ఆంధ్ర దేశంలో ఆకలి కేకలు

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

– డా||కత్తి పద్మారావు

Image result for andhra pradesh midday meals poor hungersవిద్య, భూమి కలిగి వుండటం, పారిశ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచనలో ప్రధానమైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సద్భావన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజలకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండా కాదు.

రాష్ట్రంలో ఎటుచూసినా ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ప్రజా సమస్యల పైన ప్రజల ఆకలి తీర్చడం పైన దృష్టి సారించడం లేదు. ‘అన్ని విషయాలు నాకు తెలిసాయి’ అని ముఖ్యమంత్రి అనుకోవడమే దీనికంతటికి కారణం. కానీ ఆయనకు తెలియని ఆవేదన తెలుగు నేలలో వుంది. ఈ ఆకలి కేకలకు కారణం ముఖ్యమంత్రికి అంబేద్కర్‌ రాజ్యాంగ స్ఫూర్తి లేకపోవడం. రాజ్యాంగం ప్రధానంగా నిర్దేశిస్తున్న అంశం విద్యాభివృద్ధి. కానీ నేడు విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా వుంది. పాఠ్యపుస్తకాలు లేక, బోధించడానికి ఉపాధ్యాయులు లేక త్రైమాసిక పరీక్షలకు విద్యార్థులు సంసిద్ధులు కాలేక పోతున్నారు. ‘అమ్మ ఒడి’ ప్రచారం మోగిపోతోంది. మధ్యాహ్న భోజనంలో నీళ్ళ చారు, బుల్లి గుడ్డుతో అన్నం తినలేక పిల్లలు పస్తులుంటున్నారు. ఒక్కొక్క టాయిలెట్‌ దగ్గర ఇరవై మంది పిల్లలు క్యూలో నిలబడుతున్నారు. బాత్‌రూమ్‌లు దుర్గంధం కొడుతున్నాయి. రుతుక్రమం సమయంలో ప్యాడ్స్‌ కోసం హెచ్‌.యం ఆఫీసు దగ్గర బాలికలు క్యూ కడుతున్నారు. ఈ దృశ్యాలన్నింటిని పాదయాత్రలో ముఖ్యమంత్రి వర్ణించినవే. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక అటువంటి పరిస్థితి ఉండదని వాగ్ధానం కూడా చేశారు. కాని ఆ స్థితి యథాతథంగానే గాక ఇంకా అధ్వాన్న దశకు చేరుకుంది. విద్య సామాజిక పరిణామానికి మూలం. సమాజ భవితవ్యానికి సోపానం. ప్రధానంగా భారత రాజ్యాంగం విద్యా వ్యాప్తినే ప్రభుత్వాలకు ఆదేశిస్తున్నది. ప్రతి విద్యార్థికి విద్యను అందించే ప్రక్రియే ముఖ్యం. రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ రూ.రెండు లక్షల 20 వేల కోట్లు కాగా మరి స్కూళ్ళు ఎందుకు ఇంత అధ్వాన్న స్థితిలో వున్నాయి? బడ్జెట్లో కొత్త ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి 16,17 పైసలే పెంచింది. మరి రూ.6,7లకు నాసిరకం భోజనమే కదా వచ్చేది. ఇటువంటి భోజనం చేయలేక ఎంతో మంది హాస్టలు విద్యార్థులు ఉదయం నుండి సాయంత్రం వరకూ ఖాళీ కడుపుతో ఉంటున్నారు. పౌష్టికాహారం అంటే ఏంటో పాలకులకు తెలియదా? అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఎటువంటి ఆహారం వడ్డిస్తున్నారు? ప్రభుత్వానికి మానవతా స్ఫూర్తి కావాలి. అది లేని ప్రభుత్వం ఎండు కట్టె వంటింది. ప్రభుత్వ ప్రతినిధులెందుకు మధ్యాహ్న భోజనంలో సహ పంక్తికి రావడం లేదు. ప్రజా ప్రతినిధుల్లో కోట్లకు పడగలెత్తిన వారున్నారు. ప్రతి ప్రజాప్రతినిధికి మూడు లేక నాలుగు మండలాలే ఉంటాయి. కొందరి పరిధిలో ఒక మున్సిపాలిటీ కూడా ఉంటుంది. ప్రతి నియోజక వర్గంలో ప్రభుత్వ స్కూళ్ళు వుంటాయి. వారంలో ఏదో ఒక రోజు ఆ స్కూళ్ళ ప్రజాప్రతినిధి పిల్లలకు మంచి భోజనం పెట్టించవచ్చు. అసలు ప్రజాప్రతినిధులను సామాజిక కార్యకర్త్తలుగా ఎందుకు మార్చడం లేదు? పదో తరగతి ఉత్తీర్ణులైన వారిలో 50 శాతం మంది ఇంటర్మీయట్‌లో చేరడం లేదు. ఈ విషయం మీద ప్రభుత్వం ఎందుకు దృష్టి సారించడం లేదు? ‘మీ పిల్లల భవిష్యత్తు నా చేతుల్లో పెట్టండ’ని పాదయాత్రలో భరోసా ఇచ్చారు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? ఇంటర్మీయట్‌, బి.ఎ చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనం లేదు. స్కూళ్ళలో, కాలేజీల్లో మంచినీళ్ళు లేక విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు. 300 నుండి వెయ్యి మంది ఉండే స్కూళ్ళల్లో ప్రాథమిక చికిత్స అందించే నర్స్‌ లేరు. ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్న వారంతా యస్‌.సి, యస్‌.టి, బి.సి పిల్లలే! 80 శాతం మంది యస్‌.టి, యస్‌.సి లే అని తేలింది.

‘నాకు పార్టీలతో పనిలేదు. పారదర్శకతే ముఖ్యం’ అని చెప్పిన ముఖ్యమంత్రి, మధ్యాహ్న భోజన కార్మికులను, యానిమేటర్లను, ఆశా వర్కర్లను, మున్సిపల్‌ అంగన్‌వాడీ వర్కర్లను రాజకీయ కారణాలతో తొలగించి, తమ పార్టీ వారిని పెట్టుకొంటున్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధం! ఇలా తొలగించడం వల్ల ఒక యానిమేటర్‌ ఆత్మహత్య చేసుకొన్నారు కూడా! ‘పార్టీ కార్యకర్తలకే పదవులు’ అనే అంశం వల్లనే కదా చంద్రబాబు ప్రభుత్వం పై అసంతృప్తి రగిలింది. బాబు దారి లోనే ఈ ముఖ్యమంత్రి నడుస్తున్నారు. అంతేకాక, అనేకాంశాల్లో ఆయన్ని మించి పోతున్నారు. పేదల ఆకలి తీర్చే ‘అన్న క్యాంటిన్‌’ని కూడా రద్దు చేశారు. దీని వెనుక ఆంతర్యం ఏంటి? మరోపక్క వ్యవసాయ కార్మికులకు భూమి పంచకుండా ఉపాధి కూలీలుగా మార్చారు. గుంటూరు జిల్లా నివేదిక చూస్తే విస్తుపోక తప్పదు. జిల్లాలో సుమారు 13 లక్షల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు. 7,99,599 కుటుంబాలకు జాబ్‌ కార్టులు మంజూరు చేశారు. వీరిలో దళిత కుటుంబాలు 4,78,919 మంది, గిరిజనులు 1,12,954 మంది ఉన్నారు. మొత్తం జాబ్‌ కార్డుల్లో నమోదైన కూలీల సంఖ్య 15,53,660 మంది ఉన్నారు. దళిత, గిరిజన, బీసీ వర్గాల నుంచి మాత్రమే కాకుండా ఓసీల్లోని పేదలు సైతం కూలీలుగా నమోదైన పరిస్థితి ఉంది. అయితే జిల్లాలో ప్రతి రోజూ 1.50 లక్షల మందికే పని కల్పిస్తున్నారు. వేతనాలను పరిశీలిస్తే కనీస వేతనం రూ.211 రావాల్సి వుంది కానీ రూ.80 నుంచి రూ.140 మాత్రమే ఇస్తున్నారు. ఇకపోతే 100 పని దినాలు కల్పించాల్సి ఉండగా సరాసరి 40 పని దినాలు మాత్రమే కల్పిస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలుపుతున్నాయి. దీనిని బట్టి పరిశీలిస్తే ప్రతి వ్యవసాయ కార్మికుడు రోజుకు కనీస వేతనం నుంచి రూ.81 కోల్పోతున్నట్లు వెల్లడవుతోంది. ప్రతి రోజూ పని ప్రదేశాలకు ప్రతి కూలి తన మంచి నీరు తానే తెచ్చుకుంటే వేతనం కాకుండా రోజుకు రూ.5 మంచి నీటికి, పలుగు, పార తెచ్చుకుంటే రూ.5 అదనంగా అద్దె ఇవ్వాలి. ఈ వివరాలన్నీ పే స్లిప్పులో నమోదై పారదర్శకంగా కూలీలకు తెలియజేయాలి. అయితే అది అమలు జరగడం లేదు. పని ప్రదేశాల్లో మెడికల్‌ కిట్స్‌ దాదాపు లేవు. మజ్జిగ సరఫరా చేయడం లేదు. గతంలో మజ్జిగ సరఫరా చేసినా బిల్లులు రావడం లేదని మేట్స్‌ చెప్పారు. ఒక జిల్లా నివేదికే ఇలా వుంటే రాష్ట్ర మొత్తంగా ఉపాధి కూలీల సంగతి ఆలోచిస్తే దారుణంగా వుంది. ప్రజల దాహం తీర్చడానికి, ప్రజల పొట్ట నింపడానికి వెనకాడడం ఏ ధర్మ సూత్రమో ముఖ్యమంత్రే చెప్పాలి. తన చేతిలో రెండు కోట్ల 20 లక్షల ఎకరాల భూమి పెట్టుకొని విదేశీ కంపెనీలను పిలిచి పందేరం చేయాలని చూస్తున్నారే గాని, ఆ భూమిని భూమి లేని పేదలకు పంచి వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలని చూడడం లేదు.

విద్య, భూమి కలిగి వుండటం, పారిశ్రామీకరణలో భాగం కావడం అంబేద్కర్‌ ఆలోచనలో ప్రధానమైనవి. సమాజంలో అణగారిన ప్రజలు ఆకలితో బాధ పడకూడదు. వారి బిడ్డలు ఆకలితో అలమటించకూడదనే సద్భావన ముఖ్యమంత్రికి చాలా అవసరం. సులభంగా ప్రజలకు ఏదో ఒక పేరుతో డబ్బు ఇచ్చివేస్తే మన బాధ్యత తీరిపోతుందని అనుకోవడం సొంత ఎజెండా అవుతుందే కానీ రాజ్యాంగబద్ధ ఎజెండా కాదు. డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ అణగారిన వర్గాలకు న్యాయం చేయడం అంటే భూమి పంపకంలో, వారి పిల్లలకు విద్యను నేర్పించడంలో, పరిశ్రమల్లో వారిని భాగం చేయడంలో చిత్తశుద్ధితో వుండాలని చెప్పారు. నిజానికి దళితుల నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని పొగిడే పనిలో వున్నారు గాని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేె పరిస్థితి లేదు. ద్వేషంతో దేన్నీ నిర్మించలేం. ప్రేమ, కరుణతోనే పునర్నిర్మాణం సాధ్యం అని ముఖ్యమంత్రి తెలుసుకున్న నాడు ఆంధ్రదేశంలో ఆకలి కేకల నివారణకు పరిష్కారం రూపొందుతుంది.

Related image

 వ్యాసకర్త నవ్యాంధ్రపార్టీ, వ్యవస్థాపక అధ్యక్షులు

RELATED ARTICLES

Latest Updates