పైపై పూతలే..

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email


– ‘మమ’ అన్నట్టుగా గ్రామాల్లో ముప్పై రోజుల పని
– సగం రోజులకైనా రాని ప్రభుత్వ ప్రత్యేక నిధులు
– 2011 జనాభా లెక్కలతో పోలిస్తే జీపీల్లో పెరిగిన జనం
– లక్షల రూపాయలు సొంతంగా ఖర్చు పెడుతున్న సర్పంచులు
– సమస్యలు పరిష్కారం కావంటున్న స్థానికులు
ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం అధికారులనూ, సర్పంచ్‌లనూ ముప్పు తిప్పలు పెడుతున్నది. ఎలాంటి లోపం జరిగినా బాధ్యులు మీరేనంటూ ఉన్న హెచ్చరికలు వారిని ఉరుకులూ పరుగులూ పెట్టిస్తున్నది. అయితే పనులకు సరిపడా నిధుల్లేక.. వచ్చిన కొన్నీ ఎటూ సరిపోక సర్పంచులు తలలు పట్టుకుంటున్నారు. ఆర్థిక సంఘం నిధులకు తోడు ప్రత్యేకంగా కేటాయించామని ప్రభుత్వం చెబుతున్నా కొన్ని జిల్లాలకు ఇప్పటిదాకా పైసా అందలేదు. ‘పిండి కొద్ది రొట్టె’ అన్నట్టు ఉన్నదాంట్లోనే సర్దిపెడుతుండగా ప్రజల స్వచ్ఛంద శ్రమదానంతోనే ఎన్నో పనులు ముగిస్తున్న పరిస్థితి..!
నవతెలంగాణ-మొఫిసిల్‌ యంత్రాంగం
రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో సెప్టెంబర్‌ 6 నుంచి 30 రోజుల ప్రణాళిక కార్యక్రమాలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం నిధులతో పాటు ఆర్థిక శాఖ నుంచి మరిన్ని నిధులు విడుదల చేస్తున్నా మని తెలిపింది. 2011 జనాభా ప్రాతిపదికన కేటాయిస్తామని చెప్పి, పారిశుధ్యం మొదలు పచ్చదనం మెరుగుచేసేదాకా పంచాయతీలదే బాధ్యతంటూ భారం వేసింది. సుమారు 60 పనులతో కూడిన ప్రణాళిక రూపొందించగా కార్యచరణకు దిగిన సర్పంచులు, అధికారులకు వాటిని కొనసాగించడం తలకు మించిన భారం గా మారింది. డ్రయినేజీ, పిచ్చిమొక్కల తొలగింపు, వీధి లైట్లు, శిథిలావస్థ ఇండ్ల తొలగింపు, శ్మశాన వాటిక స్థలం, ఇతర మరమ్మతులకు పెద్దమొత్తంలో ఖర్చవు తుందని వాపోతున్నారు. వచ్చిన కొద్దిపాటి నిధులు జేసీబీ, ట్రాక్టర్లకే సరిపోతోం దనీ, జేబు నుంచి భరించుకుంటున్నామనీ సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ప్రణాళిక పనులు గ్రామాలకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని క్షేత్రస్థా యి పరిశీలనకు దిగిన ‘నవతెలంగాణ’తో పలువురు సర్పంచులు,
గ్రామస్తులు తమ అభిప్రాయాల్ని తెలిపారు.
జిల్లాల్లో ఇదీ పరిస్థితి…
నల్లగొండ జిల్లాలో 31 మండలాలు, 844 జీపీలుండగా 34,83,648 మంది జనాభా ఉంది. ప్రణాళిక పనుల కోసం రూ.20 కోట్లు కేటాయించినట్టు అధికారులు చెబుతున్నా.. గ్రామాలకు ప్రత్యేక నిధులేమీ చేరలేదు. చండూరు మండలం ఉడుతపల్లికి రూ. 2 లక్షలా 68వేల 353 మంజూరుకాగా 14వ ఆర్థిక సంఘం నిధులని పంచాయతీ అధికారి తెలిపారు. నల్లగొండ మండలం రెడ్డికాలనీ జీపీకి కేవలం 37 వేల రూపాయలు రాగా జేసీబీ, పిచ్చిమొక్కల తొలగింపునకు కూడా సరిపోలేదు. శ్మశాన వాటిక స్థలం కోసం సర్వే చేసిన అధికారులు హద్దులు గుర్తించకుండానే వెళ్లిపోయారు.
నిజామాబాద్‌ జిల్లాకు రూ.7.3 కోట్లు రాగా 2011 జనాభా ప్రాతిపదికన ఒక్కో వ్యక్తికి రూ.1606 విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం రూ.66.90చొప్పునే ఇచ్చింది. ముప్కాల్‌ మండల కేంద్రాన్ని పరిశీలిస్తే విద్యుత్‌ స్తంభాల మార్పు, 6 డ్రెయినేజీల నిర్మాణం, 8 చోట్ల కల్వర్టుల నిర్మాణం, ట్రీగార్డులు వంటి పనులకు రూ.80లక్షల వరకు ఖర్చవుతాయని అంచనా వేసినా 14వ ఆర్థిక సంఘం నుంచి కేవలం రూ.3.46లక్షలే వచ్చాయి. ఒక్క ముప్కాల్‌ పంచాయతీకి రూ.77లక్షల కరెంటు బిల్లు బకాయి ఉంటే అందులో 10శాతం రూ.77వేలు చెల్లించాల్సి వచ్చిందని సర్పంచ్‌ తెలిపారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌ గ్రామంలో 600 కుటుంబాలు, 3,500 మంది జనాభా ఉండగా రెండు పాత ఇండ్లను కూల్చివేశారు. విద్యుత్‌ లైన్లను సరి చేయించారు. రూ.1.65లక్షలు వచ్చినట్టు అధికారి తెలపగా ఇప్పటికీ ఒక్క పైసా కూడా విడుదల కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాను పరిశీలిస్తే 4వేల జనాభా ఉన్న ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌ గ్రామానికి ఇంతవరకు ఏ నిధులు రాలేదు. అయినప్పటికీ శిథిలావస్థలో ఉన్న 12 ఇండ్లను కూల్చివేశారు. డ్రెయినేజీ శుభ్రం, గుంతల రోడ్లను పూడ్చటానికి రూ.40వేల వరకు ఖర్చు చేసినట్టు సర్పంచ్‌ వాపోయాడు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ప్రభుత్వం నుంచి పైసా కూడా అందలేదు. ట్రాక్టర్‌, జేసీబీల కిరాయిలు, సర్పంచులు చేతి నుంచి పెట్టుకుంటున్నారు. తెలకపల్లి మండలం కార్వంగ జీపీ పరిధిలో 4500 జనాభా ఉండగా ఆర్థిక సంఘం నిధులు రూ.7 లక్షలు మాత్రమే వచ్చాయి. జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేక నిధులేమీ అందలేదు.

ఊళ్లోంచి వెళ్లిపోయే పరిస్థితి
ప్రణాళిక బాగానే ఉన్నా పంచాయతీలకు ఒక్క పైసా ఇవ్వలేదు. దీంతో అప్పులు చేయాల్సి వస్తున్నది. ఏడు నెలలవుతున్నా జీపీ నుంచి ఒక్క రూపాయీ తీసుకున్నది లేదు. ఇప్పటిదాకా గౌరవ వేతనం రాలేదు. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే సర్పంచులు అప్పులపాలై గ్రామాలను వదిలివెళ్లిపోయే పరిస్థితి వస్తుంది.
– పొట్టపింజర నాగేశ్వరరావు, మల్లేపల్లి సర్పంచ్‌, కూసుమంచి

వస్తువులు తాకట్టు పెట్టినం
పారిశుధ్యం, రహదారుల మరమ్మతులు, వీధి లైట్ల ఏర్పాటుకు రూ.3లక్షల వరకు సొంతంగా ఖర్చు చేశాను. ఇప్పటి వరకైతే ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు. ఎప్పుడు విడుదల చేస్తుందోనని ఎదురుచూస్తున్నాం. ప్రజల నుంచి ఏం మాటలు పడాల్సి వస్తుందోనని తప్పని పరిస్థితిలో వస్తువులు తాకట్టుపెట్టి పనులు చేయిస్తున్నాను.
– కుర్సం సత్యనారాయణ, ఎర్రబోడు సర్పంచ్‌, కారేపల్లి, ఖమ్మం

3 లక్షల వరకు ఖర్చయ్యాయి
మా పంచాయతీకి లక్షా 90 వేల రూపాయలు మంజూరుకాగా ఊళ్లో పనులకు చాలడం లేదు. 3 లక్షల రూపాయల దాకా ఖర్చుచేశాం. సొంత డబ్బులు లక్షా 10 వేలు అందులో ఉన్నాయి. పెండింగ్‌ పనులకే వచ్చిన మొత్తం పోయాక ఏం అభివృద్ది సాధ్యమవుతుంది. ఇంకా అనేక పనులు చేయాల్సి ఉంది.
– రమావత్‌ ప్రియాంక, సర్పంచ్‌, కుంకుడుచెట్టు, పెద్దవూర మండలం, నల్లగొండ

అరకొర నిధులతో ఏం అభివృద్ధి?
అరకొర నిధులతో చేపట్టే పనులతో అభివృద్ధి సాధ్యం కాదు. పరిశుభ్రత పనులే ఇప్పటిదాకా జరిగాయి. మిషన్‌ భగీరథ ద్వారా మూడ్రోజులకోసారి మంచి నీరు వస్తుంది. గ్రామానికి 40 విద్యుత్‌ స్తంభాలు అవసరమైతే అధికారులు కేవలం 6 స్తంభాలు అందించారు. గ్రామాలు మరింత అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం తన వాటాగా నిధులివ్వాలి.
– మహేశ్వరమ్మ, కొండపల్లి సర్పంచ్‌, గద్వాల
పిచ్చి మొక్కలే పీకుతున్నారు
పనులు అంత సంతృప్తిగా జరగడం లేదు. కేవలం అధికారులు హడావిడి చేస్తూ రోడ్ల పక్కన పిచ్చిమొక్కలే పీకుతున్నారు. దీన్ని అభివృద్ధితో పోల్చడం సరికాదు. ఎక్కడ పడితే అక్కడ నీటిగుంతలు ఉన్నాయి. దోమలు విపరీతంగా వృద్ధి చెందుతున్నాయి. ప్రభుత్వం అన్ని రకాల పనులు చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తేనే అసలైన అభివృద్ధి.
– గుడవర్తి వెంకటేశ్వరరావు, అశ్వాపురం, గ్రామస్తుడు

Courtsey Navatelangana….

RELATED ARTICLES

Latest Updates