తెలంగాణలో పనిచేస్తున్న బాల కార్మికుల్లో 80 నుండి 90 శాతం వరకు దళిత, ఆదివాసి పిల్లలే ఉన్నారని ఒక అధ్యయనంలో తేలింది.
తెలంగాణ కార్మిక శాఖ, సెస్ సహకారంతో పది జిల్లాల్లో తొలివిడత అధ్యయనం జరిపింది. 56 మండలాల్లో జరిగిన పరిశీలనలో 9720 మంది బాల కార్మికుల్ని గుర్తించారు. నిజానికి 2016లో బాల కార్మిక చట్టం లో కొన్ని మార్పులు తెచ్చారు. ఈ ప్రకారం 14- 18 మధ్య వయసుల వారిని కౌమారులుగా గుర్తిస్తారు. వీరిని ప్రమాదకర పనుల్లో నియమించకూడదు. ఇలాంటి 8100 మందిని కూడా అధ్యయనంలో గుర్తించారు. వీరందరూ కూడా పాఠశాలలకు వెళ్ళటం లేదు. ఇది శాంపిల్ సర్వే మాత్రమేనని ఆమూలాగ్రం పరిశోధన చేస్తే అసలు గణాంకాలు బయటపడతాయని విద్యా వేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. భారతదేశంలో మూడు కోట్ల మందికి పైగా బాల కార్మికులు ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. వీరిలో అత్యధిక శాతం దళిత, ఆదివాసి ఓబీసీల పిల్లలేనని, కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఒకపక్క విద్యాహక్కు చట్టం వచ్చింది. ఇది సక్రమంగా అమలు కావటం లేదు. ఈ చట్టాన్ని కాలేజీ చదువుల దాకా విస్తరించాలని మేధావులు కోరుతున్నారు. తెలంగాణలో బాల కార్మిక వ్యవస్థ ఎంత దారుణంగా ఉందో, విద్యాహక్కు చట్టం ఎంత కాగితాలకే పరిమితం అయి ఉందో పై వాస్తవాలు బట్టబయలు చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం దళితుల అభివృద్ధి గురించి చెప్పేవన్నీ నీటిమీద రాతలేనని మరోసారి రుజువయ్యింది