కార్పొరేట్ల వద్దే ఖజానా

Published on 

Share on facebook
Share on whatsapp
Share on telegram
Share on print
Share on email

10శాతం మంది సంపన్నుల వద్దే సగానికి మించిన సంపత్తి
– 50శాతం మంది పేదల దగ్గర 15శాతం మాత్రమే
న్యూఢిల్లీ : ‘పెట్టుబడిదారీ’ దోపిడీ అంతకంతకూ పెరుగుతూపోతున్నది. కార్మికుల శ్రమ దోపిడీతో పెట్టుబడి దారులు కోటానుకోట్ల సంపద కూడబెట్టుకుంటున్నారు. బడాబాబులు వేగంగా మరింత సంపన్నులవుతూ ఉంటే.. పేదలు ఆర్థికంగా చితికిపోతున్నారు. సంపదంతా కొంత మంది పెద్దల దగ్గరే కేంద్రీకృతమవుతుండగా.. ఎక్కువ మంది జనం పేదలుగా మారుతున్నారు. ఒకవైపు కొందరు ధనికులు రోజుల వ్యవధిలో కోట్లకు పడగలెత్తుతుండగా.. మరోవైపు పేద ప్రజల రోజూ జీవిత పోరాటాన్ని చేయాల్సి వస్తున్నది. కనీసం ఆరోగ్య అవసరాలకూ పైసల్లేక తల్లడిల్లుతున్నారు. దేశంలోని పదిశాతం మంది ధనికుల దగ్గర సగానికి పైగా (55 శాతం) సంపద మూలుగుతున్నది. కాగా, అట్టడుగున ఉన్న 50శాతం పేద ప్రజల దగ్గర దేశ సంపదలో 15 శాతం మాత్రమే ఉండటం గమనార్హం. దేశంలో ఆందోళనకరంగా పెరుగుతున్న అసమానతలకు ఇది నిదర్శనం పట్టుతున్నది. 2016 సంవత్సరానికిగాను ఈ అసమానతలను అధ్యయన సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌ రీసెర్చ్‌లో ఈ విషయం బయటపడింది. ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌లోనే అత్యధికంగా ఆర్థిక తారతమ్యాలున్నట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. దేశంలో విద్య, ఆరోగ్యం వంటి ప్రాథమిక అవసరాలకూ పేదలు నోచుకోవడం లేదు. దీంతో పేదరికంలో మగ్గుతున్నవారూ వృద్ధిలోకి వస్తున్నది చాలా తక్కువేనని అధ్యయనం వివరించింది.
ప్రపంచ దేశాల్లోనూ..
ప్రపంచ దేశాల్లోనూ ఈ ఆర్థిక అసమానతలు పెరుగుతు న్నాయి. ప్రపంచ సంపదలో సగం మేరకు కేవలం పదిశాతం మంది ధనికుల దగ్గరే కేంద్రీకృతమైంది. యూరప్‌లో
టాప్‌ పది శాతం ధనికుల దగ్గర 37శాతం సంపద పోగవ్వగా.. మిడిల్‌ ఈస్ట్‌ దేశాల్లో ఈ అసమానత అధికంగా ఉన్నది. అక్కడ పదిశాతం మంది ధనికుల దగ్గర 61శాతం సంపద చేరింది. 2016 నాటికి అమెరికాలో పదిశాతం మంది బిగ్‌షాట్ల దగ్గర దేశంలోని 47శాతం సంపద పేరుకుపోయినట్టు తేలింది.

1990వ దశకం నుంచి తీవ్రమవుతూ..
భారత్‌లో 1991లో ఆర్థిక సంస్కరణలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఆర్థిక అసమానతలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ సంస్కరణల తర్వాత అధికాదాయాల వృద్ధి జరిగినప్పటికీ.. అదే తీరులో ఆర్థిక అసమానతలూ పెరిగినట్టు ఈ అధ్యయనం వెల్లడించింది. 1990కి పూర్వం అధిక సంపన్నులైన ఒక శాతం మంది దగ్గర దేశ సంపదలో పదిశాతం మేరకు ఉండేది.
కానీ, తర్వాత నుంచి కొంత మంది చేతుల్లోకి అధిక సంపద తరలుతుండటం పెరుగుతూ వచ్చింది. 2016నాటికి ఒక్క శాతం మంది సంపన్నుల దగ్గరకు దేశంలోని సంపదలో 21శాతం చేరడం గమనార్హం. ఆసియాలోని రష్యా, చైనా, ఇండియాల్లో ఈ అసమానతలు భిన్నంగా నమోదయ్యాయి. 90వ దశకం ఆరంభంలో చైనా, ఇండియాలో ఈ అసమానతలు పెద్దగా ఏమీ లేకున్నా.. భారత్‌లో 2000కల్లా అసమా నతలు తీవ్రమయ్యాయి. నేడు ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలో కెల్లా.. భారతే అత్యధిక అసమానతలున్న దేశంగా పరిణమించింది.

Courtesy NavaTelangana..

RELATED ARTICLES

Latest Updates