- రుణాలతోనే ముందుకు..
- కేటాయింపుల్లో కోతే కారణం
- సాగునీటి ప్రాజెక్టులపై పెరుగుతున్న భారం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్లో సాగునీటి రంగానికి చేసే కేటాయింపులు కేవలం పాత బకాయిలకే సరిపోతాయని ఆశాఖ అధికారు లు అంటున్నారు. ఆదాయం, అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవ లెక్కలను రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించటంతో బడ్జెట్ కేటాయిం పులకు తుది సవరణలు చేసే పనిలో అధికారులు నిమగమై ఉన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం గత మూడేండ్లుగా రాష్ట్ర బడ్జెట్లో రూ. 25,000 కోట్లు కేటాయిస్తున్నప్పటికీ ఖర్చు మాత్రం 20 వేల కోట్లు దాటడం లేదు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.22,000కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ బకాయిలు పూర్తిగా తీరలేదు. ఓట్ ఆన్ అకౌంట్లో సాగునీటి ప్రాజెక్టులకు రూ. 10,000 కోట్లు కేటాయించగా రెండవ త్రైమాసికం ముగిసే ఆగస్టు నెలాఖరు వరకూ రూ. 7,600 కోట్లు ఖర్చు పెట్టారు. ఆర్థిక మాంద్యం పేరుతో అన్ని శాఖల బడ్జెట్లో 40 శాతం కోత విధించాలని ఆర్థిక శాఖ నుంచి మౌఖిక ఉత్తర్వులు అందటంతో ఆయా శాఖలు సర్దుబాటు పనిలో పడ్డాయి. నీటిపారుదల శాఖ బడ్జెట్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదని అధికారులంటున్నారు. నిధుల కొరతతో ప్రధాన ప్రాజెక్టుల కింద భూసేకరణ, పునరావాస కార్యక్రమాలు ముందుకు సాగటం లేదు. మిషన్ కాకతీయ సహా చిన్న నీటి వనరుల కోసం రూ. 2,000 కోట్లు కేటాయి స్తునప్పటికీ రూ. 700 కోట్లు మాత్రమే ఖర్చు పెడుతున్నారు. ఈ సంవత్సరం ఈ పద్దు కింద ఇప్పటి వరకూ 20 శాతం నిధులు కూడా ఖర్చు పెట్టలేదు.
బకాయిలు రూ. 11,000 కోట్లు…
రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిలు రూ. 11,000 కోట్లకు చేరాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. గత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికే బకాయిలు రూ. 8,000 కోట్లు కాగా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో ఖర్చు పెట్టిన రూ. 7,600 కోట్లు బకాయిలకే సరిపోయినట్టు స్పష్టమవుతున్నది. గత మూడు సంవత్సరాలుగా కాళేశ్వరం ప్రాజెక్టు పైనే అత్యధికంగా నిధులు ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టుపై బడ్జెట్ కేటాయింపుల్లో రూ. 4,500 కోట్లు ఖర్చు పెట్టగా రూ. 2,700 కోట్లు బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాల నుంచి ఖర్చు పెట్టారు. అయినప్పటికీ ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు మరో 2,500 కోట్లు చెల్లించాల్సి ఉన్నది. పాలమూరు ప్రాజెక్టుపై రూ. 520 కోట్లు ఖర్చు పెట్టగా రూ. 1,500 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి ఉన్నది. శ్రీశైలం ఎడమ కాల్వ, దేవాదుల, సీతారామ, డిండి తదితర ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల బకాయిలు రూ. 5,000 కోట్లకు దాటాయి. భూసేకరణ, పునరావాసం, విద్యుత్ బిల్లుల బకాయిలు ఇతర నిర్వహణ ఖర్చుల బకాయిలు కూడా పేరుకు పోతున్నాయి. బడ్జెట్లో కేటాయింపుల మేరకు ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకపోవటంతోనే బకాయిలు పెరిగిపోతున్నాయని నీటిపారుదల వాఖ అధికారులంటున్నారు.
ఆరు ప్రాజెక్టుల కోసం రూ.60,000 కోట్లు రుణం
ప్రాజెక్టుల వ్యయానికి కేటాయింపులకు మధ్య వ్యత్యాసం పెరిగిపోవటంతో రాష్ట్ర ప్రభుత్వం రుణాల కోసం బ్యాంకులను ఆశ్రయించింది. మొదటి దశలో కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేయగా రెండవ దశలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి సీతారామ, దేవాదుల, వరద కాల్వ, తుపాకులగూడెం ప్రాజెక్టులను ఈ సంస్థ పరిధిలోకి తీసుకువచ్చింది. వాణిజ్య బ్యాంకులు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణాలను దశల వారీగా సేకరిస్తున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.30,000 కోట్లు, పాలమూరు ప్రాజెక్టుకు రూ.20,000 కోట్లు, జలవనరుల సంస్థ ప్రాజెక్టుల కోసం రూ.10,000 కోట్లు రుణంగా ఇవ్వటానికి ఇప్పటికే వివిధ సంస్థలు అంగీకరించాయి. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.20,000 కోట్లు రుణంగా తీసుకున్నారు. పాలమూరు ప్రాజెక్టుకు కూడా రుణ మొత్తం విడుదలైతే పనులు వేగం పుంజుకుంటాయని ఇంజినీర్లంటున్నారు. జలవనరుల సంస్థ కింద చేర్చిన నాలుగు ప్రాజెక్టుల కోసం రూ.1,500 కోట్లు రుణంగా తీసుకున్నారు. వీటిలో సీతారామ ప్రాజెక్టు కోసం రూ.576 కోట్లు, వరద కాల్వకు రూ.541 కోట్లు, దేవాదుల ప్రాజెక్టు కోసం రూ. 230 కోట్లు, తుపాకులగూడెం ప్రాజెక్టు కోసం రూ.230 కోట్లు రుణం అందినది. ప్రాజెక్టుల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణంలో 20 శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సి ఉన్నది. బడ్జెట్లో ఈ మొత్తానికి కూడా కేటాయింపులు చేయాల్సి ఉన్నది.
(COURTECY NAVA TELANGANA)