డీపీఎస్ కోర్టు.. మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దీంతో అక్టోబర్ 6 వరకు ఆమె కస్టడీలో ఉండనున్నారు. మరోవైపు తమకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ రియా, ఆమె బ్రదర్ షోవిక్ చక్రవర్తి బాంబే హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ ను కోర్టు విచారించనుంది. ఇప్పటికే శ్రద్ధ కపూర్, సారా అలీఖాన్ పేర్లను రియా బయటపెట్టిందని, ఈ వారంలోనే వారికి సమన్లు జారీ చేసి ప్రశ్నించే అవకాశం ఉందని ఎన్ సీబీ వర్గాలు చెప్పాయి.
భయంతో లాయర్ల దగ్గరికి ఆరుగురు యాక్టర్లు
డ్రగ్స్ కేసులో తమపై ఎక్కడ యాక్షన్ తీసుకుంటారోనని భయపడి ఆరుగురు టాప్ మేల్ యాక్టర్లు తమ లాయర్లను కలిసినట్లు తెలిసింది. ఒకవేళ తమ పేర్లు బయటికి వస్తే, సమన్లు ఇస్తే.. ఎలా ఎదుర్కోవాలనే దానిపై లీగల్ అడ్వైస్ తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు డ్రగ్స్ కేసుకు బాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్లకు సంబంధం ఉన్నట్లుగా ఆధారాలు సంపాదించినట్లు ఎన్ సీబీ వర్గాలు చెబుతున్నాయి. క్వాన్ టాలెంట్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ ఓనర్ ధ్రువ్ చిట్లోపికర్.. డ్రగ్స్ వ్యవహారంలో ‘బిగ్ ప్లేయర్’ గా అనుమానిస్తున్నట్లు పేర్కొన్నాయి. క్వాన్ సంస్థ ఓనర్ షిప్ పైనా ఎన్ సీబీ దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించాయి. క్వాన్ సంస్థకు బాలీవుడ్ లోని ఓ పెద్ద యాక్టర్ సహ యజమానిగా ఉన్నట్లు అనుమానిస్తున్నామని తెలిపాయి.
ఆదిత్య అవ్వాకు వ్యతిరేకంగా లుక్ ఔట్ నోటీస్
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వాడకంపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ).. మాజీ మంత్రి, దివంగత జీవరాజ్ అల్వా కొడుకు ఆదిత్యకు వ్యతిరేకంగా లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. ప్రస్తుతం ఇండియాలోనే ఉన్న ఆదిత్య.. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఎక్కడో దాక్కున్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దేశం వదిలి పారిపోయే చాన్స్ ఉందని, దీంతో కనిపిస్తే అరెస్టు చేయాలని అన్ని ఎయిర్ పోర్టులను అలర్ట్ చేశామని చెప్పారు. ఇప్పటికే 13 మందిని అరెస్టు చేసిన సీసీబీ.. మరో ఏడుగురిపై లుక్ ఔట్ నోటీసు జారీ చేసింది. అరెస్టయిన వారిలో యాక్టర్లు రాగిని ద్వివేది, సంజన గల్రానీ, రియల్టర్ రాహుల్ థోన్సే తదితరులు ఉన్నారు.
రెండు కోణాల్లో దర్యాప్తు
బాలీవుడ్లో డ్రగ్స్ కేసును ఎన్సీబీ రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తోందని అధికార వర్గాల సమాచారం. ఇందులో ఒకటి సుశాంత్ రాజ్‌పుత్, రియా చక్రవర్తికి సంబంధించినది కాగా, ఇంకోటి దీనికి అసోసియేట్ యాంగిల్. 2019లో బయటికొచ్చిన ఓ వీడియోకు సంబంధించినది. ఈ వీడియోలో బాలీవుడ్ స్టార్ యాక్టర్లు చాలామంది ఉన్నారు. ఈ యాక్టర్లు అందరూ బాగా మత్తులో ఉన్నట్లుగా వీడియోలో కనిపించారు. దీంతో వీళ్లు డ్రగ్స్ తీసుకున్నారని అప్పట్లో మంజీందర్ సింగ్ సిర్సా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు దీని గురించి కూడా ఎన్ సీబీ ఆరా తీస్తోంది.
దియా మీర్జా కూడా?
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్తగా దియా మీర్జా పేరు తెరపైకి వచ్చింది. 2019లో దియా డ్రగ్స్ తీసుకున్నారని, ఆమెకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు డీలర్స్ పోలీసు విచారణలో ఒప్పుకున్నారని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీంతో ఆమెకు త్వరలోనే సమన్లు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని పేర్కొంటున్నాయి. దీనిపై దియా స్పందించారు. డ్రగ్స్ వ్యవహారంలో తనకెలాంటి సంబంధం లేదని ట్వీట్ చేశారు. తన లైఫ్‌లో ఇప్పటిదాకా డ్రగ్స్ జోలికి పోలేదని తెలిపారు. తనపై వస్తున్న ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు.
ఇంటర్నేషనల్ డ్రగ్స్ ముఠా అరెస్టు
ఇంటర్నేషనల్ డ్రగ్స్ ట్రాఫికింగ్ రాకెట్‌ను భగ్నం చేసినట్లు ఎన్ సీబీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి 8 మందిని అరెస్టు చేశామని, 8 కేజీల హెరాయిన్, 455 గ్రాముల కొకైన్, 1.1 కేజీల ప్రీమియం క్వాలిటీ గంజాయిని సీజ్ చేశామని చెప్పింది. ‘‘డ్రగ్ పార్శిల్ స్వాధీనం, ఇద్దరు ఆఫ్రికన్లు, ఒక మయన్మార్ మహిళను అరెస్టు చేయడం ద్వారా ఈ నెల మొదట్లోనే ఆపరేషన్ మొదలైంది. ఇండియా–నైజీరియా డ్రగ్ సిండికేట్ కు కింగ్ పిన్ ఫ్రాంక్ అలియాస్ పీటర్. అతను నోయిడాలోని తన అద్దె ఫ్లాట్ నుంచి సిండికేట్ నడుపుతున్నాడు. సెప్టెంబర్ 15 న అతన్ని అరెస్టు చేశాం” అని ఎన్సీబీ ఓ ప్రకటనలో తెలిపింది. గత కొన్ని నెలల్లో 52 కిలోల డ్రగ్స్ ను రవాణా చేసినట్లు దర్యాప్తులో తేలిందని చెప్పింది.
డీ.. కే.. వాళ్లేనా!!
రియా చక్రవర్తి మొబైల్ నుంచి రిట్రైవ్ చేసిన వాట్సాప్ మెసేజీల ఆధారంగా ఏజెన్సీ నమోదు చేసిన తొలి కేసుకు సంబంధించి ఈ సమన్లు జారీ చేశారు. సుశాంత్ కోసం డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు సంబంధించిన కన్వర్జేషన్స్ మెసేజీల్లో ఉన్నాయని ఎన్ సీబీ వర్గాలు పేర్కొన్నాయి. వాట్సాప్ చాట్స్ లో ‘డీ’, ‘కే’ అనే వ్యక్తుల పేర్లు ఉన్నట్లు చెబుతున్నాయి. డీ అంటే దీపిక పడుకోన్ అని, ‘కే’ అంటే దీపిక మేనేజర్ కరీష్మ అని అంటున్నారు. ఈ చాట్స్ 2017 అక్టోబర్ నాటివి. వాటిలో డీ అనే వ్యక్తి ‘మాల్’ ఉందా అని ‘కే’ని అడిగారు. దీనికి కే అనే వ్యక్తి ‘ఉంది.. కానీ ఇంట్లో ఉంది’ అని చెప్పారు. ‘నీకు కావాలంటే అమిత్ ను అడుగుతాను.. అతడి వద్ద ఉన్నాయి’ అని కే అన్నారు. ‘ఎస్’, ‘ఎన్’ అనే వ్యక్తుల చాటింగ్స్ కూడా అందులో ఉన్నాయి.
Courtesy V6Velugu