అధికార్లు, నేతలు, వ్యాపారులపై గురి
- బాధితుల్లో ఐఏఎస్‌లు కూడా..
- పూజలు చేయించుకోవాలని హుకుమ్
- కాదంటే వారిపైనే క్షుద్ర ప్రయోగాలు
- చేస్తామని బెదిరింపు.. లక్షల్లో వసూళ్లు
- ఎన్నికల్లో అభ్యర్థుల తరఫున పూజలు
అరుంధతి’ సినిమాలో అఘోరా ‘పశుపతి’.. ‘వదల బొమ్మాళీ నిన్నొదలా’ అంటూ కథానాయిక వెంటపడతాడు! రాష్ట్రంలో కొందరు అధికారులు, నాయకులకు అఘోరాలు అలాంటి హారర్ సినిమానే చూపిస్తున్నారు!! తాము చెప్పిన పూజలు చేయించుకోవాలని.. రూ.లక్షల్లో దక్షిణ సమర్పించుకోవాలని హకుమ్ జారీ చేస్తున్నారు. కాదంటే క్షుద్రప్రయోగాలు చేసి సర్వనాశనం చేసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో అధికారులు, నాయకులు హడలిపోయి వారు చెప్పినట్టల్లా ఆడుతున్నారు! ఎన్నికలకు ముందు మొదలైన ఈ దందా ఇంకా కొనసాగుతోందని ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’ పరిశీలనలో తేలింది.
అఘోరా.. ఆ పేరు వినగానే చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది! తెల్లటి విభూతిని ఒంటికి పూసుకొని.. అట్టలు గట్టుకుపోయిన జడలతో.. త్రిశూలం, రుద్రాక్షలు ధరించిన రూపు కళ్లకు కడుతుంది. వారు శ్మశానాల్లో ఉంటారని.. శవాలను తింటారని.. విన్న మాటలు గుర్తొచ్చి భయం రెట్టింపు అవుతుంది. వారు ఎలా ఉన్నా.. జనజీవనస్రవంతికి దూరంగా ఉంటారు కాబట్టి సామాన్య ప్రజలకు వారితో ఎలాంటి ఇబ్బందీ ఉండేది కాదు. భయమూ ఉండేది కాదు. కానీ.. ప్రజల్లో ఉన్న ఈ భయాన్ని సొమ్ము చేసుకునేందుకు ఎక్కడెక్కడో ఉన్న అఘోరాలూ ఇప్పుడు రాష్ట్రం మీద పడ్డారు. ఐహిక సుఖాలకు దూరంగా శివనామస్మరణలో బతకాల్సినవారు.. డబ్బు, పదవుల కోసం రూటు మార్చి ధనార్జనకు దిగారు. బడా వ్యాపారులు, ఉన్నతాధికారులను, నాయకులను లక్ష్యంగా చేసుకొని.. గెలుపు కోసమో, అధిక ఆదాయం కోసమో, ప్రమోషన్ల కోసమో తమతో క్షుద్రపూజలు చేయించుకోవాలని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మాట వినకుంటే వారిపైనే ‘క్షుద్ర’ శక్తులను ప్రయోగిస్తామని బెదిరించి లక్షల్లో వసూళ్లు చేస్తున్నారు. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ప్రాంతంలో అఘోరాల హల్‌చల్ కనిపించింది. జడ్పీ ఎన్నికల్లోనూ కరీంనగర్‌తోపాటు పలు జిల్లాల్లో అఘోరాలు కొందరు అభ్యర్థుల తరఫున పూజలు చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది.
మహబూబ్‌నగర్ అడ్డాగా! రాష్ట్రంలోకి వచ్చిన అఘోరాలందరికీ.. మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ అఘోరానే నాయకుడని తెలుస్తోంది. తొలుత సాత్విక పద్ధతిలో జపతపాలు చేసిన ఆయన.. ఆ తర్వాత అఘోరాగా మారాడు. మహబూబ్‌నగర్‌లో ఆయనపై భూ లావాదేవీలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఇలాంటివారి మధ్యవర్తులు తరచూ అధికారులు, నాయకులు, బడా వ్యాపారుల చుట్టూ తిరుగుతారు. ‘‘నా దగ్గరకు ఓ మధ్యవర్తి వచ్చాడు. అఘోరాల గురించి చెప్పాడు. ఇద్దరు సీనియర్ బ్యూరోక్రాట్లు, మంత్రిపదవి ఆశిస్తున్న ఓ నేత పేరు చెప్పి.. వారి అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కోరాడు. దానికి నేను ఒప్పుకోలేదు. మీ ప్రయత్నాలు మీరు చేసుకోండని చెప్పా..’’ అని సచివాలయంలో పనిచేసే ఓ అధికారి ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్’కి తెలిపారు. ‘‘అంతకు ముందు సదరు మధ్యవర్తి తన ల్యాప్‌టా్‌పలో ఆ అఘోరాకు సంబంధించిన వివరాలు చూపించాడు’’ అని వివరించారు. ‘‘విచిత్రమేంటంటే.. అతడు కొన్ని ఫొటోల్లో అఘోరాలా.. కొన్ని ఫొటోల్లో సాధారణ వ్యక్తిలా కనిపించాడు. ప్రభుత్వ పెద్దలు కొందరు అతడిని సన్మానించిన ఫొటోలూ ఆ ల్యాప్‌టా్‌పలో ఉన్నాయి’’ అని తెలిపారు.
వలలో ఐఏఎస్, ఐపీఎస్‌లూ.ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న చిన్నస్థాయి ఉద్యోగులు మొదలు..సీనియర్ ఐపీఎ్‌సలు, ఐఏఎ్‌సలు.. ఇలా పలువురిని అఘోరాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నారని తెలిసింది. ఎన్నికల కోడ్ తర్వాత కొందరికి సాధారణ ప్రమోషన్లు రాగా.. అదికూడా తమ గొప్పేనని.. ఎవరికైనా కీడు జరిగితే.. ‘‘నా మాట విననందుకు అనుభవించు’’ అంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మహబూబ్‌నగర్‌కు చెందిన అఘోరా ఇటీవల ఓ సీనియర్ బ్యూరోక్రాట్‌ను కలిసినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ‘‘అన్నీ సవ్యంగా సాగాలంటే.. తనకు కొంత డబ్బు ఇస్తే పూజలు చేస్తానని సూచించాడు. సదరు అధికారి ఆ మొత్తం చెల్లించి, నల్లమలలో పూజలు చేయించాడు’’ అని వెల్లడించాయి
Courtesy Andhrajyothi