రైల్వే ప్రయివేటీకరణకు పచ్చజెండా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద నెట్‌వర్కను కలిగి ఉన్న భారత రైల్వేలో ప్రయివేటీకరణ పర్వాన్ని కేంద్రం మొదలుపెట్టింది. అక్టోబర్‌ మొదటివారంలో దేశ తొలి ప్రయివేటు రైలుగా ‘తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌’ పట్టాలెక్కనున్నది.

అలాగే కనీసం 150 ప్రయివేటు ట్రైను సర్వీసులు మొదలవుతాయని భారత రైల్వే ప్రకటించింది. రైల్వేలో ప్రస్తుతం 24 రూట్లను గుర్తించామనీ, వాటిని ప్రయివేటు సంస్థలు నిర్వహిస్తాయని తెలిపింది. ఇందులో 14 ఇంటర్‌సిటీ సర్వీసులు, 10 ఓవర్‌నైట్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ సర్వీసులున్నాయి. అలాగే మరో నాలుగు సబర్బన్‌ సర్వీసులు(ముంబయి, కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్‌) ఉన్నాయి. ఇంటర్‌సిటీ సర్వీసుల్లో సికింద్రాబాద్‌-విజయవాడ రూట్‌ కూడా ఉన్నది. అలాగే ఓవర్‌నైట్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ ట్రైన్లలో సికింద్రాబాద్‌-హైదరాబాద్‌, సికింద్రాబాద్‌-ఢిల్లీ సర్వీసులు ఉన్నాయి. ఈనెల 27న జరిగే సమావేశంలో దీనిని ఖరారు చేస్తామని రైల్వే బోర్డు విడుదల చేసిన ఓ లేఖలో పేర్కొన్నది. లక్నో-ఢిల్లీ మధ్య అక్టోబర్‌ మొదటి వారంలో భారత దేశ తొలి ప్రయివేటు రైలుగా తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలెక్కనున్నది. ఇప్పటికే దీని కోసం టికెట్‌ బుకింగ్‌ను మొదలు పెట్టారు. లక్నో-ఢిల్లీ రూట్‌లో తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ఏసీ ప్రయాణచార్జీ రూ.1125గా నిర్ణయించారు. ఢిల్లీ-లక్నో రూట్‌లో ఇది రూ. 1280గా నిర్ణయించారు. అయితే మిగతా కొత్త రూట్ల ట్రైన్‌ చార్జీలు ఇంకా వెల్లడించాల్సి ఉన్నది. ప్రయివేటీకరణతో రైళ్ల నవీకరణకు దోహదం చేస్తుందని రైల్వే బోర్డు చైర్మెన్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. రైల్వే నుంచి నెమ్మదిగా బాధ్యతల నుంచి తప్పుకొనే ప్రయత్నం కేంద్రం చేస్తున్నదని రైల్వే సంఘాలు ఆరోపిస్తున్నాయి. మోడీ సర్కారు ‘ప్రయివేటీకరణ’ చర్యతో ఇప్పటి వరకు స్వల్పంగా ఉన్న టికెట్‌ ధరలు పెరిగే అవకాశమున్నదనీ, దీంతో సామాన్యులకు మరింత భారమవుతుందని ప్రజాసంఘాలు అంటున్నాయి.

Courtesy Nava telangana…

RELATED ARTICLES

Latest Updates