
10వేల మంది ప్రముఖులపై నిఘా
వ్యక్తిగత డేటా సేకరణ… విశ్లేషణ
రాష్ట్రపతి, పీఎం, నలుగురు మాజీ
ప్రధానులు, 40 మంది ప్రస్తుత, మాజీ
సీఎంలు, 350 మంది ఎంపీలు
సామాజిక అశాంతికీ కుట్ర..
దేశ రహస్యాలు తెలుసుకునే యత్నం
ప్రభుత్వానికి తెలుసు: ఐటీ శాఖ
అనేక దేశాల్లో..!
ఒక్క భారత్‌లోనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా 30 లక్షల మంది సమాచారాన్ని చైనా సంస్థ జెన్‌హువా విశ్లేషిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఐరోపా సమాజ దేశాలు, నాటో కూటమి, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, కెనడా మొదలైన అనేక దేశాల వారి వ్యక్తిగత డేటాను నిరంతరం మానిటర్ చేస్తోంది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వాస్తవాధీన రేఖ వెంబడి కవ్వింపులకు దిగుతూ దురాక్రమణలకు ప్రయత్నిస్తున్న చైనా మరో భారీ కుట్ర పన్నింది. భౌతిక యుద్ధ యత్నాలతో పాటు సాంకేతిక యుద్ధానికి కూడా సమాయత్తమవుతోంది. దేశంలోని దాదాపు పదివేల మంది ప్రముఖుల, వారి బంధువులు, స్నేహితుల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, విశ్లేషిస్తూ సైబర్ దాడులకు పథక రచన చేస్తున్నట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సోమవారం ఓ సంచలనాత్మక కథనాన్ని ప్రచురించింది.
పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సామాజిక మాధ్యమ అకౌంట్లనే ప్రాథమికంగా తీసుకుని ఈ డేటాను సిద్ధం చేసింది. సరిహద్దు ఘర్షణల తరువాత భారత ప్రభుత్వం దాదాపు 100కి పైగా చైనా యాప్‌లను నిషేధించింది. ఈ చర్యతో చైనా కుతకుతలాడిపోతోంది. అటు భూతల ఘర్షణల్లో ఎదురుదెబ్బలు, ఇటు భారత్ అన్నివైపుల నుంచీ తమపై నిషేధాలు విధిస్తూ, వాణిజ్యాన్ని దెబ్బతీయడంతోడ్రాగన్-భారత్‌ను ఎదుర్కోడానికి ఈ మిశ్రమ సాంకేతిక యుద్ధ వ్యూహానికి పదునుపెడుతున్నట్లు సమాచారం.
ప్రముఖుల సామాజిక మాధ్యమ అకౌంట్లను, పోస్టులను నిరంతరం విశ్లేషిస్తూ ఈ మాధ్యమాల్లో నకిలీ వార్తలను పోస్ట్ చేయడం, దేశ అంతర్గత వ్యవహారాల్లోకి తలదూర్చి సామాజిక అశాంతిని ఎగదోయడం దీని లక్ష్యాలుగా తెలుస్తోంది.
ఎవరిపై నిఘా?
2018 నుంచి సాగిస్తున్న ఈ నిఘాలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహా దళాధిపతి, త్రివిధ దళాల అధిపతులు, సైన్యాధికారులు, జడ్జీలు, మాజీ ప్రధానులైన మన్మోహన్ సింగ్, దేవెగౌడ, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, గాంధీల కుటుంబ సభ్యులు, 350 మంది ఎంపీలు, మాజీ ఎంపీలు, 40 మంది ముఖ్యమంత్రులు, మాజీ సీఎంలు, గవర్నర్లు, ప్రతిపక్ష నాయకులు, ఠాక్రే, సింధియా, సంగ్మా, పవార్ కుటుంబాలు, బాలీవుడ్ తారలు, శాస్త్రరంగ నిపుణులు, ఐఐటీలు, ఐఐఎంల అధ్యాపకులు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, రాష్ట్రాల మంత్రులు.. ఇలా 1350 మంది ప్రముఖులున్నారు.
వీరందరి సమీప బంధువులు, స్నేహితులు, సామాన్యులకు సంబంధించిన వివరాలనూ సేకరిం చడం గమనార్హం. లోక్‌పాల్ న్యాయమూర్తి పీసీ ఘోష్, అనేకమంది మాజీసైనిక, నౌకా, వైమానిక దళ మాజీ ఛీఫ్‌లు, భారత్ పే స్థాపకుడు నిపుణ్ మెహ్రా, పారిశ్రామికవేత్తలు రతన్ టాటా, గౌతమ్ అదానీ, స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ, విదేశాంగ కార్యదర్శి హర్ష్ వర్ధన్ సింఘానియా, నీతీ ఆయోగ్ సిఇఓ అమితాబ్ కాంత్‌తో సహా 250 ఉన్నతాధికారులు, దౌత్యవేత్తలు అనేకమంది మాజీ అధికారులు కూడా చైనా నిఘాలో ఉన్నారు.
జర్నలిస్టుల్లో హిందూ గ్రూప్‌నకు చెందిన ఎన్. రామ్, జీ గ్రూప్ నకు చెందిన సుధీర్ చౌదరి, ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయి, మాజీ మీడియా సలహాదారు సంజయ్ బారు, ఇండియన్ ఎక్స్ ప్రెస్ చీఫ్ ఎడిటర్ రాజ్‌కమల్ ఉన్నారు. సచిన్ టెండూల్కర్ వంటి క్రీడాకారులు, సోనాల్ మాన్ సింగ్ వంటి కళాకారులను కూడా చైనా నిఘా వదిలిపెట్టలేదు. ప్రముఖ కేసుల్లో నిందితుల్నీ ఒక కంట కనిపెడుతోంది.
ఏ సంస్థ చేసింది?
ఓవర్సీస్ కీ ఇన్ఫర్మేషన్ డేటా బేస్ (ఓకేఐడీబీ) అని ఈ డేటా సేకరణ పేరు. చైనాలోని షెన్‌జెన్ నగరంలో ఉన్న జెన్‌హువా అనే సాంకేతిక సంస్థ ఈ పనిచేస్తోంది. ‘సామాజిక మాధ్యమం ద్వారా దేన్నైనా వాస్తవంగా మల్చవచ్చు (ఎనీథింగ్ కెన్ బీ టర్న్‌డ్ ఇన్‌టూ రియాలిటీ త్రూ సోషల్ మీడియా)’ అనేది దాని ఉపశీర్షిక. విదేశాల్లో 20 డేటా ప్రాసెసింగ్ కేంద్రాలున్న ఈ సంస్థ అధిపతి వాంగ్ జూఫెంగ్. ఐబీఎం సంస్థలో ఇంజనీర్‌గా పనిచేసిన ఆయన కృత్రిమ మేధ(ఏఐ), డేటా మైనింగ్‌లో నిపుణుడు. దాదాపు పది పన్నెండేళ్లుగా ఆయన ఏఐలో విశేషమైన అధ్యయనంతో డేటా విశ్లేషణలో ప్రబల శక్తిగా మారారు. మరో పన్నెండు టెక్నాలజీ సంస్థలతో కూడా ఆయనకు సంబంధాలున్నాయి.
చైనాలో ఆయన బృందంలో 50 మంది ఐటీ, ఏఐలో నిపుణులు మాత్రమే పనిచేస్తారు. వారితో పాటు ప్రపంచవ్యాప్తంగా 20 కేంద్రాల్లో ఉన్న ఇతర సిబ్బంది రోజుకు 15కోట్లమంది సమాచారాన్ని అలవోకగా విశ్లేషిస్తారని తెలుస్తోంది. భారత ప్రముఖుల డేటాను రియల్‌టైమ్ మానిటరింగ్ చేస్తున్నట్లు కూడా సమాచారం. ఈ జెన్‌హువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంపెనీ చైనా కమ్యూనిస్ట్ పార్టీ అండదండలతో పనిచేస్తోంది. నేరుగా సీసీపీ నేతలతో జెన్‌హువాకు సంబంధాలున్నాయి.

ఏంటి ప్రమాదం..?
జెన్‌హువా జరుపుతున్న ఈ డేటా విశ్లేషణ వల్ల కీలకమైన సైనిక సమాచారం, రక్షణ సంబఽంధ వ్యూహాలు… మొదలైనవి చైనాకు తెలిసే అవకాశాలున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో అసంతుష్ట సామాజిక శక్తుల విశ్లేషణ ద్వారా వేర్పాటు వాదానికి, సామాజిక అశాంతికి చైనా పాల్పడే అవకాశాలున్నాయి. ప్రభుత్వం వివిధ రంగాల్లో చేపడుతున్న అభివ్దృద్ధి కార్యక్రమాల వల్ల జరిగే లాభం, నష్టం అంచనావేసి- వాటిని అడ్డుకొనే రీతిలో వ్యూహరచన చేయవచ్చు. రాజకీయ పక్షాల మనసు అంచనా వేసి వాటికి అనుగుణంగా ప్రతికూల నకిలీ సమాచారాన్ని చేరవేయవచ్చు..
ఎలా తీసుకుంటారు?
ప్రధానంగా ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా, వాట్సా్‌పల ద్వారా కొంత సమాచారం తీసుకుంటారు. దీనికి తోడు వివిధ చానెళ్లలో, పత్రికల్లో, వెబ్‌సైట్లలో వస్తున్న సమాచారాన్ని కూడా తీసుకుని విశ్లేషిస్తారు. ఓ ప్రముఖ వ్యక్తి ఆలోచనా సరళి ఎలా ఉంది, ఆయన పార్టీ లేదా పబ్లిక్ ప్లాట్‌ఫాం ఎలా స్పందిస్తోంది, భవిష్యత్‌లో వైఖరి ఎలా ఉండొచ్చు వంటి సమాచారాన్ని విశ్లేషణ చేస్తారు.
అనేక ప్రజాస్వామ్య దేశాల్లో సోషల్ మీడియా పోస్టుల మీద అంత పెద్ద నిఘా ఉండదు. భారత్ లాంటి పెద్ద దేశాల్లో గత కొన్నేళ్లుగా కేవలం అంతర్గతంగా సాగుతున్న వ్యవహారాలపై నిఘాకు మాత్రమే ఈ సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్ట నిరసనల్లో కీలక వ్యక్తులు, నక్సల్ కార్యకలాపాలకు సంబంధించి హక్కుల కార్యకర్తల అకౌంట్లు, ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన సమాచార విశ్లేషణే జరుగుతోంది తప్ప విదేశీ అకౌంట్ల జోలికి పోవడం లేదు.
చైనా హైబ్రిడ్ యుద్ధానికి పాల్పడుతోందన్న విషయం కేంద్రానికి తెలుసని డేటా ప్రాసెసింగ్ బిల్లు రూపొందించిన ఓ అధికారి తెలిపారు. పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారాన్ని మాత్రమే తీసుకున్నట్లు తెలిసిందని, అకౌంట్ల హ్యాకింగ్‌కు పాల్పడ్డట్లు ఇంతవరకూ సమాచారం లేదని చెప్పారు. అయితే సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగ పరిచి నకిలీ పోస్టులు పెట్టేందుకు, సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే అవకాశాలున్నాయని అంగీకరించారు. అయితే దీనిపై ఓ కన్నేసి ఉంచారా లేదా అన్నది తెలియరాలేదు. ప్రభుత్వం దీనిపై అధికారికంగా స్పందించాల్సి ఉంది.ఎందుకు ఊరుకున్నట్లు: కాంగ్రెస్
డేటా సేకరణ వ్యవహారం గురించి ప్రభుత్వానికి తెలుసా? లేక తెలియదా? తెలిస్తే ఎందుకు ఊరుకున్నట్లు? ఐటీ శాఖ ఏం చేస్తోంది? ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడవద్దని చైనాకు గట్టి వార్నింగ్ ఎందుకు ఇవ్వలేకపోయారు? అని కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా ప్రశ్నించారు. సరిహద్దు సమస్యను ఇంతవరకూ ఎందుకు పరిష్కరించలేకపోయారని కూడా నిలదీశారు.