బీసీలు, ముస్లింలకు సగం సీట్లిస్తాం

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

పురపోరుపై కాంగ్రెస్‌ ప్రకటన
కేసీఆర్‌ నియంతృత్వ ధోరణికి కొత్త పురపాలక చట్టమే నిదర్శనం
ప్రజాప్రతినిధులను తొలగించే అధికారం కలెక్టర్లకివ్వడమేంటి?
జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి
                                                               టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

పురపాలక ఎన్నికల్లో బీసీలు, ముస్లింలకు యాభై శాతం టికెట్లు కేటాయిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కనీసం గతంలో కాంగ్రెస్‌ ఇచ్చిన మేరకైనా వారికి రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి పట్టణంలో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియా, 32 జిల్లాలకు చెందిన డీసీసీ అధ్యక్షులు, కీలక నేతలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్త పురపాలక చట్టం లోపభూయిష్టంగా ఉందని విమర్శించారు. ‘‘ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న ప్రజాప్రతినిధులను తొలగించే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పురపాలక ఎన్నికల ప్రక్రియను 35 రోజుల్లోనే పూర్తి చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఇటీవలే న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తద్వారా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించలేని ప్రభుత్వ అసమర్థతను న్యాయస్థానం గుర్తించినట్లయింది’’ అని పేర్కొన్నారు. కౌన్సిలర్లే ఛైర్మన్లను నేరుగా ఎన్నుకునే పద్ధతిని కొత్త చట్టంలో పొందుపరిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. అన్ని పురపాలికల్లో తమదే విజయమని చెబుతున్న తెరాస ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. అత్యధిక స్థానాలను తాము గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

23న అన్ని మండల కేంద్రాల్లో నిరసనలు
బీసీల రిజర్వేషన్ల అంశమై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 23న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు. ‘ఇంటింటికీ కాంగ్రెస్‌-వాడవాడలో కాంగ్రెస్‌ జెండా’ అనే నినాదంతో అన్ని పురపాలికల్లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్‌ ఎలా విస్మరించారో ప్రజలకు తెలిసేలా కరపత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసే ప్రతి అభ్యర్థి రూ.20 స్టాంపు పేపరులో ప్రమాణ పత్రం(అఫిడవిట్‌) అందించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. పార్లమెంటు కంటే మన అసెంబ్లీనే బాగుందని, ఆ భవనం కూల్చివేతను అడ్డుకోవడం ద్వారా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు.

నాయకులు ఎదగకుండా చూసే కుట్ర: భట్టి విక్రమార్క
కొత్త పురపాలక చట్టంలో కలెక్టర్లకు ఇచ్చిన అధికారాలు క్షేత్రస్థాయిలో నాయకులు ఎదగకుండా చేసే కుట్రేనని కాంగ్రెస్‌ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క ఆరోపించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే అందుకు సంబంధించిన గణాంకాలను అందించాలని గతంలో సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కారణాలు సహేతుకంగా ఉంటే ఆ మేరకు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని, ప్రభుత్వం ఈ అంశాన్ని ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. షబ్బీర్‌ అలీ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్‌, జెట్టి కుసుమకుమార్‌, బోసురాజు, వంశీచంద్‌రెడ్డి, సలీం అహ్మద్‌, పొన్నాల లక్ష్మయ్య తదితరులు హాజరయ్యారు. వ్యక్తిగత కారణాలతో రేవంత్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ సమావేశానికి రాలేకపోయారని నేతలు వివరించారు.

(ఈనాడు సౌజన్యంతో)

RELATED ARTICLES

Latest Updates