బీపీసీఎల్, 4 సంస్థల్లో మొత్తం వాటా ఉపసంహరణ
- కాంకర్‌లో 30% వాటా విక్రయం
- ఆమోదించిన కార్యదర్శుల బృందం!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సహా నాలుగు ప్రభుత్వ రంగ సంస్థ(పీఎ్‌సయూ)ల్లో కేంద్రం తనకున్న మొత్తం వాటాను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు డిజిన్వె్‌స్టమెంట్ కార్యదర్శుల బృందం సోమవారం ఆమోదం తెలిపినట్లు సమాచారం. పూర్తి వాటా ఉపసంహరణకు సిద్ధం చేస్తున్న పీఎ్‌సయూల్లో బీపీసీఎల్‌తోపాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ), టీహెచ్‌డీసీ ఇండియా, ఎన్‌ఈఈపీసీఓ కూడా ఉన్నాయి. వీటితోపాటు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(కాంకర్)లో సైతం 30 శాతం వాటా విక్రయానికి కార్యదర్శుల బృందం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో కాంకర్‌పైన కూడా ప్రభుత్వం నియంత్రణాధికారం కోల్పోనుంది. 2000 సంవత్సరం తొలినాళ్లలో అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో చేపట్టిన పీఎ్‌సయూ వాటాల విక్రయం తర్వాత కేంద్ర సర్కారుకు ఇదే అతిపెద్ద ప్రైవేటీకరణ ప్రక్రియ కానుంది. బీపీసీఎల్ విషయంలో మాత్రం ప్రభుత్వం లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఈ కంపెనీ పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పాటైంది.
మూడింటితో రూ.66 వేల కోట్ల ఆదాయం!…బీఎ్‌సఈలో బీపీసీఎల్ షేరు ధర సోమవారం రూ.470.05 వద్ద ముగిసింది. ఈ రేటు ప్రకారం చూస్తే, కంపెనీలో తనకున్న వాటా మొత్తాన్ని విక్రయిస్తే ప్రభుత్వానికి రూ.54,055 కోట్లు సమకూరే అవకాశం ఉంటుంది. కాంకర్ (షేరు ముగింపు ధర రూ.604.6)లో 30 శాతం వాటా విక్రయంతో మరో రూ.11,051 కోట్లు సమకూరవచ్చు. షిప్పింగ్ కార్పొరేషన్ (షేరు ముగింపు ధర రూ.43.20) ప్రెవేటీకరణతో ఇంకో రూ.1,282 కోట్లు లభించవచ్చు. అంటే, ఈ మూడింటిలో వాటా విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.66,388 కోట్లు లభించే అవకాశముంది. టీడీహెచ్‌డీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(ఎన్‌ఈఈపీసీఓ) అన్ లిస్డెట్ కంపెనీలు. ఇందులో టీహెచ్‌డీసీని ఎన్‌హెచ్‌పీసీకి, ఎన్‌ఈఈపీసీఓను ఎన్‌టీపీసీ చేతికి అప్పగించవచ్చని సమాచారం.
రూ.లక్ష కోట్ల డిజిన్వె్‌స్టమెంట్ లక్ష్యం…ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2019-20)లో పీఎ్‌సయూ వాటాల విక్రయం(డిజిన్వె్‌స్టమెంట్) ద్వారా రూ.1.05 లక్షల కోట్ల ఆదాయం సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధం(ఏప్రిల్-సెప్టెంబరు) వరకు రూ.12,357.49 కోట్లు మాత్రమే సమీకరించగలిగింది. కార్పొరేట్ పన్ను తగ్గింపుతో ఖజానాకు ఆదాయం గణనీయంగా తగ్గనుంది. జీఎ్‌సటీ వసూళ్లూ నిరాశజనకంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ద్రవ్యలోటు అదుపుతప్పే ప్రమాదం ఉంది. లోటు కట్టు తప్పకుండా ఉండేందుకు డిజిన్వె్‌స్టమెంట్ లక్ష్య సాధన కీలకంగా మారింది.
Courtesy Andhrajyothi