ఉపాధి పెరిగినా…ఇంటింటికీ సమస్యలే
- ఆర్డర్లు కొందరికే… అందరికీ కావాలంటున్న కార్మికులు
- మహిళా కార్మికులకు ప్రోత్సాహం అంతంతే
- చర్మవ్యాధులతో పవర్లూమ్ కార్మికుల ఇక్కట్లు
- పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు నిల్
సిరిసిల్ల.. పవర్లూమ్ కార్మికుల అడ్డా. ఒకప్పుడు ఉపాధిలేక పదుల సంఖ్యలో ఆత్మహత్యలు. నిత్యం వలసలు. నేడు పరిస్థితి కొంతలో కొంత మారి ఉపాధి పెరిగింది. ఇదంతా నాణానికి ఒకవైపే. ఆ ఉపాధి ఆరేడునెలలు మాత్రమే దక్కుతున్నది. మరోవైపు సిరి సిల్ల పవర్లూమ్ రంగుల ప్రపంచంలో కార్మికులు చీకటి బతుకులు దర్శనమిస్తూనే ఉన్నాయి. నాలుగైదు నెలలు అర్ధాకలితో పస్తులుంటున్నారు. ఒకటి, రెండు రూముల రేకులిండ్లల్లో మరమగ్గాల చప్పుళ్ల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. ఆర్డర్లు కొందరికే దక్కటంతో మిగతావాళ్లంతా ఆసాముల దగ్గర కూలికెళ్లాల్సిన పరిస్థితి. పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాల్లేక ఓవైపు…చర్మ, కంటి, వినికిడి సంబంధ వ్యాధులతో ఇంకోవైపు సతమతమవుతూ జీవనం వెళ్లదీస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో 24 వేల మరమగ్గాలున్నాయి. ఈ పవర్‌లూమ్స్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి 30 వేల మంది దాకా ఆధారపడి బతుకుతున్నారు. ఎక్కువగా వార్పి న్, వైపని కార్మికులు, కండెలు చుట్టేవారు, ఆటోట్రాలీ వారు ఉపాధి పొందుతున్నారు. అయితే, ఈ రంగం పై కొందరిదే గుత్తాధిపత్యం ఉండటంతో ఆర్థికంగా వెనుకబడి ఉన్న పద్మశాలీలు అట్లాగే ఉండిపోతు న్నారు. బతుకమ్మ చీరలు, ఆర్వీఏమ్, అంగన్వాడీ బట్టలు, కేసీఆర్ కిట్టులోని బట్టల తయారీ ఆర్డర్లను చేనేత, జౌళి శాఖ సిరిసిల్లకు కేటాయించడంతో అక్కడి కార్మికులకు ఆరు నుంచి ఏడు నెలల వరకు ఉపాధి దొరుకుతున్నది. ఈ సమయంలో కార్మికుల కొరత కూడా ఏర్పడుతున్నది. అయితే, ఆర్డర్లు అయిపోయాక నాలుగైదు నెలలు అరకొర పనులతో కార్మికులు దుర్భరంగా బతుకులీడుస్తున్నారు. గతం లో నెలకు ఏడెనిమిది వేలు కూడా వచ్చేది గగనంగా కాగా, ప్రస్తుత ఆర్డర్లతో ఆదాయం రూ.15 వేల దాకా పెరిగింది. ఆదాయం వస్తున్నట్టు కనిపిస్తున్న ప్పటికీ ఏడాదికి లెక్కగడితే నెలకు తొమ్మిది వేల లోపే దక్కుతున్న పరిస్థితి. ‘బతుకమ్మచీరలు వచ్చినంక ఉపాధి పెరిగింది. కానీ, మరమగ్గాలపై కొందరిదే పెత్తనం. ఆసాములకే లాభం, వర్కర్లకేం దక్కట్లేదు. మీటర్‌కు రూ.4.25పైసలే ఇస్తున్నరు. దీన్ని పెంచితే గిట్టుబాటైతది. ప్రభుత్వమే పేద కార్మికులందరికీ మరమగ్గాలను అందిస్తే సొంతంగా నడుపుకుంటరు. ఎక్కువ మిగులుతది. పేద కుటుంబాలూ బాగుపడ తయి’ అని రాజీవ్‌నగర్‌కు చెందిన ఎలిగేటి శ్రీనివాస్ అన్నాడు.
ఈఎస్ఐ ఆస్పత్రి శంకుస్థాపనకే..
పవర్లూమ్ కార్మికులు ప్రతినెలా వైద్యం కోసం రూ.1000 నుంచి రూ.2వేల దాకా ఖర్చుపెడుతున్న పరిస్థితి ఉంది. పవర్లూమ్ షెడ్లల్లో వెలుతురులేమి సమస్యతో కంటి సంబంధ వ్యాధులతో కార్మికులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ‘క్వాలిటీ జరీ పెట్టకపోవడంతో పోగులు ఊసిపోతున్నాయి. వెలుతురు సరిగా లేక వాటిని అతికేందుకు ఇబ్బంది పడుతున్నాం’ అని రూప అనే మహిళా కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మరమగ్గాల సెంటర్లలో ధూళీ, దారపు పోగులతో కూడిన సన్నని దుమ్ముతో కార్మికులుశ్వాస, చర్మ సంబంధ వ్యాధుల పాలవుతు న్నారు. కొందరు ఊపిరితిత్తుల వ్యాధులకూ గురి అవుతున్నారు. ఇటీవల అడ్డగట్ల శ్రీను అనే కార్మికులు ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయాడని ఓ పవర్ లూమ్ షెడ్డులో పనిచేసే కార్మికులు చెప్పారు. అయి తే, అనారోగ్యాల పాలైనప్పుడు చేతుల నుంచి డబ్బు లు పెట్టి చూపించుకుంటున్నామని, ఈఎస్ఐ ఆస్ప త్రిని ఏర్పాటుచేసి తమకు ఆరోగ్యకార్డులిస్తే తమపై భారం తగ్గుతుందని కొందరు కార్మికులు చెప్పారు. కాగా ఈఎస్ఐ ఆస్పత్రిశంకుస్థాపనకే పరిమితమైంది.పనిప్రదేశాల్లో సౌకర్యాలు నిల్… గుర్తింపూ అంతంతే
పనిప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కూడా లేవు. తాగునీటి వసతి చాలా చోట్ల కనిపించలేదు. కరెంటు పోయిన సందర్భంలో విశ్రాంతి తీసుకునే వసతి ఎక్కడా లేదు. పవర్లూమ్ షెడ్లల్లో వెలుతురు లేమి సమస్య కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొన్ని మగ్గాలపై లైట్లు ఉన్నప్పటికీ స్పష్టంగా కనిపించట్లేదు. మర మగ్గం నడిచేటప్పుడు పోగులు తెగితే అతుకు పెట్టేం దుకు ఏకాగ్రత చూడాల్సి ఉంటుంది. వెలుతురు లేమి సమస్యతో కార్మికులు ఇక్కట్లు ఎదుర్కొంటు న్నారు. 70 నుంచి 100 వరకు మరమగ్గాలున్న ఏడె నిమిది షెడ్లలో పరిశీలించగా ఎక్కడా టాయిలెట్ సౌకర్యం కనిపించలేదు. కొందరు కార్మికులు సొంతరగా రూ.70-80వేలు పెట్టి మరమగ్గాల జోడిని కొనుక్కుని తమ ఇండ్లల్లోనే నడుపుకుంటు న్నారు. రెండు,మూడు గదుల ఇంటిలో కుటుంబం మొత్తం ఉండటం, అక్కడే మరమగ్గాలు నడపటం ఇబ్బందికరంగా మారింది. ముఖ్యంగా, మరమగ్గాల సౌండ్‌తో ఇంట్లో పిల్లల చదువులకు తీవ్ర ఆటంకం ఎదురవుతున్నది. పవర్లూమ్ రంగంలో మహిళా కార్మికులు వందలోపే పనిచేస్తున్నారు. వీరిలో ఏ ఒక్కరికీ కూడా ప్రభుత్వ గుర్తింపు కార్డు లేదు.
(COURTECY NAVA TELANGANA)