– రుణాలు మాఫీ చేసిన 10 బ్యాంకులు
– గతేడాది కంటే 10శాతం ఎక్కువ
ముంబయి : దేశంలోని అగ్రశ్రేణి 10 బ్యాంక్‌లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో ఏకంగా రాని బాకీల కింద రూ.19,000 కోట్ల రుణాలను రద్దు చేశాయి. గతేడాది ఇదే కాలం మాఫీ చేసిన వాటితో పోల్చితే 10 శాతం ఎక్కువ. 2019 జూన్ త్రైమాసికంలో రూ.17,00 కోట్ల మొండి బాకీలను రద్దు చేశాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రూ.4,363 కోట్ల ఎన్పీఏలను మాఫీ చేసింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) రూ.3,505 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.3,216 కోట్లు చొప్పున రద్దు చేశాయి. ప్రయివేటు రంగంలోని యాక్సిస్ బ్యాంక్ రూ.2,284 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ రూ.1,426 కోట్లు, ఇండస్ఇండ్ బ్యాంక్ రూ.1,250 కోట్ల చొప్పున ఎన్పీఏలను మాఫీ చేశాయి. తమ రుణ ఆర్డర్ బుక్‌ను సవరించుకోవడానికి ఆర్బీఐ అవకాశం ఇచ్చినందున గడిచిన జూన్ త్రైమాసికంలో ఎన్పీఏల రద్దు మొత్తంలో కొంత తగ్గిందని బ్యాంక్‌లు పేర్కొన్నట్టు ఈటీ ఓ కథనంలో వెల్లడించింది. మొండి బాకీల పరిష్కారంలో జాప్యం, ఆయా ఆస్తులకు అధిక కేటాయింపులు చేయడం ద్వారా వీటిని రద్దు చేశామని ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక్కరు తెలిపారు. ఆర్బీఐ డైరెక్షన్లో గతేడాది సెప్టెంబర్‌లో ఇంతకంటే భారీ మొత్తంలో మాఫీ చేసినట్టు తెలిపారు. ఈటీఐజీ రిపోర్ట్ ప్రకారం.. ఆర్థిక సంవత్సరం 2018-19లో మొత్తం 30 లిస్టెడ్ బ్యాంక్‌లు రూ.2.13 లక్షల కోట్ల మొండి బాకీలను రద్దు చేశాయి. అదే బాటలో 2019-20లోనూ రూ.2.29 లక్షల కోట్ల ఎన్పీఏలను రుణ పుస్తకాల నుంచి పక్కన పెట్టాయి. ఆయా పద్దులను రద్దు చేసినప్పటికీ బ్యాంక్ శాఖల స్థాయిలో రికవరీ ప్రక్రియ కొనసాగుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ వెబ్సైట్ ప్రకారం రద్దు చేసిన మొండి బాకీల నుంచి సగటున 10 శాతం రికవరీ మాత్రమే ఉంది. ప్రస్తుత కరోనా సంక్షోభ కాలంలో జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో మొండి బాకీలు మరింత పెరగవచ్చనీ.. వీటిని పరిష్కరించుకోవడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని యస్ సెక్యూరిటీస్ లీడ్ అనలిస్టు రాజీవ్ మెహతా పేర్కొన్నారు.
ఇదో పెద్ద స్కామ్
బ్యాంక్‌లకు చెల్లించని రుణాలను మోడీ ప్రభుత్వం ఎలా మాఫీ చేసింది. ఇది ఒక మెగా స్కామ్. ప్రభుత్వం తన మిత్రుల కోసం నిశ్శబ్దంగా వీటిని రద్దు చేసింది. ప్రజలు కష్టపడి సంపాదించుకున్న సేవింగ్స్‌ను లూటీ చేయడమే.. – ఏచూరి (సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి)
బ్యాంక్ అప్పుల మాఫీ (రూ.)
ఎస్బీఐ 4,363 కోట్లు
బీఓఐ 3,505 కోట్లు
కెనరా బ్యాంక్ 3,216 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ 2,284 కోట్లు
ఐసీఐసీఐ బ్యాంక్ 1,426 కోట్లు
ఇండుస్‌ఇండ్ బ్యాంక్ 1,250 కోట్లు
Courtesy: NT