
- పడవ ప్రమాదంలో గల్లంతైనవారిలో
- మరో ఇద్దరి మృతదేహాలు లభ్యం
- గుర్తింపునకు డీఎన్‌ఏ పరీక్ష తప్పదు
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 19 : గోదారి పడవ ప్రమాద మృతుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. గురువారం రోజంతా వెతగ్గా రెండు మృతదేహాలను వెలికితీయగలిగారు. పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి సమీపంలో ఒక మృతదేహం దొరగ్గా.. కొవ్వూరు సమీపంలోని మద్దూరు లంకలో ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఇంకా 11 మంది ఆచూకీ లభ్యం కావాల్సి ఉంది. దొరికన రెండు మృతదేహాలూ పురుషులవేనని.. అవి గుర్తించడానికి వీల్లేనంతగా ఉబ్బిపోయి ఉన్నాయని వాటిని గుర్తించాలంటే డీఎన్‌ఏ పరీక్ష తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 36కు చేరింది. గల్లంతైన మిగతా 11 మందీ విగతజీవులై బోటులోనే ఉండిపోయారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోటును వెంటనే వెలికితీసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. దీంతో వారి బంధువుల్లో ఆందోళన పెరుగుతోంది.
హైదారాబాద్‌లోని రామాంతపూర్‌కు చెందిన సుశీల్ మృతదేహాన్ని గుర్తించడానికి బంధువులు చాలా ఇబ్బంది పడ్డారు. ప్రమాదం జరిగిన రెండో రోజునే సుశీల్‌మృతదేహం లభ్యమైంది. కానీ ఎవరూ గుర్తించకపోవడంతో మూడు రోజులు మార్చురీలోనే ఉండిపోయింది. చివరకు ఎవరూ పట్టించుకోకపోవడంతో అతని బంధువులు కొందరు మృతదేహాన్ని బాగా శుభ్రం చేయించి, ఫొటోలు తీసి హైదరాబాద్‌లోని మేనమామకు పంపించడంతో ఆయన గుర్తుపట్టారు.
సుశీల్ మృతదేహానికి గురువారం కాచిగూడ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదే ప్రమాదంలో సుశీల్ తల్లిదండ్రులు పవన్‌కుమార్, వసుంధరాదేవి కూడా గల్లంతయ్యారు. వారి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. అలాగే మంచిర్యాలకు చెందిన కారుకూరి రమ్యశ్రీ, వరంగల్ జిల్లాకు చెందిన బస్కే ధర్మరాజు (48), కొమ్ముల రవి, కొండూరి రాజకుమార్(38) ఆచూకీ తెలియాల్సి ఉంది. మరోవైపు.. 210 అడుగుల లోతులో మునిగిపోయిన పడవను వెలికితీసే దారి కోసం అధికారులు తంటాలు పడుతున్నారు.
పడవలో 93 మంది! దేవీపట్నం పోలీసులు ఆపేసినా..
మంత్రి అవంతి ఒత్తిడి తెచ్చారు: హర్షకుమార్
రాజమహేంద్రవరం సిటీ: గోదావరిలో ప్రమాదానికి గురైన పడవలో.. అది మునిగే సమయానికి 93 మంది ఉన్నారని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి గురవారం వచ్చిన ఆయన.. మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
దేవీపట్నం వద్ద పోలీసులు రాయల్ వశిష్ఠ పడవను ఆపారని.. కానీ, మంత్రి అవంతి శ్రీనివాస్ జిల్లా ఎస్పీపై ఒత్తిడి తెచ్చి పడవ కదిలేలా చేశారని ఆరోపించారు. అంతేకాదు.. పడవ జాడ సోమవారమే తెలిసినా.. మృతుల సంఖ్య లెక్కకు మించి ఉన్న విషయం బయటికి వస్తుందన్న భయంతోనే దాన్ని తీసేందుకు అధికారులు సుముఖంగా లేరన్నారు. హర్షకుమార్ తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అవంతి అన్నారు.
Courtesy Andhrajyothi..