4000 బడుల మూత?

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

స్కూళ్లు మూత

విద్యార్థులు సంఖ్య తక్కువ పేరిట వేలాది బడుల మూతకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే ఇలా వందలాది పాఠశాలలను మూతవేశారు. విద్యావ్యాపారానికి ఇది ఊ తనిచ్చే చర్య. అలాగే ప్రభుత్వ స్కూళ్లు మూతపడడం అంటే దళిత బహుజన విద్యార్థులకు చదువును దూరం చేయడమే అవుతుంది.

3500 ప్రాథమిక పాఠశాలలు
500 ఉన్నత పాఠశాలలు
విద్యార్థులు, టీచర్లు ఇతర స్కూళ్లకు
టీఆర్టీ నియామకాలు కాగానే ప్రక్షాళన
విద్యార్థులు లేని బడులకు కోత     
మూసివేతకు రాజస్థాన్‌ ఫార్ములా
సర్కారుకు నేడు అధికార్ల నివేదిక
త్వరలో టీచర్ల సంఘాలతో భేటీ
పదోన్నతుల తర్వాతే టీఆర్‌టీ నియామకాలు
పలు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌.

తెలంగాణలో 4 వేలకు పైగా ప్రభుత్వ బడులు మూతపడనున్నాయి. సరిపడా విద్యార్థులు లేని బడులను మూసివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాజస్థాన్‌ ఫార్ములాను అనుసరించనున్నారు. ఐదుగురు సభ్యుల అధికారుల బృందం ఇటీవల రాజస్థాన్‌లో పర్యటించింది. అక్కడ ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని మూసివేశారు? ఏ అంశం ఆధారంగా మూసివేశారు? వంటి విషయాలపై ఈ బృందం అధ్యయనం చేసింది. పూర్తి నివేధికను బుధవారం ప్రభుత్వానికి అందించనుంది. రాజస్థాన్‌లో 2015 నుంచి ఇప్పటి వరకు నాలుగేళ్లలో 20 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారు. 30 మంది కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలను మూసివేసినట్లు మన అధికారులు గుర్తించారు. ఇక్కడ కూడా అదే ఫార్ములాను అమలు చేయనున్నారు. మూసివేసే బడుల్లో ఉన్న విద్యార్థులు, టీచర్లను ఇతర పాఠశాలలకు తరలిస్తారు. రోజూ దూరంగా ఉన్న పాఠశాలకు వచ్చే విద్యార్థులకు రవాణా చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. టీచర్లను అవసరం ఉన్న పాఠశాలలకు డిప్యుటేషన్‌ మీద పంపిస్తారు.

టీఆర్టీ నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత బడుల మూసివేతకు శ్రీకారం చుడతారు. ఇప్పటికే అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. 10 మంది విద్యార్థుల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల వివరాలను, 30 మంది లోపు ఉన్న ఉన్నత పాఠశాలల వివరాలను అందించాలని ఆదేశాలిచ్చారు. ఇప్పటికే కొన్ని జిల్లాలు సమాచారాన్ని అందించగా, మరికొన్ని జిల్లాలు కసరత్తు చేస్తున్నాయి. బడుల మూసివేతకు ఓవైపు అంతర్గత చర్యలు చేపడుతూనే పైకి మాత్రం అలాంటిదేమీ లేనట్లే వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఓ ఉపాధ్యాయ సంఘం నాయకుడు పాఠశాల విద్యా కమిషనర్‌ను రాజస్థాన్‌ పర్యటనపై ఆరా తీయగా… త్వరలోనే ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని, అందరి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్టీ నియామకాలు కూడా ఎక్కువ విద్యార్థులు, తక్కువ టీచర్లు ఉన్న పాఠశాలల్లో మాత్రమే చేపట్టనున్నారు. దీంతో టీఆర్టీ నియామకాల తర్వాత బడుల రేషనలైజేషన్‌ చేసినాఇబ్బంది ఏమీ ఉండదని అధికారులు తెలిపారు. మూసివేతపై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నారు.

4 వేల స్కూళ్లకు ముప్పు…
తెలంగాణలో 26,040 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 18,217 ప్రాథమిక పాఠశాలలు, 3,186 ప్రాథమికోన్నత పాఠశాలలు, 4,637 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 27.73 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడులను మూసివేయాలనే విద్యాశాఖ నిర్ణయంతో తెలంగాణలో సుమారు 4 వేల పాఠశాలలకు మూసివేత ముప్పు వాటిల్లనుంది. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3500 వరకు ఉండగా, ఉన్నత పాఠశాలలు 500 వరకు ఉండే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో 10 కన్నా, ఉన్నత పాఠశాలల్లో 30 కన్నా తక్కువ విద్యార్థులున్న పాఠశాలలపై వేటు పడనుంది. 2018-19 విద్యా సంవత్సరంలో 3445 ప్రాథమిక పాఠశాలల్లో, 22 ఉన్నత పాఠశాలల్లో 1-15 మంది విద్యారులున్నారు. 14138 ప్రాథమిక పాఠశాల్లో, 1397 ఉన్నత పాఠశాలల్లో 16-100 మంది విద్యార్థులు ఉన్నారు. కనీసంగా 4వేల పాఠశాలలు మూతపడే అవకాశాలు కనిపించాయి. 2017-18 లెక్కల ప్రకారం 793 పాఠశాలల్లో విద్యార్థులే లేరు. వీటిలో 779 ప్రాథమిక పాఠశాలలు కాగా 11 ప్రాథమికోన్నత, 3 ఉన్నత పాఠశాలల ఉన్నాయి. 1544 పాఠశాలల్లో 1-10 మంది విద్యార్థులున్నారు. వీటిలో వీటిలో ప్రాథమిక పాఠశాలలు 1510 కాగా, ప్రాథమికోన్నత పాఠశాలలు 30, ఉన్నత పాఠశాలలు 4 ఉన్నాయి. 3,252 పాఠశాలల్లో 11-20 మంది విద్యార్థులున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3,13, ప్రాథమికోన్నత పాఠశాలలు 96, ఉన్నత పాఠశాలలు 22 ఉన్నాయి. వీటితో పాటు 3681 పాఠశాలల్లో 21-30 మంది విద్యార్థులున్నారు. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 3420, ప్రాథమికోన్నత పాఠశాలలు 217, ఉన్నత పాఠశాలలు 44 ఉన్నాయి.

(ఆంధ్రజ్యోతి సౌజన్యంతో)..

RELATED ARTICLES

Latest Updates