
స్వామి అగ్నివేశ్ పూర్తిగా రెండు భిన్న ప్రపంచాలలో నివసించారు. ఒకటి- ఆయన మత విశ్వాసాలకు సంబంధించినది. అది ఆయనకు చాలా ముఖ్యమైనది. హిందూ సమాజంలోని నానా దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ ప్రపంచమే ఆయనకు స్ఫూర్తినీ, శక్తినీ ఇచ్చింది. రెండోది లౌకిక కార్యకలాపాలకు సంబంధించినది. ఇందులో ఆయన నర్మదా బచావో ఆందోళన్ మొదలు మావోయిస్టులతో శాంతిచర్చలు, అవినీతిపై అన్నా హజారే సమరం దాకా వివిధ ఉద్యమాలు, పోరాటాలలో చురుగ్గా పాల్గొనేవారు.
ఢిల్లీలోని స్వామి అగ్నివేశ్ కార్యాలయం ఒక తెరిచిన గృహం. జంతర్‌మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించడానికి వచ్చిన వారందరికీ అది అందుబాటులో ఉంటుంది. సల్వాజుదుంపై మా కేసుకు సంబంధించి ఏదో ఒక అంశంపై స్వామి అగ్నివేశ్‌ను సంప్రదించడానికి వెళ్ళినప్పుడు ఆయన చుట్టూ విభిన్న వ్యక్తులు కూర్చుని ఉండేవారు. అయితే సరిగ్గా ఏడాది క్రితం ప్యారేలాల్ భవన్‌లో ఆర్య సమాజ్ వారు నిర్వహించిన అగ్నివేశ్ 80వ జన్మదినోత్సవ వేడుకలకు వెళ్ళినప్పుడు ఆయనకు వివిధ వర్గాలతో ఉన్న విస్తృత సంబంధాలు, పరిచయాలు నన్ను చకితపరిచాయి. ప్యారేలాల్ హాల్ కిక్కిరిసిపోయింది. సభికులలో మహిళలూ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారంతా అగ్నివేశ్ ప్రోత్సహించిన బేటీ బచావో ఆందోళన్‌లో భాగస్వాములే. రాజస్థాన్‌లోని దేవ్‌రాల గ్రామంలో జరిగిన సతీసహగమన హేయ కృత్యానికి వ్యతిరేకంగా ఆ గ్రామానికి ఆయన నిర్వహించిన నిరసన యాత్రలో పాల్గొన్నవారు కూడా ఆయన జన్మదిన వేడుకలకు వచ్చారు. అలాగే అగ్నివేశ్ నెలకొల్పిన బంధువా ముక్తి మోర్చా నుంచి లబ్ధి పొందిన వారు కూడా ఆ సభికులలో ఉన్నారు.
బంధువా ముక్తి మోర్చా వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1983) కేసు హర్యానాలోని ఇటుక బట్టీలలో పనిచేసే వెట్టికార్మికుల విముక్తిని లక్ష్యంగా చేసుకున్నదని, అలాగే ఉత్తరప్రదేశ్ లోని తివాచీ పరిశ్రమలో బాలకార్మికులను ఉపయోగించుకోవ డానికి వ్యతిరేకంగా1997లో ఆయన ఒక ప్రజాహిత వ్యాజ్యం వేసి తన లక్ష్యానికి అనుగుణంగాకోర్టు తీర్పునుపొందారనీ నాకు తెలుసు. ఆ రెండు కేసులూ ప్రజాహిత వ్యాజ్యాల సమరంలో మైలురాళ్ళని కూడా నాకు తెలుసు. అయితే ఆయన ఎంతగా విస్తృతస్థాయిలో సమాజ హిత కార్యకలాపాలలో పాల్గొంటున్నదీ అప్పటికి నాకు బాగా తెలియదు. స్వామి అగ్నివేశ్ రెండు పూర్తిగా భిన్నమైన ప్రపంచాలలో నివసించారు. ఒకటి- ఆయన మత విశ్వాసాలకు సంబంధించిన ప్రపంచం. అది ఆయనకు చాలా ముఖ్యమైనది. హిందూ సమాజంలోని నానా దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ ప్రపంచమే ఆయనకు స్ఫూర్తినీ, శక్తినీ ఇచ్చింది. రెండోది లౌకిక కార్యకలాపాలకు సంబంధించిన ప్రపంచం. ఈ ‘లౌకిక’ విశ్వంలో ఆయన నర్మదా బచావో ఆందోళన్ మొదలు మావోయిస్టులతో శాంతిచర్చలు, అవినీతిపై అన్నా హజారే సమరం దాకా వివిధ ఉద్యమాలు, పోరాటాలలో చురుగ్గా పాల్గొనేవారు.
స్వామి అగ్నివేశ్‌ను క్రైస్తవ విముక్తి ఈశ్వర తత్వవాదుల (క్రిస్టియన్ లిబరేషన్ థియాలజిస్ట్‌లు)తో పోల్చవచ్చు. హేతువాదులుగా, సంస్కర్తలుగా, పేదల విముక్తిపరులుగా జీవించడమే నిజమైన క్రైస్తవుడి కర్తవ్యమని లిబరేషన్ థియాలజిస్ట్‌లు విశ్వసిస్తారు. అలాగే అగ్నివేశ్ దృష్టిలో కూడా హేతువాదిగా, సమాజ సంస్కర్తగా, పేదల అభ్యున్నతికి కృషి చేసేవాడుగా జీవించేవాడే నిజమైన ఆర్యసమాజికుడు. లిబరేషన్ థియాలజిస్ట్‌తో చర్చ్ ఏకీభవించనట్టుగానే స్వామి అగ్నివేశ్ అభిప్రాయాలను ఆయన మాతృసంస్థ ఆర్యసమాజ్ అంగీకరించేది కాదు. ఆధ్యాత్మికత గురించి తాను రాసిన పుస్తకాలను నా చేత చదివించడానికి అగ్నివేశ్ అప్పుడప్పుడూ ప్రయత్నించేవారు. అయితే నా ఆసక్తులు పూర్తిగా భౌతికవాద పరమైనవి. 2018లో హైదరాబాద్‌లో వామపక్ష మహిళా బృందం ఒకటి నిర్వహించిన ఒక కార్యక్రమంలో అగ్నివేశ్‌తో పాటు నేనూ పాల్గొన్నాను. గొడ్డు మాంసం తింటున్నందుకు దళితులు, ముస్లింలపై గో రక్షణ నిఘాకారుల దుశ్చర్యలపై ఒక నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో భాగంగా ఒక నటుడు స్వామి అగ్నివేశ్ పాత్రలో వేదిక మీదకి వచ్చి ఆ దాడులకు వ్యతిరేకంగా ఒక ప్రసంగాన్ని వెలువరిస్తాడు. తనను గురించిన ఆ పాత్ర విషయంలో మీ అభిప్రాయమేమిటని నేను అడుగగా ఆయన నవ్వుతూ ‘అసలు అగ్నివేశ్ కంటే అతడు చాలా మెరుగ్గా ఉన్నాడని’ సమాధానమిచ్చారు. అప్పటికి ఒక సంవత్సరం ముందు జార్ఖండ్‌లో భారతీయ జనయువ మోర్చా మూక ఒకటి స్వామి అగ్నివేశ్‌పై భయానకమైన దాడి చేసింది. ఆ దాడిలో ఆయన కాలేయం బాగా దెబ్బ తిన్నది. ఇదే అంతిమంగా ఆయన మరణానికి దారి తీసింది. ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాను. చాలా బలహీనంగా ఉన్నారు. బాధపడుతున్నారు. ఆ విషయాన్ని ఆయనా ఒప్పుకున్నారు. అయినప్పటికీ కోలుకున్న తరువాత దేశవ్యాప్తంగా యువ భారతీయులను మతతత్వ వ్యతిరేక ఉద్యమకారులుగా సంఘటితం చేసేందుకు ఆయన సంకల్పించుకున్నారు.
భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తన మద్దతు దారులను స్వామి అగ్నివేశ్‌పై దాడికి పురిగొల్పడం ఇదే మొదటిసారి కాదు. పోలీసులు, ఎస్‌పిఓలు దగ్ధం చేసిన తాడ్‌మెట్ల, మోర్పల్లి, తిమా పురం గ్రామాల ప్రజలకు సహాయసామగ్రిని అందించడానికి వెళుతుండగా డోర్నపాల్ వద్ద ఆయనపై సల్వాజుదుం గుంపు దాడి చేసింది. ఈ సంఘటన 2011లో జరిగింది. ఆ సందర్భంలోనే నాకు ఆయనతో పరిచయమయింది. అగ్నివేశ్‌పై ఆ దాడిని పురిగొల్పింది దంతేవాడ పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ఆర్‌పి కల్లూరి. సుప్రీం కోర్టు విచారణలో ఉన్న మా కేసులో, డోర్నపాల్ వద్ద సంభవించిన దురాగతంపై ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసేందుకు అగ్నివేశ్ అడిగిన వెంటనే అంగీకరించారు. ఒక సంవత్సరం అనంతరం సల్వా జుదుంను నిషేధిస్తూ జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ఎస్ నిజ్జర్‌లు వెలువరించిన తీర్పుపై అగ్నివేశ్ అఫిడవిట్ గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
అప్పటి ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్, స్వామి అగ్నివేశ్‌ను ఎలా దగా చేసిందీ 2011 నాటి అఫిడవిట్ స్పష్టంగా వెల్లడించింది. ఆ ఏడాది అంతకుముందు నారాయణ్‌పూర్‌లో మావోయిస్టుల బందీలుగా ఉన్న పోలీసులను అగ్నివేశ్ విడుదల చేయించారు. ఇందుకు బదులుగా తన మానవతావాద సహాయక చర్యలను కొనసాగించేందుకు రమణ్‌సింగ్ సహకరిస్తారని అగ్నివేశ్ విశ్వసించారు. కానీ అలా జరగలేదు. 2011లో డోర్నపాల్ వద్ద స్వామి అగ్నివేశ్‌పై సల్వాజుదుం దాడి జరిగినప్పుడు ఆయన వయస్సు 72సంవత్సరాలు.అంత తీవ్ర స్థాయిలో హింసాత్మక దాడి జరిగినప్పటికీ అగ్నివేశ్ భయపడిపోలేదు. తన సహాయక చర్యలను కొనసాగించారు. ఛత్తీస్‌గఢ్‌లో శాంతి స్థాపనకు అకుంఠిత కృషి చేశారు. తాడ్‌మెట్ల గ్రామస్థులకు న్యాయం జరిగేందుకు పోరాడారు. తాడ్‌మెట్ల మొదలైన గ్రామాల పైన, అగ్నివేశ్ పైన జరిగిన దాడిపై సిబిఐ దర్యాప్తునకు 2011లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అగ్నివేశ్‌పై దాడికి కొంతమందిపై సిబిఐ చార్జిషీట్ దాఖలు చేసినప్పటికీ ఆ దర్యాప్తు ఇప్పటికీ పూర్తికానేలేదు. ఆ ఛార్జిషీట్ ఆధారంగా ఎవరికీ శిక్ష కూడా పడలేదు. స్వామి అగ్నివేశ్‌పై సిబిఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు ట్వీట్‌లను చదివిన తరువాత డోర్నపాల్ ఘటనలపై సవివరమైన సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కోర్టులో ఆ దర్యాప్తు సంస్థ వాదనలు చాలా బలహీనంగా ఉండడం పట్ల ఆశ్చర్య పోవలసినదేమీ లేదు.
దంతెవాడలో జరిగిన శాంతి యాత్రలో పాల్గొనడమే కాకుండా, ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరిగేందుకు అగ్నివేశ్ కృషి చేశారు. మావోయిస్టు అగ్రనేత ఆజాద్ ఒక ‘ఎన్‌కౌంటర్’లో చనిపోయారు. ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి నుంచి స్వామి అగ్నివేశ్ ద్వారా ఒక లేఖను ఆజాద్ తన సహచరుల వద్దకు తీసుకువెళుతుండగా ఆ ఎన్‌కౌంటర్ సంభవించింది. ఆజాద్ హత్యకు అగ్నివేశ్ తనను తాను నిందించుకునేవారు. ప్రభుత్వం తనను ఒక పావుగా ఉపయోగించుకుందని ఆయన భావించారు. 2014లో ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసులో సాక్ష్యమిచ్చేందుకు ఆయన ఆంధ్రప్రపదేశ్‌కు వెళ్లారు. స్వామి అగ్నివేశ్ నన్ను కలిసినప్పుడు లేదా ఫోన్‌లో మాట్లాడినప్పుడు ‘నమస్తే ప్రొఫెసర్ నందినీ సుందర్’ అని ప్రారంభించి, ‘జయహో జయహో’ అని ముగించేవారు. స్వామీజీ, మీరు ఎక్కడ ఉన్నా మాకు సదా స్పూర్తినిస్తూనే ఉంటారు.
Courtesy Andhrajyothi