370 రద్దు: ‘రాజకీయ’ నోట్ బందీ!

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

రాజ్‌దీప్‌ సర్దేశాయి

మోదీ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలూ పౌర సమాజంపై విధ్వంసకర ప్రభావాలను నెరపాయి. నగదుపై ఆధారపడిన అనియత రంగంలోని అత్యధికుల ఆర్థిక స్థితిగతులను నోట్ల రద్దు అతలాకుతలం చేసింది. కశ్మీర్ లోయకు పర్యాటకులు వెల్లువెత్తే తరుణంలో అధికరణ 370ని రద్దుచేశారు. ఇది కశ్మీరీలను అనేక సమస్యలు, వెతల పాలు చేసింది. అయినప్పటికీ, సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ చర్యలను ఓటర్లలో అత్యధికులు ఆమోదిస్తున్నారు. నోట్ బందీ అనంతరం వివిధ ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలే ఆ ప్రజామోదానికి తిరుగులేని నిదర్శనాలు. అధికరణ 370 రద్దు ఇంకా ఎన్నికల పరీక్షలో నెగ్గవలసివున్నది.

ఒక నిర్ణయం లేదా చర్య మంచి చెడ్డలు నిర్ధారితమవ్వడానికి కాలం పట్ట వచ్చు గానీ, తక్షణ ప్రతిస్పందనలు, సదరు నిర్ణయం లేదా చర్య సానుకూల, ప్రతికూల పర్యవసానాలను తప్పక సూచిస్తాయి. అధికరణ 370పై లోక్‌సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు శశి థరూర్ చేసిన ఒక వ్యాఖ్యే ఇందుకొక నిదర్శనం. జమ్మూ కశ్మీర్‌కు భారత రాజ్యాంగం కల్పించిన ప్రత్యేక హోదా రద్దుకు పూనుకోవడం, 2016లో అమలుపరిచిన డిమానిటైజేషన్ (చలామణీ నుంచి కరెన్సీ నోట్ల ఉపసంహరణ)కు తుల్యమైన రాజకీయ చర్య అని, ఫలితాలు జాతి హితానికి దోహదం చేయబోవని శశి థరూర్ హెచ్చరించారు ( పార్లమెంటరీ నైపుణ్యాల ప్రాతిపదికన చూసినప్పుడు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడుగా, అసంబద్ధంగా మాట్లాడే అధీర్ రంజన్ చౌధురి స్థానంలో శశి థరూరే వుండడం వాంఛనీయం అని చెప్పటానికి నేను సందేహించను). శశి థరూర్ నిర్మలంగా, నిష్పాక్షికంగా చేసిన ఆ వ్యాఖ్య అత్యుక్తిగా కన్పించవచ్చు గానీ నిశితంగా పరిశీలిస్తే అధికరణ 370ని నిర్వీర్యం చేసిన తీరు, రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల ఉపసంహరణ వైనం మధ్య స్పష్టమైన సాదృశ్యాలు అవగతమవుతాయి. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో నరేంద్ర మోదీ- అమిత్ షా ద్వయం అనుసరించే పద్ధతులను అర్థం చేసుకోవడానికి కూడా ఆ సాదృశ్యాలు తోడ్పడతాయి.

అప్పుడూ (2016లో) ఇప్పుడూ (2019లో) ఆ రెండు ప్రసిద్ధ నిర్ణయాల (నోట్ల రద్దు, 370 రద్దు) ను అత్యంత గుట్టుగానూ, అతి తక్కువ సంప్రతింపులతో మాత్రమే తీసుకున్నారు. డీమానిటైజేషన్ సందర్భంలో గోప్యత తప్పనిసరి. ఎందుకంటే ‘నోట్ బందీ’ స్వభావమే ఆ చర్యను అత్యంత రహస్యంగా అమలుపరచడాన్ని అనివార్యం చేసింది. అధికరణ 370 రద్దు విషయానికి వస్తే, అది, భారతీయ జనసంఘ్‌గా వర్ధిల్లిన కాలం నుంచీ తమ పార్టీ ఎజెండాలో ఉందని పాలక పక్షం వర్గాలు వాదిస్తున్నాయి. ఇప్పుడు పార్లమెంటులో తమ పార్టీకి పూర్తి మెజారిటీ ఉన్నందున ఆ నిర్ణయాన్ని అమలుపరిచామని, తద్వారా చాలాకాలంగా చేస్తున్న ఒక ఎన్నికల హామీని నెరవేర్చామని భారతీయ జనతా పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 2015 తుదినాళ్ళ వరకు కూడా జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకై ముఫ్తీ మహమ్మద్ సయీద్ నేతృత్వంలోని పీడీపీతో బీజేపీ కలిసి పని చేసింది. ఆ పొత్తు కారణంగానే వివాదాస్పద అధికరణ 370పై తమ నిర్ణయం అమలును వాయిదా వేసేందుకు బీజేపీ అంగీకరించింది. ముఫ్తీ పార్టీతో పొత్తు తెగతెంపులు అవ్వడంతో నరేంద్ర మోదీ, -అమిత్ షా ద్వయం అధికరణ 370ని రద్దు చేసేందుకు (కశ్మీర్ రాజకీయ పక్షాలనేకాదు, చివరకు కశ్మీర్ లోయ ప్రజలను సైతం ఏ మాత్రం సంప్రదించకుండానే) పూనుకున్నారు.

నోట్ల రద్దు, అధికరణ 370 రద్దు రెండు సందర్భాలలోనూ అంతకంతకూ పెచ్చరిల్లుతూ పరివ్యాప్తమవుతున్న నిరంకుశాధికార తత్వం, ఒక ప్రజాస్వామ్య వ్యవస్థకు సంబంధించిన సంస్థాగత ప్రక్రియలను పూర్తిగా ఉపేక్షించింది. మరింత స్పష్టంగా చెప్పాలంటే నిర్వీర్యం చేసింది. ఆర్థిక నిపుణుల అభ్యంతరాలను తోసిపుచ్చి ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకున్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఫలితంగా రిజర్వ్ బ్యాంక్ స్వతంత్ర ప్రతిపత్తి బాగా బలహీనపడింది. అధికరణ 370 రద్దును వ్యతిరేకించే విషయంలో పార్లమెంటు తనకు తానే దుర్భలమై పోయింది. శశి థరూర్ మాటల్లో చెప్పాలంటే మోదీ ప్రభుత్వం, పార్లమెంటును ఒక చర్చా వేదికగా గాకుండా ఒక నోటీస్ బోర్డ్ గా మాత్రమే పరిగణించింది.

నోట్ల రద్దు, 370 రద్దు రెండిటినీ సమున్నత నియమాలకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాలని ప్రభుత్వం ఘంటాపథంగా చెప్పింది. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన ఒక ‘నైతిక మహోద్యమం’గా నోట్లరద్దును అభివర్ణించారు. జాతీయ సమైక్యతే ధ్యేయంగా ‘ఒకే జాతి, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’ ఉద్యమంలో భాగమే అధికరణ 370 రద్దు అని ఘోషించారు. నిజమేమిటి? నోట్ బందీగానీ, కశ్మీర్ ప్రత్యేక హోదా రద్దుగానీ ఎటువంటి ఉజ్వల, ఉదాత్త విలువల ప్రేరణతో చేపట్టిన చర్యలు ఎంత మాత్రమూ కావు. నోట్ల రద్దుతో జరిగిందేమిటి? నల్లధనం అపరిమితంగా ఉన్న సంపన్నులు దానిని అత్యంత సులువుగా చట్టబద్ధం చేసుకున్నారు! చిల్లర వర్తకులు, చిన్న వ్యాపారస్తులు మాత్రం కోలుకోలేని విధంగా నష్టపోయారు. అధికరణ 370ని, నిస్సిగ్గుగా అనైతిక పద్ధతిలో నిర్వీర్యం చేశారు. ఆ క్రమంలో రాజ్యాంగ స్ఫూర్తిని పూర్తిగా నిర్లక్ష్యం చేసి, రాష్ట్రంగా ఉన్న జమ్మూ -కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలోని మిగతా రెండు ప్రాంతాలపై కశ్మీర్ లోయ రాజకీయ ఆధిపత్యాన్ని పూర్తిగా కూలదోసే ఏకైక లక్ష్యంతోనే జమ్మూకశ్మీర్‌ను విభజించడం జరిగింది. అధికార కేంద్రీకరణ ఆరాటంతో, ఆ సమస్యాత్మక రాష్ట్రాన్ని పూర్తిగా కేంద్రం నియంత్రణలోకి తీసుకునేందుకై రాజ్యాంగంలో సమున్నతంగా పొందుపరిచిన సమాఖ్య పద్ధతి, స్ఫూర్తిని పూర్తిగా అలక్ష్యం చేశారు.

నోట్ బందీ, 370 రద్దు సందర్భాలు రెండిటిలోనూ ఒక ‘నిర్దిష్ట’ శత్రువు ఉన్నాడు. నోట్ల రద్దు విషయంలో సంపన్న వర్గాలను ఒక వర్గ పోరాటంలోకి ఈడ్చారు. 370 రద్దు సందర్భంగా కశ్మీర్ లోయలోని రాజకీయ పెత్తందారీ కుటుంబాలను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నారు. గమనార్హమైన విషయమేమిటంటే ఈ రాజకీయ కుటుంబాలకు కేంద్రంలోని ప్రతి ప్రభుత్వమూ అండదండలనిచ్చాయి. తమకు అవసరమైనప్పుడు వాటిని అధికారంలో నిలబెట్టాయి. చివరకు మోదీ ప్రభుత్వం కూడా 2015–18 సంవత్సరాల మధ్య కశ్మీర్‌లోని ఒక రాజకీయ పార్టీతో కలసి కూటమి కట్టడాన్ని ప్రజలు ఇంకా విస్మరించలేదు. కశ్మీర్‌లో ఎదుర్కొంటున్న సమస్యలకు ఇస్లామాబాద్‌ను నేరుగా లక్ష్యం చేసుకోలేరు. ఎందుకంటే కశ్మీర్, భారత్ ‘అంతర్గత వ్యవహారం’ కదా. కనుక అబ్దుల్లాలు, ముఫ్తీలను విలన్‌లుగా చూపించడం చాలా సులువు మరి. నోట్ల రద్దు విషయంలోనూ ఇదే పరిస్థితి. ఎన్నికలకు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడంలో అపారదర్శక పద్ధతులను అరికట్టడం ద్వారా నల్ల ధనానికి మూల కారకులుగా ఉన్నవారిపై చర్య తీసుకోలేరు. నోట్ బందీతో నగదు అపరిమితంగా ఉన్న సంపన్న కుటుంబాలు దివాలా తీస్తున్నాయనే భావాన్ని ప్రజలకు కల్గించడం అత్యంత సులువు మరి.

2016లోనూ, 2019లోనూ మోదీ ప్రభుత్వం తీసుకున్న రెండు కీలక నిర్ణయాలూ పౌర సమాజంపై విధ్వంసకర ప్రభావాలను నెరపాయి. నగదుపై ఆధారపడిన అనియత రంగంలోని అత్యధికుల ఆర్థిక స్థితిగతులను నోట్ల రద్దు అతలాకుతలం చేసింది. ఆ పెనుదెబ్బ నుంచి వారు ఇప్పటికీ కోలుకోనే లేదు. కశ్మీర్ లోయకు పర్యాటకులు వెల్లువెత్తే తరుణంలో అధికరణ 370ని రద్దుచేశారు. ఈద్ పర్వదిన వేడుకలను ఆనందోత్సాహాలతో జరుపుకోవడానికి వీలులేకుండా సామాన్య కశ్మీరీలను ఆ నిర్ణయం అనేక సమస్యలు, వెతల పాలు చేసింది. దీపావళి పర్వదినం ఆసన్నమవుతున్న సందర్భంలో దేశంలోని మరేదైనా ప్రాంతంలో ల్యాండ్ లైన్, మొబైల్ ఫోన్ సర్వీస్‌లు, ఇంటర్నెట్ కనెక్షన్లతో సహా మౌలిక సేవలన్నిటినీ నిరోధించే చర్యకు ఏ రాజకీయ నాయకత్వమైనా సాహసించగలదా?

నోట్ బందీ విషయంలో వలే అధికరణ 370 వ్యవహారంలో కూడా నరేంద్ర మోదీ, -అమిత్ షా ద్వయం పెద్ద సాహసానికి పూనుకున్నట్టు స్పష్టంగా కన్పిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో చలామణీలో ఉన్న 86 శాతం నగదును రాత్రికి రాత్రే ఉపసంహరించుకోవడం నిస్సందేహంగా ఒక పెద్ద నిర్ణయమే. ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయని తనం ఆ నిర్ణయంలో స్పష్టంగా కన్పిస్తుంది. అధికరణ 370 రద్దు కూడా అంతే అపాయకరమైన నిర్ణయం. ఈ నిర్ణయానికి ముందు కశ్మీర్‌లో ఉన్న రాజకీయ వాతావరణంలోనే కశ్మీరీలు సంతోషంగా లేరు. హిందూత్వ అధిక సంఖ్యాకుల వాదం అంతకంతకూ పెచ్చరిల్లి పోతుండడంతో తాము పరాయీకరణ చెందుతున్నామని, తమ రాష్ట్రం అన్యాక్రాంతమవుతుందన్న భావన కశ్మీరీలను మరింతగా బాధిస్తోంది. హిందూత్వ శక్తులు ముస్లింలను ‘ఇతరులు’గా పరిగణించడం అంతకంతకూ పెచ్చరిల్లి పోతుండంతో తీవ్రవాద ఇస్లామిస్టులు భారత్ పట్ల మరింత వ్యతిరేకతను పెంచుకోవడానికి ఆస్కారమేర్పడింది. అయినప్పటికీ, సమస్యలను పరిష్కరించని ప్రభుత్వ చర్యలను ఓటర్లలో అత్యధికులు ఆమోదిస్తున్నారు. నోట్ బందీ అనంతరం జరిగిన వివిధ శాసన సభ ఎన్నికలు, సార్వత్రక ఎన్నికలలో బీజేపీ సాధించిన విజయాలే ఆ ప్రజామోదానికి తిరుగులేని నిదర్శనాలు. అధికరణ 370 రద్దు ఇంకా ఎన్నికల పరీక్షలో నెగ్గవలసివున్నది. అయితే ప్రజల మాటామంతీని బట్టి భావి ఎన్నికలలో కూడా బీజేపీ విజయానికి అది విశేషంగా దోహదం చేయగలదనే సూచనలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.

ఆసక్తికరమైన విషయమేమిటంటే 2019 ఎన్నికల ప్రచారంలో నోట్ల రద్దు ఒక ప్రధానాంశంగా లేదు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 8 నుంచి 6 శాతానికి పడిపోవడం, ఉన్న ఉద్యోగాలనూ నష్ట పోవడం, వ్యవసాయ ఆదాయాలు అంతకంతకూ తగ్గిపోవడం ఇత్యాది పరిణామాలు ప్రజలను అమితంగా వేధిస్తున్నాయన్న సత్యాన్ని దేశ పాలకులు గ్రహించడం వల్లే నోట్ల రద్దు ఎన్నికల ప్రచారాంశం కాలేదు. నోట్ల రద్దును తొలుత ఉగ్రవాద వ్యతిరేక, దొంగనోట్ల నిరోధక చర్యగా పాలకులు ప్రచారం చేశారు. అయితే ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేసే లక్ష్యంతోనే ఆ చర్యను చేపట్టినట్టు చెప్పసాగారు. ఈ దృష్ట్యా అధికరణ 370 రద్దుపై ఒక తుది తీర్పును వెలువరించేందుకు ఒక ఏడాది, లేదా రెండు సంవత్సరాల పాటు వేచి వుండడం మంచిది. నరేంద్ర మోదీ,- అమిత్ షా ద్వయం రాజ్యాంగ బద్ధంగా సాధించిన పెనుమార్పు యథార్థంగా నయా కశ్మీర్‌ను సృష్టిస్తుందా లేక ఆ సమస్యాత్మక రాష్ట్రాన్ని మరింతగా అంధకార అగాధం, అనిశ్చితిలోకి నెట్టి వేస్తుందా? ప్రజా నిర్ణయం ఇంకా వెలువడవలసివున్నది.

తాజా కలం : 2016లో నోట్ బందీ నుంచి 2019లో అధికరణ 370 రద్దు వరకు నిర్ణయాలు తీసుకోవడంలో మారిన తీరుతెన్నుల విషయంలో న్యూఢిల్లీ రాజకీయ వర్గాలలో ఒక జోక్ వినబడుతోంది. నోట్లరద్దు ఏక వ్యక్తి షో కాగా అది ఇప్పుడు రెండున్నర వ్యక్తులకు విస్తరించింది. నరేంద్ర మోదీ, అమిత్ షాలు తిరుగులేని ప్రధాన నిర్ణేతలు కాగా ఆ ద్వయం వాణిలో సగభాగాన్ని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ విన్పిస్తున్నారు!

 

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్)

(Courtacy Andhrajyothi)

 

RELATED ARTICLES

Latest Updates