మూడు రోజుల ముందే ప్రచురించిన ‘దేశీదిశ’
తెలంగాణలోని పులుల అభయారణ్యంలో యురేనియం మైనింగుకు కేంద్రం నిర్ణయంతో భయారణ్యంగా మారనున్న నల్లమల అభయారణ్యం
తెలంగాణలోని అమ్రాబాద్ పులుల అభయారణ్యంలో యురేనియం మైనింగ్ చేయాలనీ కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని అటవీ అధికారులు వ్యతిరేకిస్తున్నారు. జాతీయ పులుల పరిరక్షణా సంస్థ అనుమతి లేకుండా ఎటువంటి డ్రిల్లింగుకు మేము అనుమతించమని ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ పత్రికతో అటవీశాఖ ఉన్నతాధికారి చెప్పారు. ఈ పులుల సంరక్షణా కేంద్రం మహబూబ్ నగర్, నల్లగోండా జిల్లాల్లో 2,800 చదరపు కిలోమీ విస్తీర్ణంలో నెలకొన్నది. దీంట్లో 83 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో మైనింగ్ జరపాలని డిపార్ట్మెంట్ అఫ్ ఆటమిక్ ఎనర్జీ భావిస్తున్నది. పులుల అభయారణ్యంలో యురేనియం మైనింగ్ నిర్ణయం పట్ల పర్యావరణ వేత్తలు, మానవహక్కుల ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
(అందాల అడవిపై ‘అణు’బాంబు
- అమ్రాబాద్ నెత్తిన యురేనియం పిడుగు..
- 20 వేల టన్నుల నిక్షేపాల అన్వేషణకు అనుమతి
- 83 చదరపు కిలోమీటర్లలో తవ్వకాలు..
- 4000 భారీ బోర్లు వేయనున్న అణుశక్తి శాఖ
- దేశంలోనే అత్యంత నాణ్యమైన
- యురేనియం లభ్యమయ్యేది ఇక్కడే
- అతి పెద్ద అభయారణ్యానికి ముప్పు
- అనుమతులతో సర్వత్రా ఆందోళన
- మన పెద్ద పులి కనుమరుగే
- గిరిజన జాతులకు స్థానచలనం
- దేశ ప్రయోజనాల కోసం తప్పదు
- కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరణ
”అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో భారీ స్థాయిలో యురేనియం నిక్షేపాలున్నాయి. భూమిపై ఆక్సిజన్ వ్యాపించి-జీవజాలం పుట్టుకకు ముందునాటి కాలానికే ఇవి భూరాతి పొరల్లో నిక్షిప్తమై ఉన్నట్లు ఓ అంచనా. ఇంతవరకూ దేశంలో లభ్యమైన యురేనియం నిక్షేపాలు చాలా తక్కువ గ్రేడ్ ఉన్నవి…. వాటి లభ్యత కూడా బహు స్వల్పం. దేశమంతా మేం పరిశీలించి సూక్ష్మస్థాయిలో అన్వేషణ జరిపినప్పుడు కడప బేసిన్ కిందకు వచ్చే తెలంగాణ ప్రాంతంలో నిక్షేపాలు గణనీయంగా ఉన్నట్లు నివేదికలు వచ్చాయి. అత్యంత నాణ్యమైన నిక్షేపాలివి. ఇవి చాలా ఆశాజనకంగా కనిపించాయి. అత్యధికంగా లభ్యత కూడా కనిపిస్తోంది. రెండు విభిన్న రాతిపొరల ఉపరితలంలో నిక్షిప్తమై ఉన్నాయి. మా మొదటి ముఖ్యమైన లక్ష్యం… అక్కడి (అమ్రాబాద్) అటవీ భూమిలో తవ్వకాలు జరిపి వీటిని వెలికితీయడమే…’’
– అణుశక్తి శాఖ సమర్పించిన వివరణ పత్రం: తెలంగాణ భామినికి వాలుజడ నల్లమల. రమణీయమైన ప్రకృతికి, అపురూపమైన జంతుజాలానికి ఇది నెలవు. అంతేకాదు… చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ప్రాచీన ఆదివాసీ తెగలెన్నింటికో విస్తారమైన ఈ కొండకోనలే ఆవాసప్రాంతాలు. ఇపుడు వాటి భవితే ప్రశ్నార్థకమవుతోంది. బతుకు ఛిద్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం త్వరలోనే పెద్ద పెద్ద యంత్రాల మోతలతో, తవ్వకాలతో తన రూపు కోల్పోబోతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిక్షేపాల అన్వేషణకు కేంద్ర అణుశక్తి సంస్థకు కేంద్ర అటవీ సలహా మండలి సూత్రప్రాయంగా అనుమతి ఇవ్వడం కేవలం చరిత్రను చెరిపేయడమే కాదు.., ప్రముఖ శైవక్షేత్రాలు, ఆదివాసులైన చెంచులు, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దేశంలోనే రెండో పెద్దదైన పులుల అభయారణ్యం -అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్టుల అస్తిత్వానికి పెద్ద దెబ్బ. ఈ నిర్ణయం ఆ ప్రాంతవాసుల్లో భయాందోళనలు రేపుతోంది. మే 22న అటవీ సలహా మండలి సమావేశం జరిగింది. ఇందులో ఆమోదించిన అంశాల ప్రకారం అమ్రాబాద్ అభయారణ్యంలోని 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో యురేనియం తవ్వకాలు జరుగుతాయి. 20 వేల టన్నుల యురేనియం అక్కడ ఉన్నట్లు ప్రాథమిక అంచనా. ఈ తవ్వకానికి 4000 పైచిలుకు బోర్లు వేస్తారు. అణుశక్తి విభాగం ప్రతిపాదనలో లోపాలున్నట్లు చెబుతూనే దేశ ప్రయోజనాల దృష్ట్యా సూత్రప్రాయ అనుమతి ఇస్తున్నామని చెప్పడం విశేషం. సంబంధిత పత్రాలు, ఆధారాలను పరిశీలించాకే తుది అనుమతి ఉందని స్పష్టం చేసినప్పటికీ ఇది కేవలం సాంకేతిక లాంఛనమేనని నిపుణులు అంటున్నారు.
2008 నుంచే ప్రయత్నాలు: ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో 1.99 లక్షల హెక్టార్లలో నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఆ అడవుల్లో రూ.లక్షల కోట్ల విలువైన యురేనియం నిక్షేపాల నిల్వలు ఉన్నట్లు ఆధారాలు లభ్యమయ్యాయి. 2008 నుంచి అణుశక్తి సంస్థ ఖనిజాన్వేషణ మొదలుపెట్టింది. 2014 వరకు ఈ అన్వేషణ కొనసాగింది. ఇవి లభ్యం కావడంతో అమ్రాబాద్-ఉడిమిల్ల, నారాయణపూర్ ప్రాంతాల్లో డ్రిల్లింగ్ అనుమతుల కోసం అణుశక్తి విభాగం ప్రతిపాదన పంపింది. నాగార్జునసాగర్ ప్రాంతంలోని నిడ్గుల్ రక్షిత అటవీ ప్రాంతంలో 7 చదరపుకిలోమీటర్ల పరిధిలోని రెండు బ్లాకులలోనూ, అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లోని 76 చదరపు కిలోమీటర్ల పరిధిలోని రెండు బ్లాకుల్లో యురేనియం అన్వేషణ, సర్వేకు అనుమతులు ఇవ్వాలని కోరింది. ఇక తవ్వకాలకు మూడేళ్ల క్రితమే బీజం పడింది. పర్యావరణ శాస్త్రవేత్తలు, ఆదివాసీ ప్రజా సంఘాల నిరసనలకు భయపడిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుట్టుచప్పుడు కాకుండా యురేనియం నిక్షేపాలపై రహస్య సర్వేలు నిర్వహించాయి. శాసనసభ ఎన్నికలకు ఏడాదిన్నర ముందే ఇది వివాదాస్పదం కావడంతో తవ్వకాలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం జరగలేదని, ఎన్నికలు ముగిశాక దీన్ని మళ్లీ బయటకు తీస్తారని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా దీనిని అడ్డుకుంటామని ప్రధాన రాజకీయ పక్షాల నేతలు, ప్రజాప్రతినిధులు గొప్పగా చెప్పారు. అయితే ఈ విషయం తాత్కాలికమేనని యురేనియం తవ్వకాలు కచ్చితంగా జరిగి తీరుతాయని ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాలెన్నిటినో ప్రచురించింది. యురేనియం తవ్వకాలు మొదలైతే అటవీప్రాంతం తన రూపురేఖలను కోల్పోయి ఓ పెద్ద పారిశ్రామిక వాడగా మారిపోతుంది.
దెబ్బతినే జాతులు- వన్య ప్రాణులు: నల్లమలలో ఉన్నంత ప్రకృతి వైవిధ్యం మరెక్కడా కానరాదు. అనేక వృక్షజాతులిక్కడ ఉన్నాయి. ఇక జంతుజాతుల విషయానికొస్తే.. పెద్దపులులకు ఇది ప్రధాన ఆవాసం. చిరుతలు, ఎలుగులు, వైల్డ్ క్యాట్స్, అడవి కుక్కలు, అడవి పందులు,, కృష్ణ జింకలు, మచ్చల దుప్పిలు, తోడేళ్లు, ప్యాంగోలీన్లు, కొండచిలువలు, నాగుపాములు, అనేక ఉభయచరాలు అక్కడ ఉన్నాయి. 2014లో అమ్రాబాద్ పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటైంది. 2611 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇది శ్రీశైలం-సాగర్ టైగర్ రిజర్వ్ (3296 చ.కిమీ)తరువాత రెండో అతి పెద్దది. అమ్రాబాద్ అడవిలో 13 పెద్ద పులులున్నట్లు సమాచారం.
శైవ క్షేత్రాల మనుగడకు ముప్పు: నల్లమలలో యురేనియం తవ్వకాలు చేపడితే దేశంలోనే ప్రసిద్ధిగాంచిన శైవక్షేత్రాల ఉనికికి కూడా ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైల ఉత్తర ద్వారం ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆంజనేయస్వామి దేవాలయం, గోరాపురం భ్రమరాంబ మల్లికార్జున దేవాలయం, లొద్ది మల్లయ్య, సలేశ్వర క్షేత్రాలు కూడా యురేనియం తవ్వకాలకు అనుమతించిన ప్రదేశాల్లో ఉండటంతో భక్తుల్లో సహజంగానే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైల మల్లికార్జునుణ్ని దర్శించుకోవడానికి నల్లమల గుండానే ప్రయాణించాల్సి ఉంటుంది. యురేనియం తవ్వకాలు ప్రారంభమైతే రాకపోకలపై కఠినమైన నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయి.
మైదానాలకు చెంచుల తరలింపు?: నల్లమల నిండా కోయజాతుల వారున్నారు. చెంచులు కూడా ఎక్కువే. యురేనియం నిక్షేపాలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 120 గూడేలు ఉన్నాయని, దాదాపు 11 వేల మంది జీవిస్తున్నారని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. యురేనియం వివిధ ఖనిజాల మిశ్రమంగా ఉంటుందని, దానిని వేరుచేసే ప్రక్రియలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా చెంచుల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యురేనియం తవ్వకాల పేరిట చెంచుపెంటలను కూడా మైదాన ప్రాంతాలకు తరలించడం అనివార్యమవుతోంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సమీపంలోనే కృష్ణా నది ప్రవహిస్తోందని, యురేనియ వెలికితీత వల్ల శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోని నీరు కూడా కలుషితమవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అటవీ శాఖ నుంచి వ్యతిరేకత!: యురేనియం నిక్షేపాల అన్వేషణను తెలంగాణ అటవీ శాఖ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రక్షిత అటవీ ప్రాంతాల్లో వందల ఫీట్ల లోతు డ్రిల్లింగ్ చేయడం వల్ల అటవీ సంపద నాశనమయ్యే ప్రమాదముందని పేర్కొంటోంది. ఈ మేరకు 2016లో కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించింది.
కేంద్రం వాదన ఇదీ!: అణుశక్తి నుంచి ఇంధన స్వయం సమృద్ధి సాధించాలన్నది కేంద్రం లక్ష్యం. ప్రస్తుతం దేశంలో అణుశక్తి కర్మాగారాల స్థాపిత సామర్థ్యం 6780 మెగావాట్లు మాత్రమే! 2030 నాటికి దీన్ని 40వేల మెగావాట్లకు పెంచి, దేశంలోని ప్రతి పల్లెకూ వెలుగులు పంచాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.)
(ఆంధ్రజ్యోతి నవతెలంగాణ తదితర దినపత్రికల సౌజన్యంతో..)